Share News

దుర్గగుడిలో సీనియర్‌ అసిస్టెంట్‌పై వేటు

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:43 AM

దుర్గగుడి అధికారులు, సిబ్బంది వైసీపీ నేతల సేవల్లో తరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే వైసీపీ నేత పోతిన మహేశ్‌తో పాటు 11 మందికి అంతరాలయం దర్శనాలు చేయించి, వేద ఆశీర్వచనాలు ఇవ్వడంపై పెద్ద దుమారమే రేగింది.

దుర్గగుడిలో సీనియర్‌ అసిస్టెంట్‌పై వేటు

దేవినేని అవినాశ్‌కు అంతరాలయ దర్శనం ఎఫెక్ట్‌

సూపరింటెండెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌పై విచారణ

సెక్యూరిటీ ఇన్‌చార్జిపై చర్యలు

విజయవాడ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : దుర్గగుడి అధికారులు, సిబ్బంది వైసీపీ నేతల సేవల్లో తరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే వైసీపీ నేత పోతిన మహేశ్‌తో పాటు 11 మందికి అంతరాలయం దర్శనాలు చేయించి, వేద ఆశీర్వచనాలు ఇవ్వడంపై పెద్ద దుమారమే రేగింది. ఇక మూలా నక్షత్రం రోజున వీవీఐపీలు సహా ఎవరికీ అంతరాలయం దర్శనం ఉండదని అధికారులు ముందే ప్రకటించారు. కానీ, వైసీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ కుటుంబానికి అంతరాలయం దర్శనం కల్పించారు. ఈ దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా వీడియోవాల్‌పై గుర్తించిన అధికారులు సీనియర్‌ అసిస్టెంట్‌ రత్నారెడ్డిపై వేటు వేశారు. అంతరాలయం ముందు చిన్నగేటు ఉంటుంది. దీని తాళాలు తీసి అవినాశ్‌ కుటుంబాన్ని అంతరాలయంలోకి పంపారు. ఈ దృశ్యాలను వీడియో వాల్‌పై దేవదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ గుర్తించారు. తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఈవో రామారావును ఆదేశించారు. తాళాలు తీసిన దృశ్యం స్పష్టంగా కనిపించడంతో తొలుత రత్నారెడ్డిని సస్పెండ్‌ చేశారు. అవినాశ్‌ కుటుంబం మహామండపం లిఫ్ట్‌ ద్వారా పైకి వచ్చినట్టు సమాచారం. ఆలయ సూపరింటెండెంట్‌గా హయగ్రీవరావు విధుల్లో ఉండగా, బయట విధులను జూనియర్‌ అసిస్టెంట్‌ బలరాం నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరిపై అంతర్గత విచారణ సాగుతోందని అధికార వర్గాలు తెలిపాయి. సెక్యూరిటీ ఇన్‌చార్జి నాగరాజును విధుల నుంచి తప్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫుటేజీని కలెక్టర్‌ సృజన, పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు, దేవదాయ కమిషనర్‌ సత్యనారాయణ మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పరిశీలిస్తున్నారు.

Updated Date - Oct 10 , 2024 | 06:59 AM