Share News

పంచాయతీలు బలోపేతం కావాలి

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:28 AM

పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ అన్నారు. ‘పీఆర్‌ వన్‌-విజిబుల్‌ ఎస్సెట్స్‌’ అంశంపై జిల్లాపరిషత్‌ కన్వెన్షన్‌హాలులో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బుధవారం ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు.

పంచాయతీలు బలోపేతం కావాలి

మచిలీపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ అన్నారు. ‘పీఆర్‌ వన్‌-విజిబుల్‌ ఎస్సెట్స్‌’ అంశంపై జిల్లాపరిషత్‌ కన్వెన్షన్‌హాలులో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు బుధవారం ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పంచాయతీరాజ్‌ వ్యవస్థను రానున్నరోజుల్లో మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి పనులు చేయాలన్నారు. ఇంటిపన్నుల వసూలును నూరుశాతం చే స్తే ఆదాయం సమకూరుతుందన్నారు. దీర్ఘకాలంగా ఇంటిపన్నులు చెల్లించని వారి జాబితాలను తయారుచేసి తొలివిడతగా వారినుంచి బకాయిలు వసూలు చేయాలన్నారు. పురపాలకసంఘాలలో ఇంటిపన్ను సకాలంలో కట్టకుంటే కంప్యూటర్‌ద్వారా వడ్డీవేసే వెసులుబాటు ఉంటుందని, దీంతో పురపాలకసంఘాలలో ఇంటిపన్నులు అధికశాతం వసూలు అవుతాయన్నారు. పంచాయతీలలోనూ ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు. పంచాయతీలలో ఇంటిపన్నుల రూపంలో వసూలైన నగదును సిబ్బంది జీతాలు, నిర్వహణ పనులకు ఉపయోగించి, మిగిలిన నగదును విజిబుల్‌ ఎస్సెట్స్‌కు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. గతనెల 23న జిల్లావ్యాప్తంగా పంచాయతీలలో సమావేశాలు నిర్వహించి ఏయే పనులు చేయాలో జాబితాలు తయారుచేశారని, ఆ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఈనెల 14నుంచి 21 వరకు నిర్వహించే పల్లెపండుగ-పంచాయతీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఉపాథి పథకం ద్వారా ఆమోదం పొందిన పనులను ఈ వారోత్సవాలలో ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో ప్రారంభించిన పనులకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. పంచాయతీలలో సిమెంటు రహదారుల నిర్మాణాలకు ప్రణాళికను రూపొందించామని, రహదారులను నిర్మించిన తరువాత వాటిని నీటితో ఎంతమేర, ఎన్నిరోజులపాటు తడిపారనే అంశంపైనా, నాణ్యత ఎంతమేర పాటించారనే అంశంపైనా స్థానికులతో సంతకాలు తీసుకోవాలన్నారు. అధికారులు పనుల నాణ్యతను పరిశీలిస్తారని తెలిపారు. పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్యకార్మికులకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టులు పంచాయతీ కార్యదర్శి వద్ద, డీఎల్‌పీవోల వద్ద తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎవరైనా కార్మికులు అనారోగ్యంగా ఉంటే వారికి వైద్యం చేయించాలన్నారు. ప్రజాసమస్యలపై స్థానికంగా వచ్చే అర్జీలను ప్రతిరోజు పరిశీలించి పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీపీవో జె.అరుణ, జడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:28 AM