శ్మశానవాటికను తొలగిస్తే సహించం
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:56 AM
మండలంలోని మంగళాపురం గ్రామంలో స్మశానాన్ని తొలగించేందుకు గురువారం రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రయత్నించారు.
మంగళాపురం గ్రామస్థుల ఆందోళన..
వెనక్కి తగ్గిన అధికారులు
విజయవాడ రూరల్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని మంగళాపురం గ్రామంలో స్మశానాన్ని తొలగించేందుకు గురువారం రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రయత్నించారు. వందేళ్ల నాటి స్మశానాన్ని తొలగిస్తే సహించేది లేదంటూ గ్రామస్థులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికారులు వెనక్కి తగ్గడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. గ్రామంలోని పోలవరం కాలువను ఆనుకుని స్మశానం ఉంది. గురువారం పంచాయతీ, రెవెన్యూ అధికారులు స్మశానాన్ని తొలగించేందుకు సిద్ధమయ్యారు. జేసీబీలు తీసుకువస్తున్నారని తెలియడంతో ఒక్కసారిగా గ్రామస్తులు స్మశానం వద్దకు చేరుకున్నారు. తమ పూర్వీకుల నుంచి వినియోగంలో ఉన్న గ్రామస్మశానాన్ని ఎలా తొలగిస్తారంటూ పంచాయతీ ఈవో, వీఆర్వోలను ప్రశ్నించారు. స్మశానం తొలగించాలని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయని, తహసీల్దార్ నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని చెప్పినా స్థానికులు ఆందోళన విరమించలేదు. స్మశానం పక్కనే నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి ఫామ్‌హౌస్ ఉందని అతనికి లబ్ధి చేకూర్చేందుకే అధికారులు స్మశానాన్ని తొలగించాలని చూస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఊరికి ఉన్న ఒక్క స్మశానాన్ని తొలగిస్తే గ్రామస్థుల అంత్యక్రియలకు ఎక్కడికి వెళ్లాలని అధికారులను నిలదీశారు. తహసీల్దార్ సుగుణ గ్రామానికి చేరుకుని, గ్రామస్థులతో చర్చించారు. ప్రత్యామ్నాయ స్ధలం చూపిస్తామని చెప్పారు. అయినా గ్రామాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లేది లేదని గ్రామస్థులు ఆమెకు స్పష్టంచేశారు. ఈనెల 18న గ్రామసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.