Share News

నోటుకో రేటు

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:36 AM

రూపాయి నోటు ప్రస్తుతం చలామణిలో లేదు. ఆ ఒక్క నోటు ధర రూ.30. రెండు రూపాయల నోటు ముద్రణ ఏనాడో ఆగిపో యింది. ఆ నోటు ధర రూ.20. సంఖ్య, విలువ పరంగా చూసినా రూపాయి, రెండు రూపాయలు తక్కువే అయినా వాటికి పలికే ధర మాత్రం ఎక్కువే ఉంటుంది. కరెన్సీ ఎంత పురాతన చరిత్ర కలిగి ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతోంది. నాణేలు, కరెన్సీ నోట్ల సేకరణపై ఆసక్తి ఉన్న వారు ఆ చరి త్రను చూసి ఎంత ధరకైనా కొనుగోలు చేస్తారు. ప్రతి కరెన్సీ వెనుక అనేక కోణాలు, తరగని చరిత్ర కనిపిస్తోంది. విజయవాడ సూర్యారావుపేటలోని చిలుకు దుర్గయ్య వీధిలో ఇంటర్నేషనల్‌ కాయిన్‌ ఎక్స్‌పో 2024(కాయిన్స్‌, స్టాంప్స్‌ అండ్‌ కరెన్సీ ఎగ్జిబిషన్‌) శుక్రవారం ప్రారంభమైంది. ఆదివారం వరకు ప్రదర్శనను నిర్వహిస్తారు.

నోటుకో రేటు
ప్రదర్శనలో ఉంచిన అంతర్జాతీయ నాణేలు, నోట్లు

విజయవాడలో కొలువుదీరిన అంతర్జాతీయ కరెన్సీ

నగరంలో ఇంటర్నేషనల్‌ కాయిన్స్‌ ఎక్స్‌పో ప్రారంభం

మూడు రోజులపాటు నిర్వహణ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీలైఫ్‌)

శ్రీధర్‌ సీసీఈ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ కాయిన్‌ ఎక్స్‌పో 2024(కాయిన్స్‌, స్టాంప్స్‌ అండ్‌ కరెన్సీ ఎగ్జిబిషన్‌)ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను పురావస్తు శాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్‌, పోలీ సు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, అడ్మిన్‌ ఐజీ శ్రీకాంత్‌, సుమన్‌ మీనా, సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సందర్శించారు.

మాల్టా నాణెంపై గాంధీ చిత్రం

ప్రపంచ దేశాలు కొత్త నాణేలు, కరెన్సీని ముద్రించి విడుదల చేస్తుంటాయి. ఆయా దేశాల్లోని ప్రముఖులు, చరిత్రకారుల పేరు, చిత్రాలతో నాణేలు, కరెన్సీలను ముద్రిస్తాయి. మాల్టా దేశం కొన్నాళ్ల క్రితం 5వేల లిరాస్‌ నాణేన్ని విడుదల చేసింది. దీనిపై మహాత్మాగాంధీ చిత్రాన్ని ముద్రించింది. ఈ నాణెం ప్రదర్శనలో ప్రత్యేకార్షణగా నిలిచింది. దీనితోపాటు ఆస్ర్టేలియా ది ఇయర్‌ ఆఫ్‌ ది హార్స్‌ పేరుతో విడుదల చేసిన నాణెం, కాంగో దేశం విడుదల చేసిన 25 ఫ్రాన్సెస్‌, 10 ఫ్రాన్సెస్‌ నాణేలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

ఒక రూపాయి..మూడు దేశాలు

రూపాయి, డాలర్‌, సీఎ్‌ఫఏ ఫ్రాన్స్‌, లెవ్‌, రీల్‌, యూరో, దినార్‌, పెసో... ఇవన్నీ ప్రపంచంలోని వివిధ దేశాల్లో చలామణిలో కరెన్సీ పేర్లు. ఆయా దేశాలకు వెళ్లినప్పుడు స్వదేశ కరెన్సీని అందులోకి మార్చుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో ముద్రించిన కరెన్సీని కొన్ని సంవత్సరాలు బర్మా, పాకిస్థాన్‌ దేశాలు ఉపయోగించుకున్నాయి. 1940వ సంవత్సరంలో ముద్రించిన రూపాయి నోటును ఈ రెండు ఉపయోగించుకున్నాయి. తర్వాత సొంతంగా కరెన్సీని రూపొందించుకున్నాయి. భారతదేశం మింట్‌లో ముద్రించిన ఈ కరెన్సీ ఆ దేశాలకు వెళ్లిన తర్వాత ఆ నోట్లపై ఆ దేశం ఒక స్టాంప్‌ వేస్తుంది. ఆ దేశ మిలటరీ అనుమతితో వచ్చినట్టు ఇంగ్లీ్‌షలో రాసి ఉం టుంది. దీన్ని ఓవర్‌ ప్రింట్‌ నోట్లుగా వ్యవహరిస్తారు.

