Share News

లెక్కలేదా..?

ABN , Publish Date - Dec 28 , 2024 | 12:39 AM

పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు మాజీమంత్రి పేర్ని నానీకి సహకరిస్తున్నారా..? కావాలనే కేసు విచారణను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా?.. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. బియ్యం ఎంత మాయమైందో తేల్చడానికే నెల రోజుల సమయం పట్టడం, నిందితులను ఇంతవరకు పట్టుకోకపోవడం, బియ్యాన్ని స్వాహాచేసి కాకినాడ పోర్టుకు తరలించడం, కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును దిగమింగినా కేసును సిట్‌కు ఇవ్వకుండా స్థానిక పోలీసులే దర్యాప్తు చేస్తుండటం వెనుక కొన్ని అజ్ఞాత శక్తులు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

లెక్కలేదా..?
పొట్లపాలెంలో పేర్ని నానీకి చెందిన గోడౌన్‌

  • బియ్యం మాయం కేసులో అనుమానాలెన్నో..

  • పోలీసుల నుంచి పౌరసరఫరాల వరకు పేర్ని నానీకి సహకారం

  • కేవలం బియ్యం లెక్క తేల్చడానికే నెల సమయం

  • అధికారుల లెక్క 185 టన్నులు

  • మంత్రి నాదెండ్ల లెక్క 243 టన్నులు

  • చివరికి తేలింది 378 టన్నులు

  • పూర్తిగా తేల్చకుండా 185 టన్నులకు నోటీసులు

  • రూ.1.68 కోట్లు జరిమానా కట్టేసిన పేర్ని

  • మిగిలిన 193 టన్నులకు కట్టకుండా జంప్‌

  • కేసు నీరుగార్చడానికే అధికారుల తప్పుడు లెక్కలు

  • గత జనవరిలో గోడౌన్‌ అగ్రిమెంట్‌ రెన్యువల్‌

  • స్టాక్‌, వేబ్రిడ్జి సరిగ్గా ఉందని అధికారుల నివేదిక

  • వేబ్రిడ్జిలో లోపాలున్నాయని పేర్ని బుకాయింపు

(విజయవాడ/మచిలీపట్నం-ఆంధ్రజ్యోతి) : మాజీమంత్రి పేర్ని నానీకి చెందిన గోడౌన్‌లో బియ్యం కుంభకోణం వెలుగుచూసి నెల అవుతున్నా.. అటు అధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ సరైన వివరాలు సేకరించలేకపోయారు. నిందితురాలు పేర్ని నాని భార్య జయసుధతో పాటు గోడౌన్‌ మేనేజర్‌, నిందితుడు మానస్‌ తేజ్‌ను కూడా పట్టుకోలేక పోయారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. సాధారణ ఉద్యోగిని పట్టుకోవడానికి నెల సమయం తీసుకున్నారంటే అది ఉద్దేశపూర్వకంగానే జరిపే జాప్యమేననిపిస్తోంది.

లెక్క తేల్చడానికి నెల రోజులా?

మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో పేర్ని జయసుధ పేరున ఉన్న గోడౌన్‌లో తొలుత 185 టన్నుల బియ్యం మాయమైనట్లు అధికారులు లెక్కతేల్చారు. ఇదే విషయాన్ని జయసుధ జేసీకి నవంబరు 26న లేఖ రాశారు. ఆ లేఖలో పేర్కొన్న దాన్నే అధికారులూ నిర్ధారించేశారు. అంత మేరకు జరిమానా కట్టాలంటూ డిమాండ్‌ నోటీసులు కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కల్పించుకుని.. స్వాహా చేసిన బియ్యం 243 టన్నులని ప్రకటించారు. తీరుబడిగా లెక్కలు తేల్చిన అధికారులు తాజాగా 378 టన్నులు బియ్యం మాయమైనట్లు ప్రకటించారు. రోజుకో లెక్క చెప్పడం ద్వారా అధికారులే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మొదట్లో మాయమైన బియ్యం కిలోకు రూ.44.58 చొప్పున ధర నిర్ణయించారు. ఈ లెక్కల ప్రకారం 185 టన్నులకు రెట్టింపు సొమ్మును కట్టాలంటూ అధికారులు జారీచేసిన నోటీసుకు పేర్ని నాని సుమారు రూ.1.68 కోట్లను కట్టేశారు. అయితే, తాజా లెక్కల ప్రకారం మరో 193 టన్నులకు ఆయన జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. మరో రూ.1.72 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని కట్టేసినా గోడౌన్‌ యజమాని అయిన పేర్ని జయసుధపై క్రిమినల్‌ కేసు కొనసాగుతుంది. నిందితులకు శిక్ష పడేలా చేయాలంటే పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు పకడ్బందీగా ఆధారాలు సేకరించి కోర్టు ముందుంచాల్సి ఉంది. కానీ, ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

పోలీసుల సహకారం ఉందా?

