ముగ్గురూ ముగ్గురే..
ABN , Publish Date - Dec 10 , 2024 | 01:01 AM
సిటీ టాస్క్‌ఫోర్స్ (సీటీఎఫ్).. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్‌లో అత్యంత కీలకమైన విభాగం. ఇందులో ఉన్న అధికారులు, సిబ్బంది పోలీసు కమిషనర్ ఆధీనంలో ఉంటారు. ఈ విభాగంలో విధులు నిర్వర్తించే ముగ్గురు కానిస్టేబుళ్లపై సీపీ రాజశేఖరబాబు వేటు వేశారు.
టాస్క్‌ఫోర్స్‌లో కానిస్టేబుళ్ల త్రయం
పేకాట శిబిరాలపై దాడులు
నిర్వాహకులతో తెరవెనుక ఒప్పందాలు
ఆరోపణలు వచ్చిన ముగ్గురి బదిలీ
అంతర్గత విచారణకు ఆదేశాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సిటీ టాస్క్‌ఫోర్స్ (సీటీఎఫ్).. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్‌లో అత్యంత కీలకమైన విభాగం. ఇందులో ఉన్న అధికారులు, సిబ్బంది పోలీసు కమిషనర్ ఆధీనంలో ఉంటారు. ఈ విభాగంలో విధులు నిర్వర్తించే ముగ్గురు కానిస్టేబుళ్లపై సీపీ రాజశేఖరబాబు వేటు వేశారు. వారిని టాస్క్‌ఫోర్స్ నుంచి వివిధ విభాగాలకు బదిలీ చేశారు. అశోక్‌క్రాంతి, రామకృష్ణ, మొజాహిద్‌లను టాస్క్‌ఫోర్స్ నుంచి మార్పు చేశారు. అశోక్ క్రాంతిని ట్రాఫిక్ విభాగానికి, రామకృష్ణను మహిళా పోలీస్‌స్టేషన్‌కు, మొజాహిద్‌ను సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ ముగ్గురి పనితీరుపై పలు ఫిర్యాదులు అందడం, ఆరోపణలు రావడమే ఇందుకు కారణం.
అసలేం జరిగిందంటే..
టాస్క్‌ఫోర్స్‌లో ఈ ముగ్గురు నాలుగున్నరేళ్లకు పైబడి పనిచేస్తున్నారు. వీరు కేవలం పేకాట పైనే సమాచారం సేకరిస్తుంటారు. జిల్లాలో ఎక్కడ పేకాట శిబిరాలు నిర్వహించినా ఈ ముగ్గురికే సమాచారం వస్తుంది. ఇటీవల వీరితో పాటు మరికొంతమంది కలిసి రెండుచోట్ల పేకాట శిబిరాలపై దాడులు చేశారు. ఈ సమయంలో వీరు వ్యవహరించిన తీరుపై అనేక అభియోగాలు వచ్చాయి.
కొద్దిరోజుల క్రితం జి.కొండూరులోని పొలాల్లో కొంతమంది పేకాడుతున్నట్టు సమాచారం అందింది. రాత్రిపూట జరిగే ఈ పేకాట శిబిరంపై దాడి చేయడానికి ఎస్‌ఐ శివరాంబాబుతో కలిసి ఈ ముగ్గురు కానిస్టేబుళ్లు వెళ్లారు. ఈ టీమ్ అక్కడికి వెళ్లే సమయానికి పేకాట ముగిసిపోయింది. డబ్బు పోగొట్టుకున్న వారు నీరసంగా బయటకు వచ్చారు. డబ్బు సంపాదించిన వారు హుషారుగా బైకులెక్కారు. ఈ టీమ్ శిబిరం వద్దకు వెళ్తుండగా, మార్గంమధ్యలో కొంతమంది కనిపించారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకుని రూ.1.52 లక్షలు సీజ్ చేసినట్టు చూపించారు. వాళ్లందరినీ పేకాడుతుండగా పట్టుకున్నట్టు చూపించారు. దాడిచేసిన టీమ్‌లో జి.కొండూరు ఎస్‌ఐ కె.సతీష్‌కుమార్ కూడా ఉన్నారు. ఈ నిందితులను స్టేషన్‌లో అప్పగించారు. వాస్తవానికి ఈ 13 మందిని మార్గంమధ్యలో అరెస్టు చేశారు. ఈ శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకుడి గురించి మాత్రం ఆరా తీయలేదు. ఒక నిందితుడ్ని పట్టుకున్న అశోక్‌క్రాంతి అతడి ఫోన్‌ను పరిశీలించి నిర్వాహకుడి గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నిర్వాహకుడి పేరు నిందితుల జాబితాలో లేదు. అతడు ఎవరో తమకు తెలియదన్నట్టు వ్యవహరించారు. దీనివెనుక నిర్వాహకుడితో లోపాయికారి ఒప్పందాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. రాత్రి 11 గంటలకు మొదలైన ఈ టాస్క్ తెల్లవారుజామున 4 గంటల వరకు సాగడంతో పోలీసు వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పేకాట శిబిరంపై దాడి చేసి, నిందితులను సంబంధిత స్టేషన్‌లో అప్పగించడానికి ఇంత సమయం పడుతుందా.. అనే ప్రశ్న వచ్చింది. ఈ లోపాయికారి వ్యవహారంలో అశోక్‌క్రాంతి క్రియాశీలకంగా వ్యవహరిస్తే, దానికి రామకృష్ణ, మొజాహిద్‌లు భాగస్వాములుగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ.
నందిగామ మండలం రామిరెడ్డిపల్లి వద్ద భారీగా పేకాట శిబిరం నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న అశోక్‌క్రాంతి, రామకృష్ణ, మొజాహిద్‌లు అధికారులకు విషయం చెప్పారు. భారీ శిబిరమని అధికారులు వాహనాల్లో నందిగామ వద్దకు వెళ్లారు. అంతకుముందే శిబిరం వద్దకు వెళ్లిన ఈ ముగ్గురూ.. అధికారులకు ఆ ప్రాంతమెక్కడో చెప్పలేదు. కట్ చేస్తే.. కాసేపటికి శిబిరం నుంచి అంతా పారిపోయారని సమాచారమిచ్చారు. ఈ విషయంలోనూ ఈ త్రయంపై ఆరోపణలు బలంగా వచ్చాయి. ఈ ముగ్గురి పరిస్థితిపై లోగడ పనిచేసిన అధికారులకు పలువురు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. దీనిపై మరింత చెలరేగిపోయారు. ఈ రెండు పేకాట శిబిరాల వద్ద జరిగిన వ్యవహారాల కథలు పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు వద్దకు వెళ్లాయి. తొలుత అశోక్‌క్రాంతి, రామకృష్ణ, మొజాహిద్‌లను టాస్క్‌ఫోర్స్ నుంచి బదిలీ చేశారు. దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.