Share News

ఏమా వెండి కథ

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:45 AM

కార్గో రవాణా ముసుగులో ఆర్టీసీ బస్సుల్లో అక్రమంగా వెండి రవాణా అవుతుండటం కలకలం రేపుతోంది. గత నెలలో బందరు నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులో అక్రమంగా 25 కేజీల వెండి రవాణా కావటం, అది పట్టుబడటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏమా వెండి కథ

ఆర్టీసీ బస్సులో అక్రమంగా వెండి రవాణా

పెడన నుంచి విశాఖకు 25 కేజీలు సరఫరా

ఎలాంటి బిల్లులు లేని వెండిని పట్టుకున్న స్క్వాడ్‌

తిరిగి పార్టీకి అప్పగించేసిన అధికారులు

కేసు పెట్టకుండా అప్పగించడంపై అనేక ఆరోపణలు

(ఆంరఽధజ్యోతి, విజయవాడ) : కార్గో రవాణా ముసుగులో ఆర్టీసీ బస్సుల్లో అక్రమంగా వెండి రవాణా అవుతుండటం కలకలం రేపుతోంది. గత నెలలో బందరు నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులో అక్రమంగా 25 కేజీల వెండి రవాణా కావటం, అది పట్టుబడటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎలాంటి కేసు నమోదు చేయకుండా సీజ్‌ చేసిన వెండిని సదరు యజమానికి అప్పగించేశారు. స్క్వాడ్‌ అధికారులు, వెండి యజమానులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. సెప్టెంబరు 28వ తేదీన మచిలీపట్నం నుంచి విశాఖపట్నం బయల్దేరిన ఆర్టీసీ బస్సు పెడనకు రాగా, అక్కడ ఎలాంటి బిల్లులు లేని 25 కేజీల వెండిని అక్రమంగా లోడ్‌ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న రీజనల్‌ ఆర్టీసీ స్క్వాడ్‌ బృందం ఆ బస్సులో ఎక్కి విశాఖపట్నం వరకు వెళ్లింది. విశాఖపట్నంలో సరుకు దింపుతుండగా, స్క్వాడ్‌ అధికారులు బిల్లులు లేని వెండిని గుర్తించి సీజ్‌ చేశారు. ఇక్కడి నుంచి కథ మలుపు తిరిగింది. వెండిని సీజ్‌ చేసిన విషయం తెలుసుకున్న యజమానులు అక్కడకు వచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. సీజ్‌ చేసిన బిల్లులు లేని వెండిని స్క్వాడ్‌ అధికారులు వారికి అప్పగించేశారు. సాధారణంగా సీజ్‌ చేసిన వాటిని పార్టీలకు ఇవ్వకూడదు. స్థానిక పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి కేసు పెట్టాలి. లేదంటే.. మచిలీపట్నం బస్‌ డిపోకైనా అప్పగించాలి. ఇవేమీ చేయకుండా సదరు వెండిని యజమానులకు అప్పగించేయడం వెనుక కథ ఏమిటన్న ఆరోపణలు వస్తున్నాయి.

రహస్యంగా..

ఆర్టీసీలో విజిలెన్స్‌ విభాగం ఎంతగా నిద్రపోతోందో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఈ వెండికి ఎలాంటి బిల్లులు లేవు. బిల్లులు లేకుండా రవాణాకు వస్తే వాణిజ్య పన్నుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఆ పని కూడా చేయలేదు. బిల్లుల్లేని ఈ వెండిని కార్గో రవాణాలో భాగంగా అధికారికంగా బుకింగ్‌ కూడా చేయలేదు. కేవలం డ్రైవర్‌కు ఇస్తే ఆయన తన సీటు కింద పెట్టుకుని రవాణా చేయటం గమనార్హం. ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఇద్దరికీ వెండి రవాణా విషయం తెలుసు. సాధారణంగా అయితే, ఆ ఇద్దరు డ్రైవర్లకు చెకింగ్‌ స్క్వాడ్‌ అధికారులు చార్జిమెమోలు ఇవ్వాలి. ఎస్‌ఆర్‌లో నమోదు చేయాలి. కానీ, ఈ వ్యవహారంలో మాత్రం స్క్వాడ్‌ అధికారులు రహస్యంగా ఉండిపోయారు.

విజిలెన్స్‌ దృష్టి సారించేనా..?

మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సుల్లో తరచూ వెండి, బంగారం అనధికారికంగా రవాణా అవుతోందన్న విమర్శలు ఎప్పటినుంచో వస్తున్నాయి. ఈ వ్యవహారాలపై రీజనల్‌ స్క్వాడ్‌ అధికారులు దృష్టి సారించారు. కానీ, కొందరు అధికారులు దీనిని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పక్కా సమాచారంతో బస్సులో ఎక్కిన రీజనల్‌ స్క్వాడ్‌ విశాఖ పట్నం వరకు ప్రయాణించింది. అక్కడ వెండి ని పట్టుకుని సీజ్‌ చేసింది. బిల్లులు లేని వెండిని పెడనలో కూడా పట్టుకోవచ్చు. అయినా యజమానులు ఎవరో తెలుసుకోవ డానికి విశాఖపట్నం వరకు వెళ్లారు. అలాంటపుడు సదరు యజమానులపై కేసు నమోదు చేయకుండా రావడమే ఈ ఆరోపణలకు ప్రధాన కారణం. అవినీతి మత్తులో జోగుతూ నిద్రపోతున్న విజిలెన్స్‌ ఇప్పటికైనా ఈ అంశంపై దృష్టి సారిస్తుందా లేదా వేచి చూడాలి.

Updated Date - Oct 10 , 2024 | 12:45 AM