లయోలా యాజమాన్య వైఖరి మారాలి
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:37 AM
వాకర్స్‌ను మైదానంలోకి ప్రవేశం లేకుండా అడ్డుకుంటున్న లయోలా కళాశాల యాజమాన్యం వైఖరి మారాలని లయోలా, అమరావతి వాకర్స్ సభ్యులు గురువారం కళాశాల గేటు ముందు శాంతియుతంగా ధర్నా చేశారు.
లయోలా యాజమాన్య వైఖరి మారాలి
కళాశాల గేటు వద్ద లయోలా,
అమరావతి వాకర్స్ ధర్నా
భారతీనగర్ / మొగల్రాజపురం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వాకర్స్‌ను మైదానంలోకి ప్రవేశం లేకుండా అడ్డుకుంటున్న లయోలా కళాశాల యాజమాన్యం వైఖరి మారాలని లయోలా, అమరావతి వాకర్స్ సభ్యులు గురువారం కళాశాల గేటు ముందు శాంతియుతంగా ధర్నా చేశారు. ఉదయాన్నే కళాశాల గేటు వద్దకు చేరుకున్న సభ్యుల తరుపుర రావి రమేష్ మాట్లాడుతూ గతంలో అనుమతించిన కళాశాల యాజమాన్యం ఇపుడు ఎందుకు అనుమతిండం లేదని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా కళాశాల మైదానంలో వాకింగ్‌కు వస్తున్న తమకు ప్రవేశం ఆపడం మంచి పద్ధతి కాదన్నారు. కరోనా సమయం నుంచి వాకర్స్‌ను అనుమతించడం లేదన్నారు. తమకు అనుమతి ఇప్పించాలని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. శాంతియుతంగా తాము నెల రోజుల నుంచి నిరసన తెలుపుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10న జీవో నెంబరు 18 ద్వారా నూతన స్పోర్ట్సు విధానం ప్రకటించారని, ఆ జీవోలో క్లాజు 1.6 ప్రకారం అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా ఆట స్థలాలను అభివృద్ధి చేయాలని, ఆ సౌకర్యాలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారని ఆ జీవో కాపీని కళాశాల యాజమాన్యానికి ఇచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయోలా, అమరావతి వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.