సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:53 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం పర్యటన ఏర్పాట్లపై పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ, మంత్రి రవీంద్రలు మంగళవారం కలెక్టర్ బాలాజీ, ఎస్పీ ఆర్.గంగాధరరావు, ఇతర అధికారులతో కలిసి వేర్వేరుగా పరిశీలించారు.
మచిలీపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం పర్యటన ఏర్పాట్లపై పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ, మంత్రి రవీంద్రలు మంగళవారం కలెక్టర్ బాలాజీ, ఎస్పీ ఆర్.గంగాధరరావు, ఇతర అధికారులతో కలిసి వేర్వేరుగా పరిశీలించారు. స్వచ్ఛతా హి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వస్తున్నందున ఆంధ్రా జాతీయకళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్, డంపింగ్‌యార్డ్, సమావేశం జరిగే టీడీడీ కల్యాణమండపం ప్రాంతాలవద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం అమృత్‌పఽథకానికి మ్యాచింగ్ గ్రాంట్‌ను కేటాయించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ మంచినీటి కుళాయి కనెక్షన్లు నిలిచిపోయాయన్నారు. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు కార్యక్రమాన్ని గాడిలో పెడతామన్నారు. స్వచ్ఛ భారత్ కింద కేంద్రప్రభుత్వం రూ.2,290 కోట్లు మంజూరుచేస్తే గత ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయలేదన్నారు.
‘ఆపరేషన్ బుడమేరు’కు సహకరించండి
బుడమేరు ఆక్రమణల కారణంగానే భారీవరదలో గృహాలు నీటిలో చిక్కుకుపోయాయన్నారు. ఆపరేషన్ బుడమేరులో భాగంగా ప్రభుత్వస్థలాలు, చెరువులు, కాలువల భూములను ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలన్నారు. ప్రభుత్వస్థలాల్లో పేదలు గృహాలు నిర్మాణం చేసుకుని నివసిస్తుంటే వారికి టిడ్కో ఇల్లు, లేదా ప్రత్యామ్నాయం చూపి, సంతప్తి చెందిన తరువాతనే ఆక్రమిత స్థలాలనుంచి ఖాళీ చేయిస్తామని చెప్పారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి గృహాలు నిర్మాణం చేసుకున్నవారు ఎంతటివారైనా, ఏపార్టీకి చెందిన వారైనా ఉపేక్షించబోమన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువల భూములను ఆక్రమించుకుని గృహాలు నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్న పేదలను ఖాళీచేయించే సమయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించే అవకాశం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, ఆ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తామని చెప్పారు.
చెత్తతో కంపోస్టు ఎరువులు : మంత్రి నారాయణ
మచిలీపట్నం టౌన్ : ఏజే కళాశాల పక్కన డంపింగ్ యార్డు, ఎస్టీ కాలనీలో, రైతుబజారు, కేంద్రీయ విద్యాలయం, సుందరయ్యనగర్, లేడీ్‌సక్లబ్, మూడు స్తంభాల సెంటర్, ముస్తాఖాన్‌పేటలలో మంతి రవీంద్ర పర్యటించి ఆ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. రవీంద్రతో పాటు కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, ఎస్పీ గంగాధరరావు, డీఆర్వో చంద్రశేఖరరావు, అదనపు ఏఆర్ ఎస్పీ బీవీడీ ప్రసాద్, డీఎస్పీ సుభాని, కమిషనర్ బాపిరాజు, వ్యర్థ పదార్థాల నిపుణుడు సింగ్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్న స్వచ్ఛతా హి సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడతారన్నారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిపై చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తామన్నారు.