Share News

రూ.1350 కోట్లు టర్నోవర్‌ లక్ష్యం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:54 AM

2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1350కోట్లు టర్నోవర్‌ చేయాలని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. శుక్రవారం పాలఫ్యాక్టరీలో పాలకవర్గ సమావేశం అనంతరం మీడియతో ఆయన మాట్లాడారు.

రూ.1350 కోట్లు టర్నోవర్‌ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ చలసాని ఆంజనేయులు

చిట్టినగర్‌, ఏప్రిల్‌ 26 : 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1350కోట్లు టర్నోవర్‌ చేయాలని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. శుక్రవారం పాలఫ్యాక్టరీలో పాలకవర్గ సమావేశం అనంతరం మీడియతో ఆయన మాట్లాడారు. రానున్న ఐదేళ్లను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌ కార్యాచరణకు పలు అంశాలపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.

విదేశాలకు విజయ ఉత్పత్తులు

కృష్ణా మిల్క్‌ యూనియన్‌(విజయడెయిరీ) పాలు, పాల ఉత్పుత్తులకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఇప్పటికే పాల ఉత్పత్తులను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిందని చలసాని ఆంజనేయులు చెప్పారు. అలాగే విదేశాలకు విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను ఎగుమతులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే విదేశాల్లో విజయ డెయిరీ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందని, విదేశాల్లో ఉండే భారతీయులు విజయ డెయిరీ ఉత్పత్తులను కోరుకుంటున్నారని వారి కోరిక మేరకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు సాధ్యసాధ్యాలు పరిశీలిస్తున్నామన్నారు.

రైతుల పిల్లల విద్యకు చేయూత

ఇటీవల ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో వెంట్రప్రగడ గ్రామానికి చెందిన యూనియన్‌ రైతు కొల్లిపల్లి తిరుమలరావు కుమార్తె రిషిత 470కి 466 మార్కులు సాధించి రాష్ట్రంలో రెండోస్ధానంలో నిలిచిందన్నారు. ఆమె పై చదువుల నిమిత్తం యూనియన్‌ తరుపున రూ 25000, గ్రామ సొసైటీ తరపున రూ 10000 ఆర్ధిక సాయం అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డైరెక్టర్లు దాసరి వెంకట బాలవర్ధనరావు, వేమూరి సాయి వెంకటరమణ, అంజిరెడ్డి, నాని, చక్రపాణి, కొండలరావు, నగేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:55 AM