ఫెంగల్ మిగిల్చిన కష్టం..నష్టం
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:09 AM
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో మూడు రోజులపాటు కురిసిన వర్షాలు రైతులకు కష్టాన్ని..నష్టాన్ని మిగిల్చాయి.
వర్షాలు ఆగడంతో ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు
పరదాలు, కూలీల ఖర్చు భరించలేకపోతున్నామంటూ ఆవేదన
తేమశాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలని ప్రభుత్వానికి వేడుకోలు
కూచిపూడి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో మూడు రోజులపాటు కురిసిన వర్షాలు రైతులకు కష్టాన్ని..నష్టాన్ని మిగిల్చాయి. సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ధాన్యపు రాశులపై కప్పిన పరదాలు తొలగించి ఆరబెట్టుకుంటున్నారు. కోత కోయని పొలాల్లో నేలకొరిగిన వరి దుబ్బులను పైకి లేపి కట్టుకుంటున్నారు. చేలల్లో నిలిచిన నీటిని బయటకు మళ్లిస్తున్నారు. కాటాలు వేసి నిల్వ ఉన్న ధాన్యాన్ని అధికారులు చొరవ చూపి త్వరితగతిన మిల్లులకు చేర్చాలని రైతులు కోరుతున్నారు. రెండో పంట కోసం చల్లిన మినుము విత్తనాలు దెబ్బతిన్నాయని, సబ్సిడీపై ప్రభుత్వం మినుము విత్తనాలు అందించాలని కోరుతున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా, పీఏసీఎ్‌సల ద్వారా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తేమశాతం పెంచి కొనుగోళ్లు చేపడితే కొంతవరకు నష్టాన్ని తగ్గించుకునే వీలుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ధాన్యం దిగుమతి చేసుకోని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం
గుడివాడ: ధాన్యం దిగుమతి చేసుకోకుండా కొందరు మిల్లర్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కామ్రేడ్ సుందరయ్యభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం దిగుమతిలో మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరుతో కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మిల్లుల వద్ద దిగుమతి చేసుకోకపోవడంతో నాలుగైదు రోజులుగా లారీలు నిలిచిపోతున్నాయని, తడిచిన ధాన్యం లారీల్లో ఉండటం వలన రంగు మారుతోందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
తేమశాతం నిబంధన సడలించాలి
గుడివాడ: తేమశాతం నిబంధనను సడలించి 48 గంటల్లో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మద్దతు ధర రూ.1730కు కొనుగోలు చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యం లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కనీస మద్దతు ధర తగ్గకుండా తడిచిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయపు డిప్యూటీ తహసీల్దార్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు.