Share News

గుండెల్లో రైళ్లు

ABN , Publish Date - Jul 14 , 2024 | 01:19 AM

బెజవాడ రైల్వే డివిజన్‌లో భారీ ఎత్తున వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు, గుంతకల్లు డివిజన్లలో అవినీతి రైల్వే అధికారులను రెడ్‌ హ్యాండె డ్‌గా పట్టుకున్న సీబీఐ తాజాగా విజయవాడ రైల్వే డివిజన్‌పై కూడా దృష్టి సారించిందని సమాచారం.

గుండెల్లో రైళ్లు

విజయవాడ రైల్వే డివిజన్‌పై సీబీఐ దృష్టి

గుంటూరు, గుంతకల్లు డివిజన్లలో ఇప్పటికే దాడులు

విజయవాడ డివిజన్‌లో వేళ్లూనుకున్న అవినీతి

వరుస దాడులతో ఇక్కడి అధికారుల్లో బెంబేలు

బెజవాడ రైల్వే డివిజన్‌లో భారీ ఎత్తున వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంటూరు, గుంతకల్లు డివిజన్లలో అవినీతి రైల్వే అధికారులను రెడ్‌ హ్యాండె డ్‌గా పట్టుకున్న సీబీఐ తాజాగా విజయవాడ రైల్వే డివిజన్‌పై కూడా దృష్టి సారించిందని సమాచారం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దశాబ్దకాలంగా విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో వేళ్లూనుకున్న అవినీతి రారాజులపై సీబీఐ వద్ద పూర్తి సమాచారం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సీబీఐకి కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ప్రధానంగా రైల్వే కమర్షియల్‌ విభాగంలో కొందరు అవినీతి అధికారులపై సీబీఐకి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. రైల్వే కమర్షియల్‌ విభాగంలో దశాబ్దకాలానికిపైగా జరుగుతున్న వ్యవహారాలు, రైల్వేస్టేషన్‌ కేంద్రంగా సాగుతున్న అక్రమాలపై పూర్తి సమాచారం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో వరుస సీబీఐ దాడులతో విజయవాడ రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ విభాగంలోని కొందరు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

పక్కా ‘కమర్షియల్‌’

విజయవాడ డివిజన్‌లో రైల్వే కమర్షియల్‌ విభాగంలోని కొందరు అధికారులు కాంట్రాక్టర్ల నుంచి మామూళ్లు తీసుకోవటం దశాబ్దకాలంగా జరుగుతోంది. రైల్వే అధికారులు బదిలీ అయినా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఒకప్పుడు విజయవాడలో అవినీతి రాజ్యమేలిన కమర్షియల్‌ అధికారి ఒకరు గుంతకల్లు వెళ్లారు. అక్కడ జరిగిన సీబీఐ దాడుల్లో సదరు అధికారి పట్టుబడతారని అందరూ భావించారు. ప్రస్తుతం విజయవాడలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న అధికారులు కొందరున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ను అడ్డాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా పాసింజర్‌ రైళ్లలో గూడ్స్‌ను తరలిస్తున్నారు. వీరిపై కేసులు రాయటానికి వీల్లేదు. కేసులు రాసిన టీటీపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. దీంతో రైల్వేస్టేషన్‌ కేంద్రంగా కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు రైల్వే సిబ్బందిని ఎదిరించే స్థాయి దాటి, బెదిరించే వరకు వెళ్లారు. పాసింజర్‌ రైళ్లలో నిషేధిత వస్తువులు రవాణా చే సినవారు కూడా ఉన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రమాదం కలిగించే వస్తువులను రవాణా చేసే వారికి కమర్షియల్‌ విభాగంలోని కొందరు అధికారులు సహకరిస్తున్నారు.

స్టాళ్ల కేటాయింపులో అవినీతి

విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఫుడ్‌ స్టాళ్ల కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. టెండర్లలో షాపులు దక్కించుకున్నవారు సబ్‌ కాంట్రాక్టులకు ఇచ్చేస్తున్నారు. తనిఖీలు పెద్దగా ఉండవు. ఎప్పుడైనా తనిఖీలు జరిపితే తమ గుమాస్తాలు ఉన్నారని చెబుతారు. స్టాళ్లలో ఎంతమంది గుమాస్తాలు ఉంటారు? ఎంతమందికి రైల్వే అధికారులు అనుమతులిచ్చారు? ఎంతమంది సిబ్బందికి అనుమతించారు? కాంట్రాక్టు సంస్థ ఎంతమందిని నియమించుకుంది? వంటి వివరాలు ఎవరికీ తెలియవు. వీటిని పరిశీలిస్తే.. దొంగలెవరనేది తేలిపోతుంది. కానీ పట్టించుకునేవారు లేరు. కమర్షియల్‌ విభాగంలోని అధికారుల అండదండలు ఉండటం వల్ల ఇతర రైల్వే సిబ్బంది వీరిపై చర్యలు తీసుకోవటానికి సహకరించట్లేదు. స్టాళ్ల కేటాయింపుల్లో అడ్డగోలు వ్యవహారాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తమ వ్యాపారాల్లో కొంత వాటా ఇచ్చే వారితో కొంతమంది అధికారులు టెండర్లు వేయిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. టెండర్లలో మిగిలిన సంస్థలకు అది లేదు.. ఇది లేదు.. అని చెప్పి, వారిని అనర్హతకు గురి చేసి, తాము అనుకున్న వారికి కట్టబెట్టేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఇంజనీరింగ్‌ పనుల్లో చేతివాటం

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో జరుగుతున్న ఇంజనీరింగ్‌ పనులకు సంబంధించి కూడా కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆర్వీఎన్‌ఎల్‌ చేపట్టే పనులు కూడా సబ్‌ కాంట్రాక్టులకు వెళ్లిపోతున్నాయని, ఈ ముసుగులో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని చెబుతున్నారు. రైల్వే ఆసుపత్రిలో రిఫరల్‌ ఆసుపత్రులకు సిఫార్సు చేయటంలోనూ, వాటికి బిల్లులు చెల్లించే విషయంలోనూ అవినీతి వ్యవహారాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గతంలో రైల్వే హాస్పిటల్‌ అక్రమాలపై సీబీఐ తనిఖీలు కూడా నిర్వహించింది. అలాగే, మందుల కొనుగోళ్లలో కూడా గోల్‌మాల్‌ వ్యవహారాలు జరిగాయి.

Updated Date - Jul 14 , 2024 | 01:19 AM