మంత్రశక్తి వైజ్ఞానికం
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:29 AM
మంత్రిశక్తి పూర్తిగా వైజ్ఞానికమని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు అన్నారు. ఎస్కేపీవీవీ హిందూ హైసూల్స్ కమిటీ, దుర్గామల్లేశ్వర దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమాలను రెండు రోజులపాటు నిర్వహించారు.
వన్‌టౌన్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : మంత్రిశక్తి పూర్తిగా వైజ్ఞానికమని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు అన్నారు. ఎస్కేపీవీవీ హిందూ హైసూల్స్ కమిటీ, దుర్గామల్లేశ్వర దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమాలను రెండు రోజులపాటు నిర్వహించారు. కేబీఎన్ కళాశాల వేదికగా సాగిన ఈ కార్యక్రమంలో ఆదివారం ఆయన కనకదుర్గానందలహరిపై ప్రవచనం చేశారు. అనేక అంశాలపై ఆయన మాట్లాడుతూ, మంత్రశక్తి పూర్తిగా వైజ్ఞానికమైనదని, మంత్ర, తంత్ర, యంత్రాలలో ఉన్న రహస్యాలను సోదాహరణంగా వివరించారు. విశాలాక్షి, కామాక్షి, కనకదుర్గ, ఇలా ఎన్నో పేర్లతో అవతారాలు దాల్చినప్పటికీ లోక రక్షణకోసమేనని సోదాహరణంగా వివరించారు. తల్లి రూపంలో జగన్మాత సృష్టిలో సమస్త ప్రాణులను కాపాడుతున్నదన్నారు. పరమ భాగవతాదులకు ఇబ్బందులు కలిగినప్పుడు ఆమె అనేక రూపాల్లో వచ్చి రక్షించిన తీరును ఆయన పేర్కొన్నారు. పురుషులు ఎంత గొప్ప వారైనప్పటికీ భార్య లేనిదే పుణ్యం సంపాదించుకోలేడని, దాంపత్య జీవనంలో భార్యాభర్తల శరీరాలు వేరైనప్పటికీ, మనస్సులు మాత్రం ఒక్కటిగానే ఉంటాయని చెప్పారు. బిడ్డనుంచి తల్లి ఏమీ ఆశించకుండా ప్రేమను ఎలా పంచుతుందో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు కూడా భక్తులైన తన పిల్లలకు ప్రేమ పంచుతుందని చెప్పారు. అమ్మవారు తల్లితో సమానమని, జగన్మాతను ఆరాధించిన ఆదిశంకరాచార్యులు, భక్త పోతన, కాళిదాసు వంటి వారు రాసిన పద్యాలను, వాటి అర్ధాలను వివరించారు. ముగింపు కార్యక్రమంలో గరికపాటిని సుముచిత రీతిన సత్కరించారు. దుర్గగుడి ఈవో కె.ఎ్‌స.రామారావు, కేబీఎన్ కాలేజీ సెక్రటరీ టి.శ్రీనివాస్, హిందూ హైస్కూల్స్ కమిటీ ప్రెసిడెంట్ టి.శేషయ్య, గోళ్ల బాబ విజయకుమార్, దుర్గగుడి అధికారులు, నరసింహారావును సత్కరించిన వారిలో ఉన్నారు.