Share News

కాలికి ఆపరేషన్‌ చేయించుకున్న యువతి మృతి

ABN , Publish Date - May 18 , 2024 | 01:29 AM

ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కాలికి ఫ్యాక్చరవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి వేసిన ప్లేట్లను తీయించుకోవడానికి ఎంజే నాయుడు ఆస్పత్రికి వచ్చిన యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వలనే యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపరేషన్‌ వికటించి యువతి మృతిచెందిందని వైద్యులు అసలు విషయం చెప్పకుండా దాటవేసి తమను మభ్యపెట్టారని ఆస్పత్రిని సీజ్‌ చేయాలని ఆమె తండ్రి డిమాండ్‌ చేశారు.

కాలికి ఆపరేషన్‌ చేయించుకున్న యువతి మృతి
మృతి చెందిన బీటెక్‌ విద్యార్థిని లిఖిత(ఫైల్‌)

శస్త్రచికిత్స వికటించి చనిపోయిందని తండ్రి ఆరోపణ

ఎంజే నాయుడు ఆస్పత్రిని సీజ్‌ చేయాలని డిమాండ్‌

ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన

పోలీసుల రంగప్రవేశం..న్యాయం చేయిస్తామని హామీ

ఆందోళన విరమించిన యువతి కుటుంబసభ్యులు

వన్‌టౌన్‌, మే 17: ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కాలికి ఫ్యాక్చరవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి వేసిన ప్లేట్లను తీయించుకోవడానికి ఎంజే నాయుడు ఆస్పత్రికి వచ్చిన యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వలనే యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపరేషన్‌ వికటించి యువతి మృతిచెందిందని వైద్యులు అసలు విషయం చెప్పకుండా దాటవేసి తమను మభ్యపెట్టారని ఆస్పత్రిని సీజ్‌ చేయాలని ఆమె తండ్రి డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. గాంధీనగర్‌ ఐనాక్స్‌ థియేటర్‌ ఎదురుగా నివసిస్తున్న వస్త్ర వ్యాపారి రమేష్‌ కుమార్తె లిఖిత(18) మిక్‌లో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ఐదేళ్ల క్రితం ఆమె కాలికి ఫ్యాక్చర్‌ కావడంతో శస్త్రచికిత్స చేసి ప్లేట్లు వేశారు. ఆ ప్లేట్లను తీయించుకోవాలని ఈనెల 15న ఉదయం 11 గం టలకు సూర్యారావుపేటలోని ఎంజే నాయుడు ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి ఆమెకు ఆపరేషన్‌ థియేటర్‌లో శస్త్రచికిత్స చేశారు. తర్వాత లిఖి తకు సీరియస్‌గా ఉందని చెప్పారు. శుక్రవారం ఉదయం లిఖిత మృతిచెందింది. లంగ్స్‌లోకి నీరు వెళ్లిందని, ఫిట్స్‌ వచ్చాయని వెంటిలేటర్‌లో ఉంచామని, ఇంట్లో ఎవరికైనా ఫిట్స్‌ ఉన్నాయా అంటూ తల్లిదండ్రులకు వైద్యులు ఆలస్యంగా చెప్పడంతో కుటుంబసభ్యుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఆస్పత్రి వైద్యులు తమను మభ్యపెట్టారని విషయం చెప్పకుండా దాటవేశారని, ఆపరేషన్‌ వికటించి లిఖిత మృతిచెందిందని ఆమె తండ్రి రమేశ్‌ ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట యువతి కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించారని సమాచారం తెలుసుకున్న సౌత్‌ ఏసీపీ జి.రత్నంరాజు ఆధ్వర్యంలో సూర్యారావుపేట, గవర్నరుపేట, కృష్ణలంక సీఐలు దుర్గారావు, రమణ, మురళీకృష్ణ, టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీధర్‌లు సిబ్బందితో వెళ్లి వైద్యులు, యువతి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారు. న్యాయం చేయి స్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. అనంతరం లిఖిత మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.

Updated Date - May 18 , 2024 | 01:29 AM