Share News

నింగి నుంచి నిఘా

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:25 AM

పోలీసు కమిషనరేట్‌ అధికారులు ఆపరేషన్‌ డ్రోన్‌ అమలు చేస్తున్నారు. ఒక డ్రోన్‌ 1,000 సీసీ కెమెరాలతో సమానమని భావిస్తున్నారు. బుడమేరు వరదల సమయంలో డ్రోన్లు ఇచ్చిన ఫలితాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మూడు అంశాల్లో డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్న అధికారులు వాటిని ఆపరేట్‌ చేయడానికి సిబ్బందిని కూడా సమాయత్తం చేస్తున్నారు.

నింగి నుంచి నిఘా
డ్రోన్లపై మహిళా పోలీసులు పొందుతున్న శిక్షణను పరిశీలిస్తున్న సీపీ రాజశేఖరబాబు

కమిషనరేట్‌లో డ్రోన్‌ కాప్స్‌

పైలెట్లుగా మహిళా పోలీసులకు శిక్షణ

డీజీపీ కార్యాలయం వద్ద శిక్షణ ప్రారంభం

తొలుత 500 మందికి..

ఇకపై నగరంపై విరివిగా డ్రోన్ల విహారం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పోలీసు కమిషనరేట్‌లో మహిళా పోలీసులను డ్రోన్‌ ఆపరేషన్‌కు ఉపయోగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. వారికి దశలవారీగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ఈ శిక్షణ జరుగుతోంది. కమిషనరేట్‌లో మొత్తం 4,500 మంది సిబ్బంది ఉండగా, 500 మందిని డ్రోన్‌ పైలెట్లుగా తయారు చేయాలని చూస్తున్నారు. డ్రోన్‌ ఎగురవేయడమే కాకుండా.. దాన్ని ఏవిధంగా తిప్పాలి, ఏయే కోణాల్లో పంపాలి.. అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని మహిళా సిబ్బంది.. డీజీపీ కార్యాలయం వద్ద ఉన్న బెటాలియన్‌లో ఈ శిక్షణ పొందుతున్నారు.

సత్ఫలితాల కారణంగానే..

ప్రభుత్వం 2018లో పోలీసు కమిషనరేట్‌కు పెంటాన్‌ 4ప్రో మోడల్‌కు చెందిన తొమ్మిది డ్రోన్లను ఇచ్చింది. వీటి కాలపరిమితి ముగిసింది. దీంతో అప్‌డేట్‌ వెర్షన్‌ కలిగిన ఎయిర్‌3 డ్రోన్లను మూడు విధాలుగా ఉపయోగిస్తున్నారు. అస్త్రం డాష్‌బోర్డుకు వచ్చిన ట్రాఫిక్‌ అప్‌డేట్స్‌ను డ్రోన్లకు పంపుతున్నారు. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే రామవరప్పాడు రింగ్‌, బెంజిసర్కిల్‌, వారధి ప్రాంతాల్లో నిత్యం డ్రోన్లను ఎగురవేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ డ్రోన్లన్నీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమై ఉంటాయి. ట్రాఫిక్‌ ఆగిపోవడానికి కారణం ఏమిటన్న విషయాన్ని దీనిద్వారా తేలిగ్గా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ పరిధిలోని ట్రాఫిక్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై నిఘాకు డ్రోన్లను ఉపయోగించారు. వరుస ఫలితాలను చూసిన పోలీసు కమిషనరేట్‌ అధికారులు ప్రతి స్టేషన్‌కు ఒక్కో డ్రోన్‌ను సమకూర్చితే మంచి ఫలితాలను చూడవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. కీలకమైన కేసుల్లో ఈ డ్రోన్లు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిత్యం డ్రోన్లను గాల్లోకి పంపుతున్నారు. వీటిని ఆపరేట్‌ చేయడమే కాకుండా వాటికి రిపేర్లు వచ్చినా చేయగలిగేలా మహిళా పోలీసులను తయారు చేయాలని భావిస్తున్నారు.

Updated Date - Nov 16 , 2024 | 12:25 AM