ఒక్క బిడ్‌తో.. కట్టబెట్టేశారు!
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:27 AM
సామూహిక రక్షిత మంచినీటి పథకం (సీపీడబ్ల్యూఎస్)లో భాగంగా ఆకుమర్రు రిజర్వాయర్ ఆపరేషన్ అండ్ మెయింట్‌నెన్స్ (ఓఅండ్‌ఎం) కోసం పిలిచిన టెండర్లు అవినీతి కంపు కొడుతున్నాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఓఅండ్ ఎం స్కీములనూ అవినీతి అధికారులు తమకు భోజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. సింగిల్ టెండర్ పడినా.. అర్హతలు లేవని తెలిసినా.. నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేశారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున చేతులు మారాయన్న తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.
అర్హతలు లేకున్నా కొనసాగింపునకు నిర్ణయం
భారీగా నగదు చేతులు మారినట్టు ఆరోపణలు
టెండర్‌పై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈకి ఫిర్యాదు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) నేతృత్వంలో మచిలీపట్నం సబ్‌డివిజన్ పరిధిలోని ఆకుమర్రు రిజర్వాయర్ ఓఅండ్‌ఎం కోసం పిలిచిన టెండర్లలో ఒకే ఒక్క టెండర్ పడింది. అదికూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ దానినే కొనసాగించేలా నిర్ణయం తీసుకోవటం వెనుక భారీ ఎత్తున చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫ విజయవాడలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కార్యాలయంతో పాటు, మచిలీపట్నం సబ్‌డివిజన్ పరిధిలోని అధికారులకు భారీగా చేతులు తడపటం వల్ల నిబంధనలకు విరుద్ధమైనా టెండర్ కట్టబెట్టేశారని తెలుస్తోంది. గతంలో వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తికి టెండర్‌ను కట్టబెట్టడం ఇంకా విమర్శలకు తావిస్తోంది. ఈ టెండర్‌పై ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విద్యాసాగర్‌కు ఫిర్యాదు అందింది. దీనిపై ఆయన విచారణకు ఆదేశించాల్సి ఉంది.
ఫ మచిలీపట్నం సబ్‌డివిజన్ పరిధిలోని ఆకుమర్రు గ్రామంతో పాటు మరో 52 హ్యాబిటేషన్స్‌కు రక్షిత మంచినీటిని అందించేందుకు స్థానిక రిజర్వాయర్ నిర్వహణ కోసం ఈ నెలలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు టెండర్లు పిలిచారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఆఖరు వరకు ఏడాది కాలానికి టెండర్లు పిలుస్తారు. సవరించిన అంచనాల ప్రకారం ఏడాదికి రూ.1.99 కోట్లు విలువతో ఈ టెండర్‌ను పిలవాల్సి ఉండగా.. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మూడునెలల కాలానికి అంటే మార్చి వరకు నిర్వహణకు గాను రూ.60 లక్షలకు టెండర్లు పిలిచారు. మార్చి తర్వాత తిరిగి జడ్పీ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అమలతున్న ఓఅండ్‌ఎం స్కీమ్‌లను పరిశీలిస్తే.. మళ్లీ డిసెంబరులో తప్పితే సాధారణంగా జడ్పీ అనుమతులు ఇవ్వటం లేదు. అప్పటి వరకు ఉన్న సంస్థలనే కొనసాగించే పరిస్థితి. అంటే ప్రస్తుతం మూడు నెలలకు పిలిస్తే.. అనుకోకుండా అదే కాంట్రాక్టర్‌ను మరికొంతకాలం కొనసాగిస్తారు.
వైసీపీ వీర విధేయుడికే టెండర్
గతంలో వైసీపీ వీరవిధేయుడిగా ఉన్న ఓ కాంట్రాక్టర్ ఈ ఓఅండ్‌ఎం కోసం టెండరు వేయగా ఆ ఒక్క టెండర్ మాత్రమే పడింది. సహజంగా సింగిల్ టెండర్ పడితే.. దానిని రద్దుచేసి పోటీ పెంచటానికి మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఈపని చేయలేదు. దీంతో పాటు టెండరు నిబంధనల ప్రకారం అనుభవం లేకున్నా కట్టబెట్టడం విశేషం.
నిబంధనలు బేఖాతరు
టెండరు నిబంధనల ప్రకారం ఆకుమర్రు రిజర్వాయర్ ఓఅండ్‌ఎం కోసం 3,74,821.13 కేఎల్ పరిమాణాన్ని నిర్వహించగలిగిన అనుభవం ఉండాలి. కానీ టెండరు వేసిన వైసీపీ వీరవిధేయుడికి 3,28,258.44 కేఎల్ పరిమాణం నిర్వహణ చేపట్టగలిగిన అనుభవం మాత్రమే ఉంది. కాబట్టి వెంటనే టెండర్‌ను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలి. కానీ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఏకంగా టెండర్‌ను కట్టబెట్టేశారు.
కొందరు అవినీతి అధికారుల హస్తం!
విజయవాడలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కార్యాలయంలోని కొందరు అధికారుల హస్తంతో టెండర్‌ను ఆమోదించినట్టుగా తెలుస్తోంది. భారీఎత్తున చేతులు మారటం వల్లనే ఈ టెండర్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి టెండర్లలో పోటీ ఉంటే.. ఆకుమర్రు ఓ అండ్‌ఎం నిర్వహణకు 50 శాతం వరకు లెస్ టెండర్లు పడి ఉండేవి. ఎవరినీ ఈ టెండర్లలో పాల్గొనకుండా అధికారులు మేనేజ్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ పడినా అదే కాంట్రాక్టర్‌తో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అగ్రిమెంట్ చేసుకోవటం గమనార్హం.