రోడ్డెక్కిన కిక్కు
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:10 AM
బెంజిసర్కిల్ వద్ద రెండు సర్వీసు రోడ్లున్నాయి. ఒకవైపుబార్ అండ్ రెస్టారెంట్ ఉంది. మరో సర్వీసు రోడ్డులో కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. ఈ దుకాణంలో మద్యం సీసాలను కొన్న వ్యక్తులు అక్కడే ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ ప్రదేశంలో బహిరంగంగా మందు తాగేస్తున్నారు. మరికొంతమంది రెండో సర్వీసు రోడ్డుకు అనుబంధంగా ఉన్న నారా చంద్రబాబునాయుడు కాలనీలోకి ప్రవేశిస్తున్నారు. డిస్పోజబుల్ గ్లాసులు, నీళ్ల సీసాలు వెంట తెచ్చుకుని, ఆటోల్లో పార్టీ చేసుకుంటున్నారు. కొంతమంది రోడ్డు పక్కన ఆపిన కార్ల పక్కకు వెళ్లి సిట్టింగ్ వేస్తున్నారు. గాంధీనగర్‌లోని ఐలాపురం హోటల్‌కు ఎదురుగా ఉన్న ప్రదేశంలోనూ ఇదే పరిస్థితి. మద్యంషాపు నుంచి సరుకును కొని, అక్కడున్న రోడ్డు డివైడర్‌పై దుకాణం పెడుతున్నారు. ఇక్కడే బహిరంగంగా మద్యం తాగుతున్నారు. ఆ మత్తులో వచ్చీ పోయే వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. మహిళలను అసభ్యకరంగా కామెంట్ చేశారు. ప్రశ్నిస్తే తిరగబడుతున్నారు.
నగరంలో రోడ్లపైనే యథేచ్ఛగా మద్యపానం
ప్రధాన రోడ్లనూ వదలని మందుబాబులు
పార్కుల్లోనూ సిట్టింగ్‌లు.. వివాదాలు
ఇబ్బంది పడుతున్న పాదచారులు
మహిళలు, అమ్మాయిలపై కామెంట్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంలో కీలకమైన ప్రాంతాల్లో బహిరంగ మద్యంపానం శ్రుతిమించుతోంది. మద్యం షాపులు తెరవగానే మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో వాలిపోతున్నారు. మద్యం సీసాలు కొని అక్కడే తాగడం మొదలుపెడుతున్నారు. ఇది వాహనదారులకు, ఆ మార్గంలో రాకపోకలు సాగించే పాదచారులకు ఇబ్బందిగా మారుతోంది. వైసీపీ పాలనలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. బార్ అండ్ రెస్టారెంట్లను మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. నాడు షాపులన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండటంలో అమ్మకాలు మాత్రమే ఉండేవి. దీంతో మందుబాబులు షాపుల్లో మద్యం కొని, ఖాళీ ప్రదేశాలకు వెళ్లి తాగడం ప్రారంభిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు లాటరీ విధానంలో కేటాయించింది. ఏ షాపు వద్దా పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వలేదు. తాగుడుకు బానిసలైన వారు షాపులు తెరవడానికి ముందే అక్కడికి చేరుకుంటున్నారు. ఎక్కడ ఖాళీస్థలం కనిపిస్తే అక్కడ సిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
పాడైన పార్కుల్లో..
సందర్శకులు లేని, పాడైన పార్కులు మందుబాబులకు కేంద్రాలుగా మారుతున్నాయి. వాటిలో గ్రూపులుగా కూర్చుని మందువిందు చేసుకుంటున్నారు. రాణిగారితోటకు ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పార్కులో చెట్ల కింద సందర్శకులు కూర్చోవడానికి గ్రానైట్‌తో దిమ్మలు నిర్మించారు. కరోనా తర్వాత నుంచి ఈ పార్కును వీఎంసీ పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా పార్కులో పిల్లలు ఆడుకునే ఆట పరికరాలు పాడైపోయాయి. దీంతో ఈ పార్కులోకి సందర్శకులు, వాకర్స్ రావడం క్రమంగా తగ్గిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాచ్‌లుగా వచ్చి మద్యం తాగుతున్నారు. అంతేకాకుండా నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఖాళీ స్థలాలు ఉన్నాయి. కొంతమంది యజమానులు వాటికి ఎలాంటి ప్రహరీలు నిర్మించకపోవడంతో మద్యపానం కోసం ఆ ప్రాంగణాల్లోకి చేరుతున్నారు. రహదారులకు పక్కన, రోడ్డు డివైడర్ల వద్ద మద్యం తాగుతున్న వ్యక్తుల వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, అమ్మాయిలను అసభ్యకరంగా కామెంట్లు చేయడంతో వివాదాలు జరుగుతున్నాయి. యనమలకుదురు- అవనిగడ్డ కరకట్ట మార్గంలో ఒకచోట రెండు బార్ అండ్ రెస్టారెంట్లు, పెదపులిపాక వద్ద మద్యం షాపు ఉంది. ఇక్కడ మద్యం తాగేసిన మందుబాబులు కిక్ ఎక్కువకావడంతో కరకట్టపైకి చేరి వీరంగం చేస్తున్నారు.