Share News

ఎస్సీల సమగ్ర వివరాలు అందించండి

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:41 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎస్సీ, ఉపకులాల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై పూర్తిగణాంకాలతో వివరాలు అందజేయాలని అధికారులను ఎస్సీ కులాల వర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌రంజన్‌మిశ్రా ఆదేశించారు.

ఎస్సీల సమగ్ర వివరాలు అందించండి
ఎస్సీ నాయకుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్న ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌రంజన్‌మిశ్రా, కలెక్టర్‌ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు

అధికారులకు ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌మిశ్రా ఆదేశం

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎస్సీ, ఉపకులాల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై పూర్తిగణాంకాలతో వివరాలు అందజేయాలని అధికారులను ఎస్సీ కులాల వర్గీకరణపై రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌రంజన్‌మిశ్రా ఆదేశించారు. ఏకసభ్య కమిషన్‌ శనివారం జిల్లాలో పర్యటించింది. ఎస్పీ సామాజికవర్గాల నుంచి వినతులు స్వీకరించడానికి ముందు జడ్పీ సమావేశపుహాలులో రాజీవ్‌ రంజన్‌ మిశ్రా అధికారులతో సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు, కేంద్రప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రప్రభుత్వం ఎస్సీ ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య కమిషన్‌ను నియమించిందన్నారు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరగకముందు ఉన్న 13జిల్లాల్లో 2011 జనాభాలెక్కల ప్రకారం ఎస్సీల్లోని 59 కులాల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్నిశాఖల అధికారులు తమ పరిధిలో పనిచేస్తున్న ఎస్సీ ఉద్యోగుల వివరాలు, వారి కేడర్‌ను, ఉపకులాల వారీగా అందజేయాలన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం జనాభా 45.17లక్షల మంది ఉన్నారని కలెక్టర్‌ బాలాజీ తెలిపారు. వీరిలో మాదిగలు 4,44,734, మాలలు 3,89,665మంది ఉన్నారన్నారు. జిల్లాపరిషత్‌, డీపీవో, డీఆర్‌డీఏ, మునిసిపల్‌ కార్పొరేషన్‌, ఆర్టీసీ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి ఉపకులాల వివరాలను రాజీవ్‌ రంజన్‌మిశ్రా అడిగి తెలుసుకున్నారు.

పటిష్ట బందోబస్తు

ఎస్పీవర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌మిశ్రాకు వినతులు ఇచ్చేందుకు భారీగా ఎస్సీలు జిల్లాపరిషత్‌ కన్వెన్షన్‌హాలుకు తరలివచ్చారు. అలాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కన్వెన్షన్‌ హాలులోని వేదికపై కాకుండా పక్కనే ఉన్న హాలులో వినతులు స్వీకరించారు. హాలు బయట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఏ ప్రాంతంనుంచి, ఏయే సంఘాల నుంచి ఎంతమంది వచ్చారో నమోదు చేసుకుని, వారికి టోకెన్లు అందజేసి కమిషన్‌ ఎదుటకు పంపారు. ఒకానొక సమయంలో కొందరు సభ్యులు జైభీమ్‌, ఎమ్మార్సీఎస్‌ ఐక్యత వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని కట్టడిచేశారు. మాల, మాదిగలతోపాటు అనుబంధకులాలుగా ఉన్న రెల్లి, బుడగ జంగాలు, బేడ, బైండ్ల, మాస్టీన్‌, ఎస్సీకాపు, బీసీ-సీలుగా ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీ ఉద్యోగ సంఘాలనాయకులు వినతులు అందజేశారు.

Updated Date - Dec 29 , 2024 | 01:41 AM