Share News

తొలిరోజు మల్లగుల్లాలు

ABN , Publish Date - Jul 09 , 2024 | 01:23 AM

ఉచిత ఇసుక పథకం అమలు రోజున అధికార యంత్రాంగం గందరగోళానికి గురైంది. జీవో వచ్చేంత వరకు అఽఽధికార యంత్రాంగం పంపిణీ ప్రక్రియను ప్రారంభించకపోవటంతో ఇసుక కోసం వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు. సోమవారం స్టాక్‌ యార్డుల దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. ఉచిత ఇసుక కోసం ట్రాక్టర్లు, లారీలు, పెద్ద టిప్పర్లు స్టాక్‌ యార్డులకు వచ్చాయి. యార్డుల్లో ఇసుక పంపిణీ చేపట్టకపోవటంతో ఈ వాహనాలన్నీ జాతీయ రహదారుల వెంబడి నిలిపేశారు.

తొలిరోజు మల్లగుల్లాలు

ఇసుక పథకం అమలు రోజున జిల్లా యంత్రాంగం గందరగోళం

జీవో కోసం వేచి చూసిన అధికారులు

రాత్రి 7 గంటల వరకు కూడా ప్రారంభం కాని పంపిణీ

ఇసుక డిపోలకు భారీగా వాహనాల రాక

స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వలు మాయం

ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ప్రజలకు తగ్గిన ఇసుక భారం

ఉచిత ఇసుక పథకం అమలు రోజున అధికార యంత్రాంగం గందరగోళానికి గురైంది. జీవో వచ్చేంత వరకు అఽఽధికార యంత్రాంగం పంపిణీ ప్రక్రియను ప్రారంభించకపోవటంతో ఇసుక కోసం వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు. సోమవారం స్టాక్‌ యార్డుల దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. ఉచిత ఇసుక కోసం ట్రాక్టర్లు, లారీలు, పెద్ద టిప్పర్లు స్టాక్‌ యార్డులకు వచ్చాయి. యార్డుల్లో ఇసుక పంపిణీ చేపట్టకపోవటంతో ఈ వాహనాలన్నీ జాతీయ రహదారుల వెంబడి నిలిపేశారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/కంచికచర్ల): అధికార యంత్రాంగం తగిన ముందస్తు సన్నద్ధత లేకుండా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే ఇసుక లోడింగ్‌ ప్రారంభమవుతుందని ప్రకటించ డంతో కీసర స్టాక్‌ యార్డు దగ్గరకు పెద్ద ఎత్తున వినియోగదదారులు ట్రాక్టర్లు, లారీలతో రావటం ప్రారంభమైంది. విజయవాడ, ఇబ్రహీంపట్న, నందిగామ, కంచికచర్ల తదతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలు వచ్చాయి. ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించినా.. జీవో వచ్చేంత వరకు స్టాక్‌ యార్డులో ఇసుక లోడింగ్‌ ప్రారంభించ లేదు. జీవో వచ్చిన తర్వాత కూడా సాయంత్రం 6.30 గంటలు దాటినా ఇసుక పంపిణీని చేపట్టలేకపోయారు. ఎన్టీఆర్‌ జిల్లాలో పెద్ద మొత్తంలో కీసర స్టాక్‌యార్డులోనే ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రారంభం కాకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్టాక్‌యార్డులోనే మైనింగ్‌, రెవెన్యూ, సెబ్‌, పోలీస్‌ అధికారులు ఇలా అంతా సాయంత్రం వరకు యార్డు దగ్గరే నిరీక్షించారు తప్పితే ఇసుక పంపిణీకి చర్యలు తీసుకోలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా మిగిలిన యార్డుల్లో చూస్తే అల్లూరుపాడు, అనుమంచిపల్లి, పోలంపల్లిలలో పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. కొద్ది నిమిషాల్లో మంత్రి కొల్లు రవీంద్ర వస్తున్నారంటూ గంటల తరబడి వినియోగదారులు, రవాణా వాహనాల సిబ్బందిని వేచి చూసేలా చేశారు.

