Share News

‘గాంధీ’బోర్డు సమావేశం రసాభాస

ABN , Publish Date - Feb 16 , 2024 | 12:28 AM

గాంధీ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు బోర్డు సమావేశం గురువారం రసాభాసగా జరిగింది. ఏడుగురు అసమ్మతి డైరెక్టర్లను ఓవైపు, చైర్మన్‌, నలుగురు డైరెక్టర్లను మరోవైపు ఉంచి గురువారం నిర్వహించిన ఈ సమావేశం అర్ధంతరంగానే ముగిసింది.

‘గాంధీ’బోర్డు సమావేశం రసాభాస

చైర్మన్‌తో కుమ్మక్కై తప్పుడు నివేదిక

విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తాం.. : గాంధీ బ్యాంకు డైరెక్టర్లు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : గాంధీ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు బోర్డు సమావేశం గురువారం రసాభాసగా జరిగింది. ఏడుగురు అసమ్మతి డైరెక్టర్లను ఓవైపు, చైర్మన్‌, నలుగురు డైరెక్టర్లను మరోవైపు ఉంచి గురువారం నిర్వహించిన ఈ సమావేశం అర్ధంతరంగానే ముగిసింది. చైర్మన్‌ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. బ్యాంకు అభివృద్ధితో పాటు రుణాల మంజూరు, ఇతర లావాదేవీలకు సంబంధించి బోర్డు అనుమతి కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని బ్రాంచీల నుంచి వచ్చిన రుణ దరఖాస్తులను పరిశీలించిన బోర్డు సభ్యులు అత్యధిక భాగాన్ని అంగీకరించారు. అయితే, చైర్మన్‌కు సన్నిహితుడైన ఓ వ్యక్తి తీసుకొచ్చిన రూ.50 లక్షల రుణ అర్జీని బోర్డు సభ్యులు వ్యతిరేకించారు. కాగా, కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న విశాఖ బ్రాంచి వ్యవహారంపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సమయంలోనే చైర్మన్‌ సమావేశం నుంచి వెళ్లిపోయారు.

సహకార శాఖ అధికారులపై ఫిర్యాదు చేస్తాం..

బ్యాంకు అక్రమాలపై సహకార శాఖ విచారణ నివేదిక తప్పులతడకగా ఉందని బోర్డు డైరెక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన యజమాని నుంచి ముందుగా షరతులతో కూడిన అంగీకారపత్రాన్ని బోర్డు ముందు ప్రవేశపెట్టి ఉంటే, విచారణ అధికారి ఎందుకు పరిశీలించలేదని అసమ్మతి డైరెక్టర్లు ప్రశ్నించారు. ఇద్దరు డైరెక్టర్లు స్థలాన్ని పరిశీలించామని చెబుతున్నా దాన్ని ఎందుకు బోర్డులో రికార్డు చేయలేదన్నారు. అగ్రిమెంట్‌ చేయకుండానే అడ్వాన్స్‌ చెల్లించారని ఆందోళనకు దిగిన డైరెక్టర్లు బ్రాంచి ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు నివేదికలో పేర్కొనడం విచారణలోని డొల్లతనాన్ని తెలియజేస్తోం దన్నారు. భవన యాజమాన్యం రూ.28 లక్షలకే ఫర్నీచర్‌, స్ట్రాంగ్‌రూమ్‌, లాకర్లు, కంప్యూటర్లను ఏర్పాటు చేసిందని, తమకు రూ.5 లక్షలు మిగిలాయని చైర్మన్‌ చెబుతున్నారని, అయితే, భవన యజమాని పేరుపై బిల్లులు ఎక్కడ ఉన్నాయని, వాటిని విచారణ అధికారి ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. కొత్త బ్రాంచి ఏర్పాటుకు ఐటీ కమిటీ ఆమోదం తీసుకున్నారని నివేదికలో రాశారని, అసలు ఐటీ కమిటీ అనేదే బ్యాంకులో లేదన్నారు. ‘ట్రైనింగ్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు అంటూ ఏమీ లేవని నివేదికలో పేర్కొన్నారు. మరి రిటైర్డ్‌ సహకార అధికారులను ఆ పోస్టులో ఎలా తీసుకున్నారు. ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు.’ అని డైరెక్టర్లు ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటిపైనా తాము విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 12:28 AM