ఆర్బీఐ గవర్నర్‌ సంతకాన్ని బట్టి డిమాండ్‌

ఒక నోటు ఎంత పురాతన చరిత్ర కలిగి ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది. మనదేశ నాణేలు, కరెన్సీ నోట్లు ఆర్బీఐ ద్వారా వివిధ మింట్లలో ముద్రిస్తారు. ఇందులో కరెన్సీ నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నరుగా పనిచేసిన అధికారి సంతకం ఉంటుంది. ఈ సంతకాలు ఉన్న నోట్లు ఒక్కొక్కటి ఒక్కో ధర పలుకుతోంది. 1985లో ఆర్బీఐ రూ.100 నోటును విడుదల చేసింది. ఆ సమయంలో ఆర్బీఐ గవర్నరుగా మల్హొత్ర వ్యవహరించారు. ఈ సంతకం ఉన్న ఒక రూ.100 నోటు ఖరీదు రూ.300. ఈ నోటు 1990 వరకు చలామణిలో ఉంది. 1977లో ఆర్బీఐ రూ.100 నోటును విడుదల చేసింది. నాడు గవర్నరుగా ఆర్‌.నరసింహన్‌ వ్యవహరించారు. ఆయన సంతకం ఉన్న ఈ నోటు ఖరీదు రూ.6వేలు. 1970లో రూ.100 నోటును విడుదల చేసింది. ఆ సమయంలో ఆర్బీఐ గవర్నరుగా ఎస్‌.జగన్నాథన్‌ ఉన్నారు. ఆయన సంతకం చేసిన నోటు రూ.600 పలుకుతోంది.

ప్రపంచంలోనే పెద్ద నోటు

రిజర్వ్‌ బ్యాంకులు విడుదల చేసిన నాణెలు, కరెన్సీ నోట్లకు కొలమానాలు ఉం టాయి. ఒక్కో నాణేనికి బరువు, చుట్టుకొలత, ఉపయోగించిన లోహం వేర్వేరుగా ఉంటాయి. ప్రతి కరెన్సీ నోటుకు పొడవు, వెడల్పు ఉంటాయి. ఈ పరిమాణాలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రపంచంలో అతి పెద్ద కరెన్సీ నోటును మలేషియా ముద్రించింది. అక్కడ కరెన్సీని రింగేట్స్‌లో వ్యవహరిస్తారు. 600 రిం గేట్స్‌ కరెన్నీ నోటును మలేషియా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నోటు పొడవు 22.86, వెడల్పు 40.64 సెంటీమీటర్లు. అన్ని దేశాల కరెన్సీల్లో మలేషియా ముద్రిం చిన 600 రింగేట్స్‌ నోటు అతి పెద్దదిగా స్థానం దక్కించుకుంది.

‘స్టార్‌’ కరెన్సీ

బిట్‌కాయిన్‌, క్రిప్టో..ప్రపంచీకరణ తర్వాత డిజిటల్‌ యుగం కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో వచ్చిన కొత్త కరెన్సీలు. వాటికి ముందు నుంచే ఆర్బీఐ స్టార్‌ కరెన్సీని తీసుకొచ్చింది. ఇదేమి కొత్త కరెన్సీ కాదు. చలామణి అవుతున్న కరెన్సీలో ఇదొక భాగం. ఆర్బీఐ వివిధ మింట్‌ల్లో కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. రూ.10, 20, 50, 100, 500నోట్లు దేశంలోని మింట్‌ల్లో ముద్రణ చేస్తున్నారు. ప్రస్తుతం పది రూపాయల నోట్లను తగ్గించి వాటి స్థానంలో నాణేలను మార్కెట్లోకి దింపుతున్నారు. నోట్లను ముద్రించి 100 నోట్లను ఒక కట్టగా లెక్కిస్తారు. ఆ కట్టలో ఉన్న నోట్లన్నీ వరుస సంఖ్య ఉంటుంది. ఒక్కో నోట్ల కట్టకు ఒక్కో సీరియల్‌ నం బరు ఉంటుంది. ముద్రణ చేసే సమయంలో ఈ సీరియల్‌ నంబర్లలో ఏదైనా ఒక నోటు పాడైపోతే దాని స్థానంలో స్టార్‌ నోట్లను పొందుపరుస్తారు. అదే విలువతో ప్రత్యేకంగా నోట్లను ముద్రిస్తారు. ప్రతి నోటుకు కుడిచేతి వైపున పైభాగం లో, ఎడమ చేతి వైపున కింది భాగంలో సీరియల్‌ నంబరు ఉంటుంది. ఈ నంబరుకు మధ్యలో స్టార్‌ (నక్షత్రం) ఉంటుంది. ఈ తరహా నోట్లను స్టార్‌ నోట్లు, స్టార్‌ కరెన్సీగా వ్యవహరిస్తారు. ఈ నోటు కట్టలో చేరితే వాటిలో సీరియల్‌ నంబర్‌ ఒకటి తప్పుతుంది. అందుకోసం బ్యాంకర్లకు తెలిసేలా కట్టపై అతికించే లేబుల్‌పై స్టార్‌ నోట్‌ ఉందని ముద్రిస్తారు.

Updated Date - Nov 30 , 2024 | 12:36 AM