స్టాకు యార్డుల్లో ఇసుక మాయం

స్టాకు యార్డుల్లో ఇసుక చాలా వరకు మాయమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. నందిగామ డివిజన్‌ పరిధిలో కంచికచర్ల మండలంలోని కీసర, మోగులూరు, నందిగామ మండలంలోని కంచల, మాగల్లు, చందర్లపాడు మండలంలోని కొడవటికల్లు, వత్సవాయి మండలంలోని పోలంపల్లి, అల్లూరుపాడు, జగ్గయ్యపేట మండలంలోని అనుమంచిపల్లి గ్రామాల పరిధిలో మొత్తం ఎనిమిది ఇసుక స్టాకు యార్డులు ఉన్నాయి. వీటిలో కీసర, మోగులూరు యార్డుల్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి.

స్టాక్‌ ఇసుక అక్రమార్కుల పరం

మేలో ఇసుకకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో యార్డుల దగ్గర పెద్దగా నిఘా లేకపోవటంతో మే నెల ప్రారంభంలో అక్రమార్కుల కళ్లు స్టాక్‌ యార్డులపై పడ్డాయి. ఎలాంటి అనుమతులూ లేకుండానే జేసీబీలతో లారీలకు, ట్రాక్టర్లకు లోడింగ్‌ చేసి, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా ఇసుక లూటీ జరుగుతూనే ఉండటంతో తెలుగుదేశం నాయకులు ఆందోళనకు కూడా దిగారు.

ఐదేళ్ల ఇసుక క ష్టాలకు తెర

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండెక్కి కూర్చున్న ఇసుక ధరలతో బెంబేలెత్తిన ప్రజలకు ఉపశమనం లభించినట్టు అయింది. తొలిరోజు కావటంతో సోమవారం పంపిణీలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నా మంగళవారం నుంచి మాత్రం ప్రజలకు పూర్తి స్థాయిలో పంపిణీ చేపట్టనున్నారు. వినియోగదారులు తమ ఫోన్‌ నెంబర్‌ చెప్పటంతో పాటు, ఆధార్‌ కార్డును ఆధారంగా చేసుకుని రోజుకు 20 టన్నుల ఇసుకను అందిస్తారు. అన్ని స్టాక్‌ యార్డుల్లో కలిపి మొత్తం 5.54 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. రవాణా ధరలు విషయానికి వస్తే ఇంకా మరింత స్పష్టత రావాల్సి ఉంది. జిల్లా అతి పెద్ద స్టాక్‌ యార్డు అయిన కీసర నుంచి విజయవాడకు పది చక్రాల లారీకి రూ.6 వేలు కిరాయి వసూలు చేయనున్నారు. అదే ఇబ్రహీంపట్నం అయితే రూ. 4500 - 5000 మధ్యన ఉంటుంది.

హద్దు దాటితే పెనాల్టీలు తప్పవు

ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కొరడా ఘళిపించబోతోంది. దీనికోసం భారీగా పెనాల్టీలను విధించేందుకు సిద్ధమైంది. వేబిల్లులు లేకుండా, ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తూ వాహనాలు పట్టుబడితే ఇక నుంచి అధికారులు భారీగా పెనాల్టీలు విధించను న్నారు. ట్రాక్టరుకు మొదటిసారి రూ.పది వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10,001 నుంచి రూ.20 వేల వరకు, పది టైర్ల లారీకి రూ.25 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.25,001 నుంచి రూ.50 వేల వరకు, పది టైర్లు పైబడిన లారీలకు, యంత్రాలకు మొదటిసారి రూ.50 వేలు, రెండోసారి పట్టుబడితే రూ. 50,001 నుంచి రూ.లక్ష వరకు పెనాల్టీ విధించనున్నారు.

స్టాక్‌ ఖాళీ!

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో కృష్ణానదీ పరివాహక ప్రాంతం వెంబడి పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలు ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గం పరిధిలో చోడవరం, మద్దూరు, యనమలకుదురు, పెదపులిపాక రేవుల నుంచి ఇసుకను తవ్వేవారు. చోడవరం వద్ద స్టాక్‌ పాయింట్‌ నుంచి ఇసుకను విక్రయించేవారు. పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం లంకపల్లి, ఘంటసాల మండలం శ్రీకాకుళం, పాపవినాశనం రేవుల నుంచి ఇసుకను తవ్వేవారు. శ్రీకాకుళం వద్ద ఏర్పాటు చేసిన ఇసుక పాయింట్‌ ద్వారా ఇసుకను విక్రయించేవారు.

