Share News

మానవత్వం..‘గోరా’ అభి‘మతం’

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:07 AM

నేడు గోపరాజు రామచంద్రరాజు జయంతి

మానవత్వం..‘గోరా’ అభి‘మతం’

యవ్వనంలోనే కుల, మత రేఖలు చెరిపేసి.. కృష్ణాజిల్లా నుంచి నాస్తికత్వ ఉద్యమానికి శ్రీకారం

సమాజంలో అసమానతలు, కుల, మత ఛాయలు చెరిగిపోవాలని యవ్వనంలోనే కంకణం కట్టుకున్నారు. ప్రజలకు మూఢ నమ్మకాలపై కాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలపై విశ్వాసం ఉండాలని గాఢంగా విశ్వసించారు. అందుకోసం ఎన్నో ఆటు పాట్లను ఎదుర్కొన్నారు. పనిచేసే చోట వ్యతిరేకతనూ మూటగట్టుకున్నారు. చివరికి ఉద్యోగాన్ని వదిలేసి సమాజంలో మార్పు కోసం అడుగులేశారు. ఆయనే గోరా (గోపరాజు రామచంద్రరాజు). హేతువాద ఉద్యమానికి బీజాలు వేసిన గోరా జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీలైఫ్‌)

గోరా అసలు పేరు గోపరాజు రామచంద్రరాజు. కులం, మతం కాకుండా సమాజంలో మానవత్వం పరిమళించాలని విద్యార్థి దశ నుంచే ఆయన బలం గా విశ్వసించారు. అందుకోసం అంచలంచెలుగా పోరాటం మొదలు పెట్టారు. నాస్తికత్వ ఉద్యమానికి కృష్ణాజిల్లాలో మొదటిగా పునాదులు వేశారు. ఆ విత్త నాలను ప్రపంచవ్యాప్తంగా నాటారు. సమాజంలో నీతి కావాలంటే నాస్తికత్వం అవసరమని గాఢంగా విశ్వసించారు. విద్యార్థి దశలో ఆయనను స్నేహితులు నువ్వు మంచివాడివే కానీ నీలో వచ్చిన లోటల్లా ఆ నాస్తికత్వమే అన్నారు. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. సాంఘిక అసమానతలను పెంచు తున్న కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.

జంధ్యాన్ని విసిరేసి..కులాన్ని వదిలేసి

కాకినాడ, మద్రాసు నగరాల్లో విద్యాభ్యాసం చేసిన ఆయన మచిలీపట్నం కళాశాలలో వృక్షశాస్త్ర విభాగ ప్రొఫెసర్‌గా పనిచేశారు. నాస్తిక భావాలను వ్యాప్తి చేస్తున్నారని అక్కడ రెండుసార్లు డిస్మిస్‌ చేశారు. తర్వాత 1940లో ఆయనే ఉద్యోగాన్ని వదిలేశారు. 1928లో బహిరంగంగా తనకు ఏ కులం లేదని ఒంటిపై ఉన్న జంధ్యాన్ని తీసి విసిరేశారు. దీనితో కులం నుంచి ఆయ నను బహిష్కరించారు. 1936 నుంచి నాస్తిక ప్రచారం విస్తృతంగా చేశారు. కృష్ణాజిల్లా కనుమూరులో 1942 ఫిబ్రవరి 28, మార్చి ఒకటో తేదీల్లో నాస్తిక ప్రథమ మహాసభలు నిర్వహించారు. వయోజన విద్య, అస్పృశ్యత నిర్మూలన, గ్రామపారిశుధ్యం, మహిళాభివృద్ధి, మూఢనమ్మకాలకు వ్యతిరేకం, జాతీయో ద్యమ ప్రచారం, గ్రంథాలయ ఉద్యమం, కులాంతర వివాహాలు, సహ పంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలు చేపట్టారు.

పటమటలో నాస్తిక కేంద్రం

తొలుత ముదునూరులో నాస్తిక ప్రచారం మొదలుపెట్టారు. 1947లో ముదునూరు నుంచి విజయవాడ పటమటకు వచ్చి నాస్తిక కేంద్రాన్ని స్థాపిం చారు. 1949లో సంఘం పత్రికను స్థాపించారు. ఈ నాస్తికత్వాన్ని దేశవ్యాప్తం చేశారు. 1970 జనవరిలో అఖిల భారత నాస్తిక మహాసభలు నిర్వహించారు. ఇటలీ, పశ్చిమజర్మనీ, హాలెండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, అమెరికా, కెనడా, ఫీజీదీవులు, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఇండోనే షియా, సింగపూర్‌, శ్రీలంక దేశాల్లో పర్యటించి నాస్తికత్వాన్ని ప్రచారం చేశారు. అక్కడ నాస్తిక సంఘాలను నెలకొల్పారు. ఇండియన్‌ రేషనలిస్ట్‌ అసోసియేషన్‌ స్థాపకుల్లో గోరా ఒకరు. దీనికి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. జాతీయ, భూదాన ఉద్యమంతోపాటు హేతువాద ఉద్యమాన్ని సమాంతరంగా నడి పారు. గాంధీజీ, వినోభాతో సంబంధాలు కొనసాగిస్తూనే పెరియర్‌ ఈవీ రామ స్వామినాయకర్‌, త్రిపురనేని రామస్వామి, ఎస్‌.రామనాథన్‌, జీడీ నాయుడు వంటి వారితో సంబంధాలు నడిపేవారు. కృష్ణాజిల్లాలో ప్రారంభించిన నాస్తిక ఉద్యమాన్ని ఆనాడే ఆయన విదేశాలకు తీసుకెళ్లారు. ఇప్పటి విజయవాడలో ఏటా అంతర్జాతీయ నాస్తిక మహాసభలు నిర్వహిస్తారు. ఇక్కడికి విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు.

