Share News

చివరి గింజ కొనేవరకు అప్రమత్తం

ABN , Publish Date - Dec 27 , 2024 | 01:29 AM

జిల్లాలో ఖరీ్‌ఫకు సంబంధించి రైతు సేవాకేంద్రాల పరిధిలో ఇప్పటివరకు రూ.178.39 కోట్ల విలువైన 77,440 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 11,730 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. చివరిగింజ కొనుగోలు వరకు అత్యంత అప్రమత్తంగా వుండాలని కలెక్టర్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం కోనుగోళ్లపై రెవెన్యూ పౌర సరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్‌, సహకార తదితరశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

చివరి గింజ కొనేవరకు అప్రమత్తం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ లక్ష్మీశ, చిత్రంలో జేసీ నిధి మీనా, ఆర్డీవో తదితరులు

  • రైతులను చేయిపట్టి నడిపించండి

  • ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించాలి

  • నిర్లక్ష్యానికి తావులేకుండా సమన్వయంగా పనిచేయండి

  • సమీక్షా సమావేశంలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

కృష్ణలంక, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఖరీ్‌ఫకు సంబంధించి రైతు సేవాకేంద్రాల పరిధిలో ఇప్పటివరకు రూ.178.39 కోట్ల విలువైన 77,440 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 11,730 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. చివరిగింజ కొనుగోలు వరకు అత్యంత అప్రమత్తంగా వుండాలని కలెక్టర్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం కోనుగోళ్లపై రెవెన్యూ పౌర సరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్‌, సహకార తదితరశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం, రైతుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము, గోనెసంచుల అందుబాటు, మిల్లులకు ధాన్యం రవాణా, వర్షాల నేపధ్యంలో తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితరాలపై చర్చించారు. ఏ ఒక్క రైతుకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతు హితమే లక్ష్యంగా సమన్వయ శాఖల అధికారులు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందించాలని స్పష్టం చేశారు. కోతలు చివరి దశలో ఉన్నందున ఆయా రైతులతో క్షేత్రస్థాయిలో మండల, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎప్పటి కప్పుడు మాట్లాడుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొంటూ పనిచేయాలన్నారు. తేమశాతం, మద్దతు ధర, గన్నీలు, రవాణా సౌకర్యం ప్రతి అంశాన్ని క్షుణంగా వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి వీఐఆర్‌ఎస్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకొంటోందని, ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంతృప్తి విషయంలో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు ప్రతి అధికారి, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో వుంచుకొని అందుబాటులో ఉన్న టార్పాలిన్ల సంఖ్యను పెంచాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

పక్కదారి పడితే సహించేది లేదు..

ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎ్‌స)కు సంబంధించి ఒక్క బియ్యపు గింజ పక్కదారి పట్టినా సహించేది లేదని, పేదల బియ్యం పక్కదారి పట్టకుండా క్షేత్రస్థాయి అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కస్టమ్‌ మిల్లెడ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కలర్‌ పరీక్షలపై దృష్టిసారించాలని, పరీక్ష ఫలితాలను డాక్యుమెంట్‌ చేయాలని ఆదేశించారు. తహసీల్ధారు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు మిల్లులు, పీడీఎస్‌ దుకాణాలు, ఎండీయూ వాహనాలను ఎప్పటికప్పుడు తనిఖీచేసి, నివేదికలు సమర్పించాలన్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై కేసుల నమోదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆహార భద్రత కల్పించడంలో అత్యంత కీలకమైన పౌర సరఫరాల వ్యవస్థలో ఏ చిన్న అవకతవకలకు ఆస్కారం లేకుండా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీనా, ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ ఎం.శ్రీనివాస్‌, డీఎ్‌సవో ఎ.పాపారావు, జిల్లా వ్యవసాయ టెక్నికల్‌ అధికారి ఎం.స్వప్న, జిల్లా కో-ఆర్డినేటర్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసరెడ్డి, మార్కెటింగ్‌ ఏడీ కె.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 01:29 AM