Share News

షాపు ఖాళీచేయమంటే కోర్టుకు ..

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:25 AM

దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన షాపు లీజు పూర్తికావడంతో ఖాళీ చేయమన్నందుకు అద్దెదారుడు కోర్టుకు వెళ్లాడు. దేవస్థానానికి చెల్లించాల్సిన అద్దె కూడా చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు.

షాపు ఖాళీచేయమంటే కోర్టుకు ..
కనకదుర్గానగర్‌లో దేవస్థానానికి చెందిన షాపు

వన్‌టౌన్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన షాపు లీజు పూర్తికావడంతో ఖాళీ చేయమన్నందుకు అద్దెదారుడు కోర్టుకు వెళ్లాడు. దేవస్థానానికి చెల్లించాల్సిన అద్దె కూడా చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. దుర్గగుడి అధికారులు 2021 సంవత్సరం చివరిలో కనకదుర్గానగర్‌లో అల్పాహారం, టీ, కాఫీ, కూల్‌ డ్రింక్స్‌, వాటర్‌ బాటిల్స్‌, ఐస్‌క్రీమ్‌లను మొబైల్‌ వాహనం ద్వారా విక్రయించుకునేందుకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో విశాఖపట్నం మరిడిమాంబ ఆలయ సమీపంలోని కనకాల వీధికి చెందిన సూరిశెట్టి గణేశ్‌ ఏడాదికి రూ.11.25 లక్షల అద్దె, అదనంగా జీఎస్టీ 18 శాతం దేవస్థానానికి చెల్లించే విధంగా రెండేళ్ల పాటు లీజుకు పాడుకున్నాడు. రెండో సంవత్సరానికి మొదటి సంవత్సరం లైసెన్స్‌ సొమ్ముపై పదిశాతం అదనంగా చెల్లించాలి. సుమారు మూడు నెలల క్రితం అతడి లీజు కాలపరిమితి ముగియడంతో అధికారులు షాపు ఖాళీ చేయాలని సూచించారు. అద్దెదారుడు షాపు ఖాళీ చేయకుండా కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు షాపు నిర్వహించుకునేందుకు గడువు ఇచ్చింది. అయితే బకాయి పడ్డ సుమారు రూ.6లక్షలకు పైగా చెల్లించకుండా అద్దెదారుడు కాలయాపన చేస్తున్నాడు. ఈ వ్యవహారంపై ఈవో కేఎస్‌ రామారావును వివరణ కోరగా, షాపు అద్దెదారుడు లీజు కాలపరిమితి ముగియటం వాస్తవమేనని, దేవస్థానానికి బకాయి చెల్లించాలని తెలిపారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున లీగల్‌గా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 18 , 2024 | 12:25 AM