పేరుకో సిగ్నేచర్‌

సమాజంలో మార్పు యువతరం మాత్రమే తీసుకురాగలదని బలంగా నమ్మిన వ్యక్తి గోరా. అందుకే నాస్తికత్వ ప్రచారంలో యువకులను భాగస్వా ములను చేసుకున్నారు. నాడు విద్యాభ్యాసం చేస్తున్న యువతకు దీని గురించి వివరించేవారు. ఆ మార్పును తన ఇంటి నుంచే చూడాలని భావిం చారు. గోరా పిల్లలకు మతఛాయలు లేని పేర్లు పెట్టారు. నాడు మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండేవి. పుట్టిన ప్రతి బిడ్డకు తాతల పేర్లు, భగవం తుడి పేర్లను పెట్టేవారు. అమ్మాయిలకు గ్రామదేవతల పేర్లు ఉండేలా నామ కరణం చేసేవారు. ఈ వ్యవస్థకు భిన్నంగా గోరా సంతానానికి నామకరణాలు చేశారు. ఆ పేర్ల వెనుక ఒక ఉద్యమస్ఫూర్తి ఉండాలనుకున్నారు. పెద్దకు మార్తెకు మనోరమ అని కొలంబోలో ఉండగా మిత్రులు పేరు పెట్టారు. 1930 లో ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు కుమారుడు జన్మించాడు. అతనికి లవణం అని నామకరణం చేశారు. 1932లో గాంధీ ఇర్విన్‌ ఒడంబడిక సమ యంలో మూడో సంతానంగా జన్మించిన కుమార్తెకు మైత్రిగా పేరు పెట్టారు. గాంధీజీ జాతీయ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జన్మించిన కుమార్తెకు విద్య అని నామకరణం చేశారు. ఐదో సంతానంగా కుమారుడు 1936 డిసెంబరులో పుట్టాడు. 1937 ప్రారంభంలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్‌ పార్టీ మొదటిసారిగా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. దీనితో అతడికి విజ యం అని పేరు పెట్టారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన ప్పుడు జన్మించిన కుమారుడికి సమరం అని నామకరణం చేశారు. 1941లో ఆయనకు ఏడో సంతానంగా కుమారుడు జన్మించాడు. అది ప్రపంచంలో హిట్లర్‌, ముసోలినీ టోజో వంటి వారు నియంతలుగా రాజ్యమేలుతున్న సమ యం. దీంతో అతడికి నియంత అని పేరు పెట్టారు. ఎనిమిదో సంతానంగా 1945లో కుమార్తె జన్మించింది. అప్పుడు ప్రపంచ వాతావరణం, దేశ పరిస్థి తుల్లో మార్పులు మొదలయ్యాయి. దీనితో ఆమెకు మారు అని పేరు పెట్టా రు. చివరిగా, తొమ్మిదో సంతానంగా జన్మించిన కుమార్తెకు నౌ అని నామకర ణం చేశారు. మనుమలకు మిలావ్‌, చునావ్‌, సాదిక్‌, పవర్‌, వజీర్‌, గ్రాం, రాహత్‌, వికాస్‌, ఆదేశ్‌ అని పేర్లు పెట్టారు. మనవరాళ్లకు సకల, సుగతి, క్రాంతి, సూయజ్‌, రశ్మి, కీర్తి, దీక్ష, జగతి, రజత, సబల అని పేర్లు పెట్టారు. కులమతాలతో సంబంధం లేకుండా వారికి వివాహాలు జరిపించారు.

నాలుగో తరమూ గోరా బాటలోనే..

కులం, మతం లేని సమాజాన్ని చూడాలని గోరా సంకల్పం తీసు కున్నారు. నాస్తిక ఉద్యమానికి ఆయన ఒక్కరే ముందుగా అడుగులు వేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10వేల మంది వరకు నాస్తికత్వం వైపు ఉన్నారు. ఏటా విజయవాడ నాస్తిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తాం. మేమంతా మూడో తరంలో ఉన్నాం. ఇప్పుడు నాలుగో తరం వచ్చింది. వారూ గోరా ఆశ యాలను కొనసాగిస్తున్నారు. ఇక్కడున్న నాస్తిక కేంద్రంలో కులాంతర వివాహాలు జరుగుతాయి. కులాంతర వివాహాలు చేసుకుని కుటుంబ పెద్దలు ఏం చేస్తారోనన్న భయంతో ఉన్న వారికి ఇక్కడ కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం.

- కీర్తి, గోరా మనవరాలు

Updated Date - Nov 15 , 2024 | 01:07 AM