Share News

ఉచితం మాటున అనుచితం

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:54 AM

‘భవానీ దీక్షల విరమణకు వచ్చే భక్తులకు అన్ని సేవలు ఉచితంగా అందజేయాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను అతిథులుగా భావించాలి. ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలి.’ ఉన్నతాధికారుల సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలివి. ఈ ఆదేశాలను వీఎంసీ ఎస్టేట్‌ విభాగం పక్కన పెట్టేసింది. భవానీ దీక్షల విరమణ తొలిరోజు నుంచే క్లోక్‌రూమ్‌, చెప్పుల స్టాండ్ల కాంట్రాక్టర్‌ దోపిడీకి తెరతీశారు. భక్తులకు ఉచితంగా అందజేయాల్సిన సేవలకు సొంతంగా ధరలు నిర్ణయించారు. ఆమె ఆదేశాలతో కౌంటర్లలో పనిచేసే సిబ్బంది భక్తుల నెత్తిపై చేయి పెడుతున్నారు. తమ చేతులు తడిపితేనే భద్రత అంటున్నారు.

ఉచితం మాటున అనుచితం
కెనాల్‌ రోడ్డులో ఏర్పాటుచేసిన క్లోక్‌రూమ్‌, చెప్పుల స్టాండ్‌

భవానీ దీక్ష విరమణ ఉత్సవాల్లో ఓ కాంట్రాక్టర్‌ చేతివాటం

భక్తుల ఉచిత సేవలకు రుసుము వసూలు

క్లోక్‌రూమ్‌లు, చెప్పుల స్టాండ్‌ల్లో దోపిడీ

బ్యాగ్‌కు రూ.20, చెప్పులకు రూ.10 వసూలు

పట్టించుకోని వీఎంసీ ఎస్టేట్‌ విభాగం

కనీసం కనిపించని ‘ఉచితం’ బోర్డులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/చిట్టినగర్‌) : భవానీ దీక్షల విరమణకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భవానీలు, భక్తుల బ్యాగ్‌లు, చెప్పులు భద్రపరచడానికి ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఐదు ప్రదేశాల్లో క్లోక్‌రూమ్‌లు, చెప్పుల స్టాండ్లను ఏర్పాటు చేశారు. ఇవికాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఏర్పాటు చేయడానికి ఆరో పాయింట్‌ను ఎంపిక చేశారు. ఈ క్లోక్‌రూమ్‌లు, చెప్పుల స్టాండ్ల నిర్వహణకు సంబంధించి వీఎంసీలోని ఎస్టేట్‌ విభాగం టెండర్లను ఆహ్వానించింది. రథం సెంటర్‌, వీఎంసీ ఎదురుగా ఏర్పాటుచేసిన క్లోక్‌రూమ్‌ల్లో మూడు షిఫ్టుల్లో 60 మంది పనిచేయాలి. ఒక్కో షిఫ్టులో 20 మంది విధుల్లో ఉండాలి. సీతమ్మవారి పాదాలు, రాజీవ్‌గాంధీ పార్కు ఎదురుగా ఏర్పాటుచేసిన క్లోక్‌రూమ్‌ల్లో నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో 12 మంది పనిచేయాలి. పున్నమిఘాట్‌ వద్ద ఏర్పాటుచేసిన క్లోక్‌రూమ్‌లో షిఫ్టుకు ఆరుగురు చొప్పున.. మూడు షిప్టుల్లో 18 మంది విధుల్లో ఉండాలి. ఇవికాకుండా అత్యవసర కౌంటర్‌లో షిఫ్టుకు నలుగురు చొప్పున మూడు షిఫ్టుల్లో 12 మంది ఉండాలి. మొత్తంగా 174 మందిని ఈ కౌంటర్లలో నియమించాలి. ఇలా కౌంటర్లను నిర్వహించినందుకు కాంట్రాక్టర్‌కు వీఎంసీ.. ఒక్కో ఉద్యోగికి రోజుకు రూ.600 చొప్పున చెల్లిస్తుంది. 25వ తేదీ వరకు మొత్తంగా వీఎంసీ రూ.5.22 లక్షలను కాంట్రాక్టరుకు చెల్లిస్తుంది. ఈ కౌంటర్లలో భక్తులు, భవానీల వస్తువులను, చెప్పులను భద్రపరిచినందుకు వారి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు. కానీ, కాంట్రాక్టర్‌ మాత్రం దీన్ని ఉల్లంఘించి బ్యాగ్‌కు రూ.20, చెప్పులకు రూ.10 వసూలు చేస్తోంది.

‘ఎస్టేట్‌’ ఏం చేస్తున్నట్టు?

క్లోక్‌రూమ్‌లు, చెప్పుల స్టాండ్ల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించిన ఎస్టేట్‌ విభాగం వాటిని పర్యవేక్షించాలి. టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టరును ఎంపిక చేయగానే, ఈ విభాగం చేతులు దులిపేసుకుంది. ఈ కౌంటర్లలో ఎలాంటి రుసుము వసూలు చేయకుండా.. పరిశీలించేందుకు ఎస్టేట్‌ విభాగానికి చెందిన సిబ్బందిని నియమించాలి. ఆ పని చేయట్లేదు. కనీసం ఉచిత బోర్డులను కూడా ఏర్పాటు చేయలేదు. ఇలా బోర్డులు ఏర్పాటుచేసినప్పటికీ కౌంటర్లలో సిబ్బంది భక్తులను దబాయించి మరీ డబ్బు వసూలు చేస్తున్నారు. గత ఏడాది భవానీ దీక్షల విరమణ సమయంలో ఈ మహిళా కాంట్రాక్టర్‌ రూ.160కు టెండరును దాఖలు చేయగా, ఈసారి ఏకంగా రూ.600కు దాఖలు చేసింది. వీఎంసీ నుంచి వచ్చే డబ్బుతో పాటు భక్తుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు తగిన సిబ్బందినే ఇక్కడ నియమించుకుంది. కాగా, ఉచితంగా సేవలు అందజేయాల్సిన కౌంటర్లలో ఈ దోపిడీ ఏమిటని భక్తులు మండిపడుతున్నారు.

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం..

భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తుల చెప్పులు, బ్యాగులను వీఎంసీ ఏర్పాటుచేసిన క్లోక్‌రూమ్‌లో ఉచితంగా భద్రపరుచుకునే సదుపాయం కల్పించాం. ఇక్కడ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా వసూలుచేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం. అలాగే, భక్తులకు తెలిసేలా ‘ఉచిత’ బోర్డులు ఏర్పాటుచేస్తాం. - టి.శ్రీనివాస్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌

Updated Date - Dec 22 , 2024 | 12:54 AM