Share News

నిర్లక్ష్యానికి నిదర్శనం!

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:34 AM

2017లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా జిల్లా నాగాయలంక మత్స్యకారులకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ. కోటితో షోర్‌ బేస్డ్‌ ఫెసిలిటీ భవనాన్ని మంజూరు చేసింది. ఈ భవనంలో మత్స్యకారులు తమ విలువైన వలలు భద్రపర్చుకోవడం, సభలు సమావేశాలతోపాటు తుపాను సమయాల్లో రక్షిత భవనంగా ఉపయోగపడుతుంది.

నిర్లక్ష్యానికి నిదర్శనం!
నాగాయలంకలో నిర్మాణ దశలో ఆగిపోయిన మత్స్యకారుల షోర్‌ బే స్డ్‌ ఫెసిలిటీ భవనం

  • ఐదేళ్లుగా నిర్మాణానికి నోచని మత్స్యకార భవనం

  • పిల్లర్ల దశలోనే పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్‌

  • మత్య్సకారుల సంక్షేమం పట్టని వైసీపీ ప్రభుత్వం

  • పిచ్చిమొక్కలకు ఆవాసంగా షోర్‌ బేస్డ్‌ ఫెసిలిటీ భవనం

(నాగాయలంక, ఆంధ్రజ్యోతి)

2017లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా జిల్లా నాగాయలంక మత్స్యకారులకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ. కోటితో షోర్‌ బేస్డ్‌ ఫెసిలిటీ భవనాన్ని మంజూరు చేసింది. ఈ భవనంలో మత్స్యకారులు తమ విలువైన వలలు భద్రపర్చుకోవడం, సభలు సమావేశాలతోపాటు తుపాను సమయాల్లో రక్షిత భవనంగా ఉపయోగపడుతుంది. చేపల సంతలకు వచ్చే మత్స్యకారులకు వసతిగా ఉండేలా అన్ని సదుపాయాలతో భవనాన్ని నాగాయలంక పడవల రేవులో దక్షిణ భాగంలో నిర్మించేందుకు రెవెన్యూ శాఖ స్థల సేకరణ చేసి మత్స్యశాఖకు అప్పగించింది. అన్ని అనుమతులతో భవనం నిర్మాణానికి సిద్ధం కాగా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

2019 డిసెంబరు 20న అప్పటి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు మత్స్యకారుల షోర్‌ బేస్డ్‌ ఫెసిలిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టరు నిర్మాణ పనులు ప్రారంభించి పిల్లర్లు వేసి వదిలేశాడు. నాటి నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టరు పనులను చేయలేదు. మరో కాంట్రాక్టర్‌కి నిర్మాణ పనులను అప్పగించడంలో అధికారులు కూడా పట్టించుకోలేదు. దాంతో నిర్మానం చుట్టూ పిచ్చి చెట్లు, ఇనుప చువ్వలు తుప్పుపట్టి భవన నాణ్యతను దెబ్బతీస్తున్నాయని మత్స్యకార నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనాన్ని పూర్తి చేయాలని మత్స్యకార నేతలు పలుమార్లు ఆందోళన చేసినా నాటి వైసీపీ పాలకుల్లో స్పందన లేదు. మండలంలోని మత్స్యకారులందరికీ బహుళ విధాలుగా ఉపయోగపడే ఈ భవనాన్ని కూటమి ప్రభుత్వంలోనైనా పూర్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

వైసీపీ కక్షపూరిత చర్య వల్లే..

- లకనం నాగాంజనేయులు,

మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు

తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరు కావటం వల్లనే గత వైసీపీ ప్రభుత్వం ఈ షోర్‌ బేస్డ్‌ ఫెసిలిటీ భవన నిర్మాణాన్నినిలిపివేసింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి.

ప్రభుత్వం స్పందించాలి

నాగిడి తాతారావు, జిల్లా నాయకుడు

భవన నిర్మాణం ఆగిపోవటం వల్ల మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్లు, వరదల సమయంలో వలలు, వృత్తి పరికరాలు భద్రపర్చుకోవటానికి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

నిధులు మురిగిపోయాయి

-మత్స్యశాఖ ఏడీ ఆర్‌.ప్రతిభ, అవనిగడ్డ

మత్స్యకారుల భవనాన్ని సకాలంలో కాంట్రాక్టర్‌ నిర్మించక పోవటంతో ఆ నిధులు మురిగిపోయాయి. మూడు నెలల క్రితం సదరు భవనానికి నిధులు కేటాయించాలని జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే భవనాన్ని పూర్తి చేస్తాం.

Updated Date - Nov 22 , 2024 | 12:34 AM