Share News

కిశోరి వికాసం.. బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:59 AM

కిశోరి వికాసం-2 కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని, ఉజ్వల, ఆరోగ్యకరమైన, సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దామని ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ నిధి మీనా అన్నారు.

కిశోరి వికాసం..  బాలిక బంగారు భవిష్యత్తుకు పునాది
కిశోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ నిధి మీనా తదితరులు

  • సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దాం

  • బాలికా సంఘాల ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ

  • జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కార్యక్రమాల నిర్వహణ

  • జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా

కృష్ణలంక, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : కిశోరి వికాసం-2 కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని, ఉజ్వల, ఆరోగ్యకరమైన, సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దామని ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ నిధి మీనా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కిశోరి వికాసం-2 కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కిశోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిధి మీనా మాట్లాడుతూ, కిశోరి వికాసం పునఃప్రారంభం రాష్ట్రంలోని ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగేలా సమగ్రాభివృద్ధి సొంతం చేసుకొనేలా ఈ కార్యక్రమం ద్వారా చేయూతనివ్వనున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోల సమన్వయంతో కార్యక్రమం పునఃప్రారంభమైందని, 11-18 ఏళ్ల బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబనను మెరుగుపరచడం ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకు ప్రతి గ్రామంలో బాలికల సంఘాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకొనేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బాలికల్లో ఆత్మరక్షణ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, డిజిటల్‌ భద్రత, సైబర్‌క్రైమ్‌, ఆన్‌లైన్‌ వేదికలపై జాగ్రత్తగా వుండేలా అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు.

సరైన విజ్ఞానం అందించాలి : డీఎల్‌ఎస్‌వో

కిశోరి బాలికలకు సరైన విజ్ఞానం అందించి జీవితంలో అన్ని విధాలా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరముందని జిల్లా న్యాయసేవల అథారిటీ (డీఎల్‌ఎ్‌సఏ) సెక్రటరీ రామకృష్ణ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ప్రపంచానికి సవాళ్లుగా నిలుస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు సరైన అవగాహనతో సమిష్టి కృషి అవసరమన్నారు. బాలికలు అన్ని విధాలా ఎదగడానికి వున్న అడ్డంకులను తొలగించడంలో పటిష్ట భాగస్వామ్యం ఉండాలన్నారు. డ్రాప్‌ అవుట్స్‌ తిరిగి చదువుకొనేలా ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, ఉపాధి అవకాశాలు పెంచడం, రక్తహీనతను నివారించడం, బాల్య వివాహాలను అడ్డుకోవడం, యోగా, శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహించడం తదితరాలపై జిల్లా మహిళా శిశు అభివృద్ధి అధికారి జి.ఉమాదేవి వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్‌ విద్య అధికారి సి.శివ సత్యనారాయణరెడ్డి, మార్పు ట్రస్ట్‌ ఆర్‌.సూయజ్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ జేడీ ఎం.సుమలత, యోగా ట్రైనర్‌ శిరీష, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:59 AM