Share News

ఆపరేషన్‌ బుడమేరు ఏమైంది?

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:42 AM

బుడమేరు ఉగ్రరూపం దాలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో సెప్టెంబరులో వరదలు ప్రత్యక్షంగా చూపించాయి. కేవలం 100 కిలోమీటర్ల మేర ప్రవహించే బుడమేరు వల్ల విజయవాడ నగరం అతలాకుతలమైంది. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలే. అంతటి విపత్తు నుంచి బయటపడినా అక్రమార్కుల్లో కనీస స్పందన లేదు. పైగా నగరవ్యాప్తంగా బుడమేరు వెంబడి ఆక్రమణలు పెరుగుతుండటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.

ఆపరేషన్‌ బుడమేరు ఏమైంది?
అయోధ్యనగర్‌లోని రాఘవేంద్ర థియేటర్‌ సమీపంలో బుడమేరు కట్ట ఆక్రమించుకుని ఏర్పాటుచేసిన దుకాణాలు

  • నగరంలో పెరుగుతున్న ఆక్రమణలు

  • వరదలు ముంచెత్తినా మారని అక్రమార్కులు

  • అయోధ్యనగర్‌ కట్ట వెంబడి భారీగా..

  • పాతరాజరాజేశ్వరిపేటలోనూ అదే పరిస్థితి

  • నెలలో ‘ఆపరేషన్‌ బుడమేరు’ చేపడతామన్న మంత్రి

  • ఆక్రమణల తొలగింపు సరే.. అడ్డుకునే వారేరీ..?

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : బుడమేరు పరివాహక ప్రాంతం 2,930 ఎకరాలు కాగా, ఒక్క నగర పరిధిలోనే బుడమేరు భూములు సుమారు 80 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. ఎకరం భూమి విలువ రూ.10 కోట్ల పైచిలుకు ఉంటుందని తేల్చారు. అంటే.. మొత్తం ఆక్రమణల విలువ రూ.800 కోట్లపైనే అని నివేదికలో పేర్కొన్నారు. ఇక నగరం కాకుండా ఇతర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాలు బుడమేరు పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురైనట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. వీటిని తొలగించి, భవిష్యత్తులో నగరానికి వరద ముప్పు తొలగించేందుకు ఆపరేషన్‌ బుడమేరు చేపట్టనున్నట్లు సెప్టెంబరు నెలాఖరులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ప్రకటించారు. సుమారు 2 నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క ఆక్రమణను తొలగించింది లేదు. పైగా రోజురోజుకూ ఆక్రమణలు పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా బుడమేరు వాగు వెడల్పు 50 నుంచి 120 మీటర్లు ఉండాల్సి ఉండగా, చాలాచోట్ల 10 నుంచి 30 మీటర్లకు కుంచించుకుపోయింది. రియల్‌ వ్యాపారులు బుడమేరును పూడ్చేసి ఏకంగా కాంక్రీట్‌ స్లాబులతో బిల్డింగ్‌లు కట్టేశారు. గొల్లపూడి పంచాయతీ పరిధిలో ఈ ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు సెంట్రల్‌, గన్నవరం నియోజకవర్గాల్లోనూ బుడమేరు ఆక్రమణలు పెద్దస్థాయిలో ఉన్నాయి.

అయోధ్యనగర్‌లో ఆక్రమణలు

అయోధ్యనగర్‌లోని రాఘవేంద్ర థియేటర్‌ సమీపంలో బుడమేరు కట్ట తాజాగా ఆక్రమణలకు గురవుతోంది. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ కట్ట స్థలాన్ని కొందరు ఏళ్ల తరబడి ఆక్రమించుకుని వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. 1990, నవంబరు 14న నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ, తుఫాను అత్యవసర పునర్నిర్మాణ పథకం ద్వారా ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో బుడమేరు వరద నివారణ నిర్మాణ పథకాన్ని చేపట్టారు. కట్ట ఆక్రమణలకు గురికాకుండా ఆనాడు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. అయితే, కొన్నేళ్ల నుంచి బుడమేరు వంతెన వరకు కొందరు కట్టను ఆక్రమించుకుని వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు వ్యాపారులైతే పక్కా నిర్మాణాలు చేపట్టారు. పాతరాజరాజేశ్వరిపేట వైపునకు వెళ్లే బుడమేరు కట్టను ఇటీవల కొందరు వ్యాపారులు 1,000 నుంచి 1,500 గజాల మేర ఆక్రమించుకుని రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ చిత్తుకాగితాలు, ఇంకా పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. పాతరాజరాజేశ్వరి పేట వైపునకు వెళ్లే మార్గం ఆక్రమణకు గురికావటం వల్లే బుడమేరు నీరు దారి మళ్లి అయోధ్యనగర్‌ను వరద ముంచెత్తింది. వరద అనంతరం వివిధ శాఖల అధికారులు కొద్దిమేర ఆక్రమణలు తొలగించినా, మళ్లీ షరామామూలే.

ఆపరేషన్‌ బుడమేరు ఎప్పుడు?

ఆపరేషన్‌ బుడమేరులో భాగంగా బుడమేరు మొదలైన దగ్గర నుంచి కొల్లేరులో కలిసే వరకు ఆక్రమణలు తొలగించి అవసరమైన మేరకు అంటే.. కనీసం 50 మీటర్ల వెడల్పు చేయాలన్నది అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రస్తుతం ఉన్న డిశ్చార్జి సామర్థ్యాన్ని 7 వేల క్యూసెక్కుల నుంచి 25 వేల క్యూసెక్కులకు పెంచాలని భావిస్తున్నారు. ఇది పెరగాలంటే ఆక్రమణలు తొలగించి, బుడమేరు కాల్వను వెడల్పు చేయక తప్పదు. ఆక్రమణల తొలగింపుతో పాటు విజయవాడ నగర పరిధిలో బుడమేరు ప్రవాహ మార్గంలో రెండువైపులా పటిష్టమైన కరకట్టలు నిర్మించి నగరానికి ముంపు నుంచి రక్షణ కల్పించడంతో పాటు మున్ముందు ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చేయాలన్నది ‘ఆపరేషన్‌ బుడమేరు’ లక్ష్యం. ఇవన్నీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. అలాగే, తాజాగా జరుగుతున్న ఆక్రమణలను నిలువరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Nov 19 , 2024 | 12:42 AM