ముందస్తుగానే ఖాళీ చేసి..

అన్ని రీచ్‌లలో కూలీలతో పనిలేకుండా యంత్రాలతోనే తవ్వేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జేపీ కంపెనీ పేరుతో, ఎన్నికలకు ముందు వీసీకేసీ సంస్థ పేరుతో ఇసుకను తవ్వి విక్రయాలు జరిపారు. తెరపైన ఈ రెండు సంస్థల పేర్లుచెప్పినా ఇసుక తవ్వకాల వ్యవహరాలు మొత్తం స్థానిక వైసీపీ శాసనసభ్యులు, వారి అనుచరుల కనుసన్నల్లోనే నడిచేవి. జిల్లాలోని స్టాక్‌పాయింట్లలోని ఇసుక మొత్తాన్ని నూతన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికే ఖాళీ చేసేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలులో భాగంగా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూసినా జిల్లాలోని స్టాక్‌ పాయింట్లలో ఒక్క టన్ను ఇసుక కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఎన్టీఆర్‌ జిల్లాలోని స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుకను తెచ్చుకోవాల్సి ఉండటంతో రవాణా చార్జీల రూపంలో జిల్లా ప్రజలపై కొన్నిరోజుల పాటు కొంతమేర ఆర్థిఖ భారం పడనుంది.

అనధికారిక ఇసుక తవ్వకాలకు అడ్డేలేదు

అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండల పరిధిలోని బొబ్బర్లంక, కే-కొత్తపాలెం రేవుల నుంచి ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా, రాత్రి సమయాల్లో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ అనధికారికంగా ఏర్పాటు చేసిన స్టాక్‌ పాయింట్లలో నిల్వ ఉంచుతారు. ఇసుకను తరలించుకు పోయేందుకు లారీలను ర ప్పించి తెల్లారేసరికి స్టాక్‌ పాయింట్లలో ఇసుక నిల్వలను విక్రయించేస్తారు. మోపిదేవి మండలం కోసూరివారిపాలెం సమీపంలోని ఇసుకరేవులో సముద్రపు పోటు వచ్చే సమయంలో నదిలో నీరు ఉంటుంది. సముద్రపు ఆటు సమయంలో ట్రాక్టర్లు నడిచేందుకు అవకాశం ఉంటుంది. సముద్రపుపోటు తగ్గగానే ఇక్కడ ఇసుక తవ్వకాలను జోరుగా కొనసాగిస్తున్నారు. పెదకళ్లేపల్లి వద్ద నదిలోని నీటిలో నుంచి ఇసుకను తీసి పడవల ద్వారా స్టాక్‌ పాయింట్లకు తరలించి లారీలు వచ్చిన వెంటనే లోడ్‌చేసి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. అవనిగడ్డ మండలం యడ్లంకలో గతంలో ఇసుక తవ్వకాలు జోరుగా కొనసాగించారు. స్థానికులు అడ్డుకోవడంతో ఇక్కడి నుంచి ఇసుక అక్రమ రవాణాను తాత్కాలికంగా నిలిపివేశారు.

స్టాక్‌ పాయింట్లలో ఇసుక లేదు..

జిల్లాలో స్టాక్‌ పాయింట్లలో ఇసుక నిల్వలు ప్రస్తుతం ఎక్కడా లేవు. గతంలో పనిచేసిన స్టాక్‌ పాయింట్లలో ఇసుక నిల్వలను ఖాళీ చేశారు. జూలై నుంచి అక్టోబరు వరకు కృష్ణానదిలో ఇసుక తవ్వి తీసేందుకు అనుమతులు లేవు. ఇసుక కావాల్సిన వారు ఎన్టీఆర్‌ జిల్లాలోని స్టాక్‌పాయింట్ల వద్దకు వెళ్లి ప్రభుత్వం నిర్దేశించిన నామమాత్రపు సీనరేజీ, రవాణా, లోడింగ్‌ చార్జీలు చెల్లించి తెచ్చుకోవాల్సిందే. నాలుగైదు రోజుల్లో జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరిచేందుకు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం. - డీకే బాలాజీ, కలెక్టర్‌

Updated Date - Jul 09 , 2024 | 01:23 AM