Share News

కాల్‌మనీ కేటుగాడు

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:35 AM

అతనో వడ్డీ వ్యాపారి. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌నని అందరినీ నమ్మిస్తాడు. వ్యాపారంలో ఎదుగుతున్న వారితో, స్థిరపడిన ప్రముఖ వ్యాపారులతో, బ్యాంకు అధికారులతో పరిచయాలు పెంచుకుంటాడు. స్నేహం నటిస్తూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతాడు. వ్యాపార అవసరాలకు, స్థిరాస్తి కొనుగోలుకు నగదు కావాలంటే ఇస్తానని నమ్మిస్తాడు. రూ.లక్షల్లో పెట్టుబడి పెడతాడు. వారి వద్ద నగదు ఉంటే అధిక వడ్డీలకు తిప్పుతానని తీసుకుంటాడు. ఆ తర్వాత మీకు పెట్టుబడిగా ఇచ్చిన నగదు తనది కాదని, తెలిసిన వారి నుంచి వడ్డీకి తెచ్చినట్లు చెబుతాడు. కొద్ది రోజులు గడిచాక నగదు మొత్తం తిరిగి ఇవ్వాలని పట్టుబడతాడు. ఇవ్వలేని పక్షంలో రూ.లక్షకు రోజుకు రూ.వెయ్యి చొప్పున వడ్డీగా వసూలు చేస్తాడు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేస్తాడు. ఇది జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ కాల్‌మనీ కేటుగాడి వ్యవహారం. ఇతడి వలలో పలువురు వ్యాపారులు, అధికారులు చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఈ వేధింపులు భరించలేక ఎట్టకేలకు ఓ బ్యాంకు మేనేజరు కుటుంబం ధైర్యం చేసి ఇతడి అరాచకాలపై మీకోసం కార్యక్రమంలో ఎస్పీని ఆశ్రయించింది. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేసింది. ఈ విషయం తెలిసి ఈ కేటుగాడి చేతిలో మోసపోయిన మరికొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. బాధితుడు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా..

కాల్‌మనీ కేటుగాడు

మచిలీపట్నం కేంద్రంగా అధిక వడ్డీల దందా

బ్యాంకు అధికారులు,

వ్యాపారులే ఇతడి లక్ష్యం

ముందు స్నేహం.. ఆ తర్వాత వారి అవసరాలకు పెట్టుబడి సాయం

ముక్కుపిండి రూ.లక్షకు రూ. వెయ్యి చొప్పున వసూలు

ఇదేంటని ప్రశ్నిస్తే వారి ఇంటికెళ్లి దాడులు

వేధింపులు తాళలేక ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఓ బ్యాంకు మేనేజర్‌

విచారణ చేపట్టిన పోలీసులు

అతనో వడ్డీ వ్యాపారి. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌నని అందరినీ నమ్మిస్తాడు. వ్యాపారంలో ఎదుగుతున్న వారితో, స్థిరపడిన ప్రముఖ వ్యాపారులతో, బ్యాంకు అధికారులతో పరిచయాలు పెంచుకుంటాడు. స్నేహం నటిస్తూ వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతాడు. వ్యాపార అవసరాలకు, స్థిరాస్తి కొనుగోలుకు నగదు కావాలంటే ఇస్తానని నమ్మిస్తాడు. రూ.లక్షల్లో పెట్టుబడి పెడతాడు. వారి వద్ద నగదు ఉంటే అధిక వడ్డీలకు తిప్పుతానని తీసుకుంటాడు. ఆ తర్వాత మీకు పెట్టుబడిగా ఇచ్చిన నగదు తనది కాదని, తెలిసిన వారి నుంచి వడ్డీకి తెచ్చినట్లు చెబుతాడు. కొద్ది రోజులు గడిచాక నగదు మొత్తం తిరిగి ఇవ్వాలని పట్టుబడతాడు. ఇవ్వలేని పక్షంలో రూ.లక్షకు రోజుకు రూ.వెయ్యి చొప్పున వడ్డీగా వసూలు చేస్తాడు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేస్తాడు. ఇది జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ కాల్‌మనీ కేటుగాడి వ్యవహారం. ఇతడి వలలో పలువురు వ్యాపారులు, అధికారులు చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ఈ వేధింపులు భరించలేక ఎట్టకేలకు ఓ బ్యాంకు మేనేజరు కుటుంబం ధైర్యం చేసి ఇతడి అరాచకాలపై మీకోసం కార్యక్రమంలో ఎస్పీని ఆశ్రయించింది. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేసింది. ఈ విషయం తెలిసి ఈ కేటుగాడి చేతిలో మోసపోయిన మరికొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. బాధితుడు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా..

