Satyakumar: జగన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:49 PM
Andhrapradesh: ‘‘నా మంత్రిత్వశాఖపైనా అనేక అసత్యాలు ప్రచారం చేశారు. వాటి పై చర్చకు రండి అని సవాల్ చేస్తే పారిపోతున్నారు. బురద జల్లడం, పారిపోవడం జగన్‌కు అలవాటుగా మారింది. మొన్నటి వరకు బూడిదను దోచుకున్నారు.. ఇప్పుడు మా పై ఆ బూడిద వేయాలని చూస్తున్నారు’’ అంటూ జగన్‌పై మంత్రి సత్యకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
విజయవాడ, నవంబర్ 30: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య రంగంలో 52 వేల మందిని నియమించాలంటూ మాజీ సీఎం జగన్ (Former CM Jagan) చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బూడిద పంచాయతీలు చేశారు కాబట్టే... ప్రజలు వాళ్లకి బూడిదే మిగిల్చారు అంటూ వ్యాఖ్యానించారు. 11 సీట్లు ఇచ్చినా జగన్ ఇంకా తెలుసులేక పోతున్నారన్నారు. చేస్తున్న విమర్శలు అర్ధవంతంగా ఉండాలి కానీ... అర్ధరహితంగా ఉండకూడదని హితవుపలికారు.
స్వయంగా పెన్షన్ అందజేసిన ఏపీ సీఎం
అవినీతి సామ్రాట్ జగన్ ప్రతిభ నేడు విశ్వవ్యాప్తం అయ్యిందన్నారు. ఏపీ మాజీ సీఎం అవినీతి చేశాడని అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని.. వీటి నుంచి డైవర్షన్ చేసేందుకే చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా మీడియా ముందుకు వచ్చి సమాధానాలు చెప్పలేని వ్యక్తి జగన్ అని అన్నారు. ప్రతిపక్షంలో వచ్చాక మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘నా మంత్రిత్వశాఖపైనా అనేక అసత్యాలు ప్రచారం చేశారు. వాటి పై చర్చకు రండి అని సవాల్ చేస్తే పారిపోతున్నారు. బురద జల్లడం, పారిపోవడం జగన్‌కు అలవాటుగా మారింది. మొన్నటి వరకు బూడిదను దోచుకున్నారు.. ఇప్పుడు మా పై ఆ బూడిద వేయాలని చూస్తున్నారు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇకపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి...
ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందని స్పష్టం చేశారు. ఒక రెండు శాతం మందికి సాయం అందలేదని చెబుతున్నారని.. మరోసారి సర్వే చేసి బాధితులకు అందేలా చూస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రహదారులు, మంచినీటి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఎ.కొండూరులో సురక్షితమైన మంచి నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రాంత ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని.. వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనా చర్చించినట్లు చెప్పారు. తారకరామా ఎత్తిపోతల పధకం, చెరువులకు పడిన గండ్లు పూడ్చే అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పామన్నారు. పంట నష్టపోయిన వారికి పరిహారం, ఫసల్ భీమా యోజన కింద వారి వాటా చెల్లించేలా చూస్తామన్నారు. పత్తి, ధాన్యం, ఇతర ప్రధాన పంట ఉత్పత్తులు సేకరణలో నిర్లక్ష్యం వద్దని.. తేమ శాతం ఎక్కువ ఉన్నా ఒక్క రైతు కూడా వెనక్కి వెళ్లకుండా కొనుగోలు చేయాలన్నారు.
రవాణా, గన్నీ బ్యాగ్స్ విషయంలో రైతులు ఇబ్బందులు పడకూడదని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు, టూరిజం అభివృద్ధి వంటి అంశాల పై చర్చ చేశామని చెప్పారు. అధికారులు కూడా వీటిపై సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర ప్రభుత్వం పధకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన నిధులు మళ్లించారని ఆరోపించారు. లబ్ధిదారుల పేరుతో జగన్ ప్రభుత్వం భూములు తీసుకుని వారిని ఇబ్బందులు పెట్టిందన్నారు. మూడు సంవత్సరాల మారిటోరియం ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడుతున్నామని తెలిపారు. విజయవాడ వంటి నగరంలో విశాలమైన మైదానం లేకుండా పోయిందన్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేలా కళాశాల గ్రౌండ్‌లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాల విభజన తరువాత కొత్త ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క డి.ఆర్.సి మీటింగ్ మాత్రమే జరిగిందని.. ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఎన్టీఆర్ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు, నిధులతో యువతను ప్రోత్సహిస్తామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.