Share News

Volunteers: మాట ఇచ్చి మోసం చేస్తారా.. వాలంటీర్ల ఆగ్రహం

ABN , Publish Date - Dec 16 , 2024 | 12:14 PM

Andhrapradesh: విజయవాడలో వాలంటీర్లు ఆందోళనకు దిగారు. 2.60 లక్షల మంది వాలంటీర్లుగా పని చేస్తున్నామని.. ఆరు నెలలుగా పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని వారు అన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇటీవల వచ్చిన వరదల్లో వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకున్నారని ప్రశ్నించారు.

Volunteers: మాట ఇచ్చి మోసం చేస్తారా.. వాలంటీర్ల ఆగ్రహం
Volunteers protest in Vijayawada

విజయవాడ, డిసెంబర్ 16: తమ సమస్యలను పరిష్కరించాలంటూ గాంధీనగర్ ధర్నా చౌక్‌లో సోమవారం వాలంటీర్లు (Volunteers) ఆందోళనకు దిగారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ... 2.60 లక్షల మంది వాలంటీర్లుగా పని చేస్తున్నామని.. ఆరు నెలలుగా పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. ఎన్నికల ముందు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇటీవల వచ్చిన వరదల్లో వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకున్నారని ప్రశ్నించారు. మహిళలకు అధర్మం జరగకూడదన్న పాలకులే అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన


స్కిల్ డెవలప్‌మెంట్‌లో కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. ఆరు మాసాలుగా జీతాలు కూడా పెండింగ్‌లో పెట్టి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు అండగా ఉంటామని మాట ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా సమస్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు స్పందించాలి.. మా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి’’ అని వాలంటీర్లు డిమాండ్ చేశారు.


వీఏవోల ధర్నా..

మరోవైపు వీఏవోలు కూడా విజయవాడలో ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఏవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీఏవోలకు మద్దతుతగా వివిధ కార్మిక సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు న్యాయం జరుగుతుందని భావించామన్నారు. ఐదు నెలలుగా వేతనాలులేక వీఏవోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెలకు 8వేల వేతనాన్ని.. 15 వేల మందికి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.


సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇంట్లో కుటుంబాలు కూడా గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వారి సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారని.. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయినా స్పందన లేదన్నారు. కాల పరిమితి సర్క్యూలర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. వేతనాలు వెంటనే చెల్లించకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వీఏవోలు హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

బాబోయ్.. ఈ టీ వెరీ కాస్ట్‌లీ

తెలంగాణ అసెంబ్లీ.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 12:14 PM