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నంలోని బుట్టాయిపేట సెంటరులోని ఓ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్న వ్యక్తికి మచిలీపట్నం నిజాంపేటకు చెందిన వడ్డీ వ్యాపారి పాత మిత్రుడు. దీంతో తరచూ వారి ఇంటికి, బ్యాంకు వద్దకు వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని బైపాస్‌ రోడ్డులో 227 గజాల స్థలం ఉందని, ఆ ప్రాంతంలో గజం స్థలం రూ.30వేల వరకు ఉందని, తనకు తెలిసిన వ్యక్తికి నగదు అత్యవసరం కావడంతో గజం స్థలం రూ.20వేలకు విక్రయించేందుకు సిద్ధపడ్డాడని నమ్మించాడు. స్థలం వద్దకు తీసుకువెళ్లి ఓ వ్యక్తిని పరిచయం చేసి అతనే స్థలానికి యజమాని అని చెప్పాడు. స్థలం కొనుగోలు నిమిత్తం టోకెన్‌ అడ్వాన్సుగా తొలుత రూ.10లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అంతనగదు ఇప్పటికిప్పుడు తనవద్ద లేదని సదరు బ్యాంకు మేనేజర్‌ చెప్పడంతో ఈ నగదును తానే సమకూరుస్తానని నమ్మించాడు. మరికొద్ది రోజులకు రెండో విడత టోకెన్‌ అడ్వాన్సుగా రూ.5లక్షలు స్థలం యజమాని అడుగుతున్నాడని చెప్పాడు. ప్రస్తుతం తనవద్ద నగదు లేదని మేనేజర్‌ చెప్పడంతో ఈ నగదును కూడా తానే సమకూరుస్తానని చెప్పి ఇచ్చాడు. కొద్దిరోజులు పోయాక మీ కోసం వేరే వ్యక్తి వద్ద నగదును అప్పుగా తీసుకున్నానని, రూ.15 లక్షలకు రోజుకు రూ.15వేల చొప్పున వడ్డీ కింద ఇరవైరోజులపాటు రూ.3లక్షలను వసూలు చేశాడు. ఇంత పెద్దమొత్తంలో రోజువారీ వడ్డీ తాను కట్టలేనని, గతంలో తనవద్ద తీసుకున్న రూ.9లక్షలను జమ చేసుకోవాలని సదరు బ్యాంకు మేనేజర్‌ చెప్పడంతో వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. బ్యాంకు మేనేజర్‌ ఇంటికెళ్లి నీ ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరించడతో పాటు అతనిపై ఆయన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణకు ఆదేశించిన ఎస్పీ

బ్యాంకు మేనేజరు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ ఆర్‌.గంగాధరరావు విచారణకు ఆదేశించారు. మచిలీపట్నం డీఎస్పీ ఈ కేసుకు చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌ సీఐను, ఒక ఏఎస్‌ఐను విచారణాధికారులుగా నియమించారు. ఈ కేసులో పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు సదరు సీఐ తెలిపారు.

మరింత మంది బాధితులు

ఈ వడ్డీ వ్యాపారి చేతిలో పలువురు వ్యాపారులు కూడా చిక్కుకున్నట్లు సమాచారం. గతంలో జవ్వారుపేటకు చెందిన ఒక వ్యాపారితో ఈ వడ్డీ వ్యాపారి స్నేహం చేసి, అతనికి కొద్ది మొత్తంలో నగదు ఇచ్చి రూ.60లక్షలు వసూలు చేయడంతోపాటు అతని ఇంటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దీనిపై గతంలోనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో కొందరు రాజకీయ నాయకులు ఇతడికి వత్తాసుపలకడంతో ఆ కేసును ఎటూ తేల్చకుండా మరుగునపడేశారు. కోనేరు సెంటరుకు సమీపంలో బంగారం వ్యాపారం చేసే వ్యక్తికి తక్కువ ధరకే బంగారం, వెండి ఇప్పిస్తానని నమ్మించి కోట్లాది రూపాయలను తీసుకున్నట్లు సమాచారం. ఎంతకూ బంగారం వెండి ఇవ్వకపోవడంతో బంగారం కొనేందుకు నగదును అడ్వాన్సుగా ఇచ్చిన వారు బంగారం వ్యాపారిపై పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో ఈ కేటుగాడి బారినపడిన బంగారం వ్యాపారి అప్పులపాలై విదేశాలకు వెళ్లిపోయాడు. అతనిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎట్టకేలకు ఇటీవల హైదారాబాద్‌ విమానాశ్రమంలో అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. మరో బంగారం వ్యాపారికి రూ.9లక్షలు అప్పుగా ఇచ్చి రూ.30లక్షలు వసూలు చేసి, మరో రూ.40లక్షలు కడితే నీబాకీ తీరుతుందని ఈ కేటుగాడు బెదిరిస్తుండటం గమనార్హం. మచిలీపట్నంలో బంగారం వ్యాపారం చేసే సుమారు 30 మంది వరకు వ్యాపారులు ఈ కేటుగాడి బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వారంతా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 01:35 AM