Share News

ఏపీటీడీసీలో ఇష్టారాజ్యం

ABN , Publish Date - Feb 14 , 2024 | 01:19 AM

దొంగే... దొంగ.. దొంగ.. అన్నట్టుంది పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) తీరు. నిర్వహణ సరిగాలేకపోవడానికి అధికారుల అసమర్ధతే కారణమని చూపే ప్రయత్నం జరుగుతోంది. విజయవాడ డివిజన్‌లోని పర్యాటక యూనిట్లను ఉన్నతాధికారులు పనిగట్టుకుని దెబ్బతీస్తున్నారు. అందులో భాగంగానే పర్యాటక యూనిట్ల నిర్వహణను గాలికొదిలేసి సిబ్బందిని సాగనంపుతున్నారు. ఉన్న అధికారులను కూడా అవినీతిపరులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. పర్యాటక యూనిట్లు పూర్తిగా పడకేసేలా చేసి కారుచౌకగా ప్రైవేటు సంస్థల, వ్యక్తుల చేతిలో పెట్టేందుకు టెండర్లు కూడా పిలవడం గమనార్హం.

ఏపీటీడీసీలో ఇష్టారాజ్యం

పర్యాటక యూనిట్లను ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే కుట్ర

అధికారులను అసమర్ధులుగా చూపే ప్రయత్నం

విజిలెన్స్‌ దాడుల చేయిస్తున్న ఉన్నత అధికారులు

విజయవాడ డివిజన్‌లోనూ విజిలెన్స్‌ బృందాల తనిఖీ

ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు టెండర్లు

దొంగే... దొంగ.. దొంగ.. అన్నట్టుంది పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) తీరు. నిర్వహణ సరిగాలేకపోవడానికి అధికారుల అసమర్ధతే కారణమని చూపే ప్రయత్నం జరుగుతోంది. విజయవాడ డివిజన్‌లోని పర్యాటక యూనిట్లను ఉన్నతాధికారులు పనిగట్టుకుని దెబ్బతీస్తున్నారు. అందులో భాగంగానే పర్యాటక యూనిట్ల నిర్వహణను గాలికొదిలేసి సిబ్బందిని సాగనంపుతున్నారు. ఉన్న అధికారులను కూడా అవినీతిపరులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. పర్యాటక యూనిట్లు పూర్తిగా పడకేసేలా చేసి కారుచౌకగా ప్రైవేటు సంస్థల, వ్యక్తుల చేతిలో పెట్టేందుకు టెండర్లు కూడా పిలవడం గమనార్హం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నిన్నటి వరకు పర్యాటక యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పిండుకున్నారే తప్ప.. వాటి నిర్వహణకు డబ్బులు విదల్చలేదు. రాష్ట్రం లోనే అతిపెద్ద భవానీ ద్వీపంతోపాటు విజయవాడ డివిజన్‌ పరిధిలోని హరిత బెర్మ్‌పార్క్‌, సూర్యలంక వంటి యూనిట్ల నిర్వహణకు ఈ నాలుగేళ్లలో పైసా కూడా ఇవ్వలేదు. దీంతో ఆదాయం తగ్గింది. ఈ సాకుతో పర్యాటక యూనిట్లలో పనిచేసే వారందరినీ అసమర్ధులుగా చిత్రీకరించారు. వారి స్థానాల్లో తమ సొంత మనుషులను నియమించేందుకు నిబంధనలను తుంగలోతొక్కారు. తాము అనుకున్న ప్రైవేటు వ్యక్తులను పర్యాటక యూనిట్లలోకి తీసుకు వచ్చారు. ఒక పథకం ప్రకారం ఇలా చేశాక పర్యాటక యూనిట్ల ద్వారా ఆదాయం రావటం లేదన్న వాదన తీసుకువచ్చారు. వాటిని హోల్‌సేల్‌గా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు టెండర్లు పిలిచారు.

ఆరోపణలను తిప్పికొట్టేందుకు విజిలెన్స్‌ తనిఖీలు

పర్యాటక యూనిట్లను ప్రైవేటుపరం చేయాలన్న కుట్రపై ఆరోపణలను ఎదుర్కొనేందుకు ఇప్పుడు విజిలెన్స్‌ బృందాలను నియమించారు. ఈ విజిలెన్స్‌ బృందాల తనిఖీల్లో పర్యాటక యూనిట్లలో కొందరు మేనేజర్ల అవినీతి బాగోతాలు వెలుగులోకి వ స్తున్నాయి. మొన్నటికి మొన్న కడప యూనిట్‌ మేనేజర్‌గా నియమించిన వ్యక్తి ఏడు బుకింగ్‌ల డబ్బులను సంస్థకు జమ చేయకుండా సొంత ఖాతాకు మళ్లించుకున్న వ్యవహారం విజిలెన్స్‌ దాడిలో వెలుగు చూసింది. తాజాగా దిండి రిసార్ట్స్‌లో రూ.కోటి విలువైన స్కామ్‌ వెలుగు చూసింది. విజయవాడ డివిజన్‌లో కూడా విజిలెన్స్‌ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి అక్రమాలనూ గుర్తించనప్పటికీ.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి పరిస్థితులు ఏపీటీడీసీ అధికారులే ఓ పథకం ప్రకారం కల్పించటం వివాదాస్పదమౌతోంది.

విజయవాడలో భవానీద్వీపం, హరిత బెర్‌ ్మపార్క్‌ల ద్వారా ఆదాయం వస్తోంది. అయినా విజయవాడతో పాటు అనేక పర్యాటక యూనిట్లను ప్రైవేటువ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు టెండర్లు పిలిచారు. టెండర్ల నోటిఫికేషన్‌కు సంబంధించి తమకు నచ్చిన సంస్థలు, వ్యక్తులకే ముందస్తుగా సమాచారం ఇచ్చారు. ఇవన్నీ రహస్యంగా జరిగిపోయాయి. పర్యాటక యూనిట్లను ప్రైవేటుపరం చేసేటపుడు ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని మించి సాధించేలా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ షేర్‌ను కూడా అదే ప్రాతిపదికన నిర్దేశించాలి. కానీ విజయవాడలోని హరిత బెర్మ్‌పార్క్‌, భవానీ ద్వీపంలో ద్వారా ఏటా రూ.10 కోట్ల ఆదాయం వస్తుంటే రూ.5 కోట్ల లోపే కట్టబెట్టేందుకు తెగ పడ్డారు. ఏపీటీడీసీలోని పర్యాటక యూనిట్లన్నింటినీ ఒకపక్క ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లు పిలవగా.. మరోపక్క ప్రైవేటు మనుషులను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. యూనిట్లను ప్రైవేటీకరణ చేసేటపుడు ఇంకా ప్రైవేటుగా సిబ్బందిని తీసుకోవాల్సిన అవసరం ఏమిటో ఏపీటీడీసీ ఉన్నతాధికారులే చెప్పాలి. ప్రైవేటు సంస్థలు పెట్టుకోవాల్సిన సిబ్బందిని కూడా ఏపీటీడీసీ అధికారులే పథకం ప్రకారం నియమిస్తున్నారని తెలుస్తోంది. ఇలా ప్రైవేటు సిబ్బందిని తీసుకోవటం కూడా ప్రైవేటు సంస్థలకు లాభం కలుగజేసేందుకేనని తెలుస్తోంది.

Updated Date - Feb 14 , 2024 | 01:19 AM