బియ్యం మాయమైన ఘటనలో ఈ నెల 10న పౌరసరఫరాల శాఖ అధికారులు మచిలీపట్నం తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోడౌన్‌ యజమాని పేర్ని జయసుధ, మేనేజర్‌ మానస్‌ తేజ్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పేర్ని నాని కుటుంబసభ్యులు, గోడౌన్‌ మేనేజర్‌ అదృశ్యమయ్యారు. పేర్ని నాని ఒకటి రెండు రోజులు ఇంటివద్దే ఉన్నా, ఆ తర్వాత నుంచి కనిపించలేదు. దీంతో పేర్ని జయసుధ పేరుతో లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. జయసుధ కనిపించని నేపథ్యంలో పేర్ని నాని ఇంటికెళ్లిన పోలీసులు ఈ కేసులో వివరాలు తెలియజేసేందుకు ఆర్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి పేర్ని నాని కూడా కనిపించలేదు. బియ్యం మాయం కేసును నమోదుచేసే సమయంలోనే ముందస్తుగా పోలీసుల నుంచి పూర్తిస్థాయి సమాచారం నానీకి చేరిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయన కుటుంబం తప్పించుకోవడానికి ఆస్కారం లభించిందనే వాదన వినిపిస్తోంది. ఈ కేసును రాబర్ట్‌సన్‌ పేట (ఆర్‌పేట) పోలీసులు విచారణ చేస్తున్నారు. సీఐగా ప్రస్తుతం పనిచేస్తున్న ఏసుబాబు గతంలో గుడివాడలో దీర్ఘకాలం పనిచేశారు. ఈ సీఐ గుడివాడలో పనిచేసే సమయంలో అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పినట్టే మసలుకునేవారు. ఈ పరిచయాన్ని పేర్ని నాని బాగా ఉపయోగించుకుంటున్నారు. గోడౌన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులు, కంప్యూటర్లు పోలీసులకు అప్పగించామని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. తమ పని పూర్తయిందని, పోలీసులే ఈ కేసులో తగు చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసు విచారణలో పోలీసులు ఇంత వరకు ఎలాంటి ముందడుగు వేయలేకపోతున్నారు.

పౌరసరఫరాల శాఖ అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో గోడౌన్‌ను రెన్యువల్‌ చేశారు. ఆ సమయంలో స్టాక్‌ను తనిఖీ చేసి, అంతా సరిగ్గా ఉంటేనే రెన్యువల్‌ చేయాలి. ఎలాంటి తనిఖీలు చేయకుండానే, అంతా సక్రమంగా ఉందంటూ గోడౌన్‌ అగ్రిమెంట్‌ను మరో ఏడాది రెన్యువల్‌ చేశారు. వేబ్రిడ్జిని కూడా తనిఖీ చేసి బాగా ఉందని సర్టిఫై చేశారు. అయితే, అప్పటికే బియ్యం పక్కదారి పట్టిందా? లేక ఎన్నికల ముందు పక్కదారి పట్టిందా? అనే విషయాన్ని నిగ్గుతేల్చడంలో అధికారులు విఫలమయ్యారు. మరోవైపు పేర్ని నాని.. వేబ్రిడ్జిలో లోపాల కారణంగానే బియ్యం షార్టేజీ వచ్చిందని బుకాయిస్తున్నారు. వేబ్రిడ్జిలో లోపం ఉంటే వందల కేజీల్లో తేడా వస్తుంది కానీ, వందల టన్నుల్లో తేడా ఎలా వస్తుందనే ప్రశ్నకు సమాధానం లేదు. గోడౌన్‌కు పూర్తి బాధ్యత యజమానిదే. గోడౌన్‌లోని బియ్యం నిల్వల్లో అక్రమాలు జరిగితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఒప్పంద పత్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అధికారులు, పోలీసులు ఈ కేసుపై పూర్తిస్థాయిలో దృష్టిపెడితే నిందితులకు కచ్చితంగా శిక్షపడే అవకాశాలు ఉన్నాయి.

బెయిల్‌ పిటీషన్‌పై 30న తుదితీర్పు

ఈ కేసులో జయసుధ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం 9వ అదనపు జిల్లా కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 30కి వాయిదా వేశారు.

Updated Date - Dec 28 , 2024 | 09:56 AM