Share News

వరద వెతలెన్నో..

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:16 AM

మునేరు విరుచుకుపడటంతో ఐతవరం రైతులకు కన్నీళ్లు మిగిలాయి. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన వరి నామరూపాలు లేకుండ తుడిచిపెట్టుకుపోవటంతో రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

వరద వెతలెన్నో..
ముంపు నుంచి బయటపడని పొలాలు

కంచికచర్ల, సెప్టెంబరు 11: మునేరు విరుచుకుపడటంతో ఐతవరం రైతులకు కన్నీళ్లు మిగిలాయి. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన వరి నామరూపాలు లేకుండ తుడిచిపెట్టుకుపోవటంతో రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మునేటి తీర గ్రామాల్లో నందిగామ మండలం ఐతవరం ఒకటి. మునేటి ఒడ్డునే సాగునీటి ఎత్తిపోతల పథకం ఉంది. ఆయకట్టులో రైతులు రెండు వందల ఎకరాలకు పైగా వరి నాట్లు వేశారు. ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. నాట్లు వేసి 15 నుంచి 35 రోజులైంది. రికార్డు స్థాయిలో 2.50 లక్షల క్యూసెక్కుల వరద రావటంతో ఉగ్రరూపం దాల్చిన మునేరు పంట పొలాల మీద విరుచుకుపడింది. పది నుంచి 15 అడుగుల ఎత్తున వరద పారటంతో నీటిలో పైరు ఉండటంతో కుళ్లిపోయింది. కొన్ని భూములు కోతకు గురి కాగా, ఇంకొన్ని భూముల్లో రాళ్లు, రప్పలు, ఇసుక మేట వేశాయి. తిరిగి మామూలు పరిస్థితికి చేరాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని రైతులంటున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి... : కోటేశ్వరరావు

చెప్పలేని విపత్తు. గతంలో ఎన్నడూ రానంతగా మునేరుకు వరద వచ్చింది. కళ్ల ముందే వరి నాశనమైంది. కౌలు కాకుండానే ఎకరానికి రూ. 25 వేల వరకు పెట్టుబడి పెట్టాం. ఏం చేయాలో అర్ధం కావటం లేదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.

పశువుల మేతకు కటకట

జి.కొండూరు: వరి గడ్డి వాములు వరదలకు కొట్టుకుపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాటిపై ఉన్న పట్టాలు సైతం చిరిగిపోయి తడిచి ముద్దయ్యాయి. వాసన వస్తున్న ఎండు గడ్డిని పశువులు తినే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. బుడమేరు, పులివాగు పరీవాహక గ్రామాలతోపాటు కృష్ణా నది ఏటిపట్టు గ్రామాల్లో పశు గ్రాస సమస్య రైతులను తీవ్రంగా బాధిస్తోంది. ఏం చేయాలో పశుపోషకులకు తెలియని పరిస్థితి. మరో పక్క వరి పొలాలు మొత్తం సర్వనాశనమైయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:16 AM