రేషన్ ఫ్యాక్టరీ
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:57 AM
నగరానికి చెందిన అక్రమ బియ్యం వ్యాపారి ‘భాయ్’ రేషన్ దోపిడీలో మరో కోణం వెలుగుచూసింది. రెండు జిల్లాల నుంచి సేకరిస్తున్న రేషన్ అక్రమ బియ్యాన్ని రీసైక్లింగ్ చేయడానికి ఏకంగా ఓ ఫ్యాక్టరీనే నడుపుతున్న విషయం బయటపడింది.
సూరంపల్లిలో అక్రమ రేషన్ ఫ్యాక్టరీ బాగోతం
రేషన్ డాన్ భాయ్ కనుసన్నల్లో గుట్టుగా నిర్వహణ
రెండు జిల్లాలకు చెందిన పేదల బియ్యమంతా ఇక్కడికే సరఫరా
గోనె సంచుల నుంచి పాలిథిన్ బ్యాగుల్లోకి రీసైక్లింగ్
ఎంపిక చేసిన మిల్లులు, కాకినాడ, ముంబయి పోర్టుకు తరలింపు
ఎవరికీ అనుమానం రాకుండా దోస్త్ వాహనాల వినియోగం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నగరంతో పాటు రెండు జిల్లాల్లోని ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ డీలర్ల దగ్గర సేకరించిన బియ్యాన్ని సూరంపల్లి పారిశ్రామికవాడలో అనధికార రేషన్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఇక్కడే రీసైక్లింగ్ ప్యాకింగ్ చేస్తున్నారు. మండల లెవల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ల నుంచి నేరుగా వచ్చే పీడీఎస్ బియ్యం బస్తాలను, ఎండీయూ ఆపరేటర్లు, డీలర్ల దగ్గర నుంచి వచ్చే పీడీఎస్ బియ్యం బస్తాలను ఇక్కడ లాట్లుగా దాస్తున్నారు. ప్రభుత్వ పీడీఎస్ బియ్యం సంచులకు ఉన్న ట్యాగ్‌లను కత్తిరించటం, గోనె సంచులను తొలగించటం, బియ్యాన్ని తీసి పాలిథిన్ బ్యాగుల్లో నింపటం, వాటిని ప్యాకింగ్ చేయటం ఇక్కడ జరుగుతోంది. ఇలా ప్యాకింగ్ చేసిన బియ్యం బస్తాలను దోస్త్ వాహనాల్లో గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం రేషన్ డాన్ ‘భాయ్’ కనుసన్నల్లో జరుగుతోంది. ఇటీవల సూరంపల్లిలో పోలీసుల దాడుల్లో ఈ రేషన్ ఫ్యాక్టరీ బాగోతం బయటపడింది. కానీ, పోలీసులు దీనిని రేషన్ బియ్యం గోడౌన్‌గా భావించారు. బియ్యం నిల్వలనే చూశారు తప్ప, ఈ గోడౌన్‌లో ఏం జరుగుతుందో పట్టించుకోలేదు.
ఏం చేస్తున్నారు..?
వాస్తవానికి ఇది రేషన్ గోడౌన్‌కాదు.. రేషన్ ఫ్యాక్టరీగా ఉంది. ఇక్కడ గోనె సంచుల నుంచి బియ్యాన్ని తీసి పాలిథిన్ సంచుల్లోకి మారుస్తున్నారు. అంటే బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్నారు. వందలాది పాలిథిన్ బస్తాలు ఇక్కడున్నాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్లు, ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ డీలర్ల నుంచి దిగుమతి చేసుకున్న గోనె సంచులతో కూడిన బియ్యం బస్తాలు కనిపిస్తున్నాయి. ఇంత భారీసంఖ్యలో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తుంటే సివిల్ సప్లయిస్ అధికారులు, నిఘా సంస్థలు పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో ఎల్‌ఎల్‌ఎస్ పాయింట్లలో నిర్వహించిన ఆక్షన్‌లో భాగంగా కొనుగోలు చేసిన బియ్యపు రశీదుల జిరాక్స్ కాపీలను దగ్గర పెట్టుకుని పాలిథిన్ సంచులను దోస్త్ వాహనాల్లో ఎక్కించి, ఎంపిక చేసుకున్న మిల్లులకు, కాకినాడ పోర్టుకు, ముంబయి పోర్టుకు తరలిస్తున్నారు. ఇంత పెద్దస్థాయిలో రీ సైక్లింగ్ చేస్తుంటే సివిల్ సప్లయిస్ అధికారులు పట్టించుకోవటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ బియ్యం కార్యకలాపాలపై దాడులు చేస్తుంటే, ఉమ్మడి కృష్ణాజిల్లాలో మాత్రం సివిల్ సప్లయిస్, విజిలెన్స్ శాఖలు నిద్రపోతున్నాయి.
‘దోస్త్’ వాహనాల్లో అక్రమ రవాణా
రేషన్ అక్రమ బియ్యం సామ్రాజ్యాన్ని నడుపుతున్న భాయ్ పేదల బియ్యాన్ని తరలించటం కోసం దోస్త్ వాహనాలను ఎంచుకున్నాడు. సొంతంగా కొనుగోలు చేసిన దోస్త్ వాహనాల్లో ఈ రవాణా జరుగుతోంది. ఒక్కో దోస్త్ వాహనంలో 80 వరకు రేషన్ బస్తాలను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ వాహనాలను ఎక్కువగా కూరగాయలు తరలించటానికి ఉపయోగిస్తారు. అనుమానం రాకుండా ఉండటానికి వీటిని ఎంచుకున్నాడు. రేషన్ బియ్యాన్ని భారీగా సేకరిస్తే తన దగ్గర ఉన్న ఉన్న వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలు కూడా సమకూర్చుకుంటున్నాడు.