AP News: అంబేద్కర్ స్మృతి వనంలో జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందన
ABN , Publish Date - Aug 11 , 2024 | 06:51 PM
అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును తొలగించారని అన్నారు.
మచిలీపట్నం: అంబేద్కర్ స్మృతి వనంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు తొలగింపుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును తొలగించారని అన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కేవలం అంబేద్కర్ పేరు మాత్రమే ఉండాలని, కానీ మాజీ సీఎం జగన్ తన పేరును తాటికాయ అంత అక్షరాలతో పెట్టించుకున్నాడని విమర్శించారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీలోని అంబేద్కర్ అభిమానులే జగన్ పేరును తొలగించారని చెప్పారు.
ఫిషింగ్ హార్బర్ పనులు పరిశీలన..
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ, మత్య శాఖ అధికారుల బృందం పరిశీలించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా, మత్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 970 కిలో మీటర్లు మేర సముద్ర తీర ప్రాంతం ఉందని, మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ప్రస్తావించారు. ఇంకా పాత పద్ధతిలోనే సముద్రంలో వేట సాగిస్తున్నారని, వేటలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని సూచించారు.
మత్స్యకారులు, ఆక్వా రంగ అభివృద్ధి కోసం మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సిటీని స్థాపించాలని కేంద్ర బృందాన్ని కోరినట్టు ఆయన పేర్కొన్నారు. చాలా చేప జాతులు అంతరించిపోతున్నాయని, నూతన చేప జాతులను ఆవిష్కరించాలని కోరారు. ‘‘మడ అడవుల ప్రాధాన్యత తెలియక వాటిని నరికి వేస్తున్నారు. మడ అడవుల పెంపకానికి సహరించాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశాం. చిన్న షిప్‌లకు తోడుగా, మత్స్యకారులకు సౌకర్యార్థం మదర్ షిప్‌ను ఏర్పాటు అంశాన్ని బృందం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సాగరమాల పేరుతో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరిని కలిసి వినతి పత్రం ఇస్తాం. త్వరలో కేంద్ర రైల్వే శాఖామంత్రిని కలిసి మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం కలిపేలా సహకరించాలని కొరతాం. గత ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ అంచనాలు పెంచి లబ్ది పొందారు తప్ప నిర్మాణాలు ముందుకు సాగలేదు’’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.