Share News

తొలి రోజు 15 నామినేషన్లు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:40 PM

ఎన్నికల కురుక్షేత్రంలో మరో అంకం మొదలైంది. కర్నూలు పార్లమెంట్‌ సహా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఓ) గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

తొలి రోజు 15 నామినేషన్లు

కర్నూలు, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కురుక్షేత్రంలో మరో అంకం మొదలైంది. కర్నూలు పార్లమెంట్‌ సహా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఓ) గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో కర్నూలు పార్లమెంట్‌ స్థానం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, పాణ్యం నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. కర్నూలు ఎంపీ స్థానం, కోడుమూరు, ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని నుంచి 15 మంది అభ్యర్థులు తొలి రోజే నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నుంచి ఒక్క నామినేషన్‌ కూడా రాలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా బస్తిపాటి నాగరాజు, ఆయన సతీమణి కె. జయసుధ, స్వతంత్ర అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందిన టి. బీచుపల్లి నామినేషన్లు వేశారు. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి వేలాది మంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కార్యకర్తలు, నాయకుల ఆనందోత్సాహాల మధ్య నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన తండ్రి దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి సంప్రదాయం కొనసాగింపుగా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో బీవీ జయనాగేశ్వరరెడ్డి నామినేషన్‌ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే బీవీ సతీమణి బీవీ నిత్యారెడ్డి కూడా రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలు వేశారు. వైసీపీ అభ్యర్థి, మాజీ ఎంపీ బుట్టా రేణుక నామినేషన్‌ దాఖలు చేశారు. కోడుమూరు (ఎస్సీ) టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి టీడీపీ సీనియర్‌ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి కలిసి వెళ్లి కర్నూలు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్‌ఓ శేషిరెడ్డికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీశ్‌ తరపున శివశంకర్‌ నామినేషన్‌ వేశారు. కర్నూలు నుంచి ఎస్‌డీపీఐ అభ్యర్థి ఖలీల్‌అహ్మద్‌, అన్న వైఎస్‌ఆర్‌ పార్టీ అభ్యర్థి అబ్దుల్‌ సత్తార్‌, ఆదోని నుంచి బీఎస్‌పీ అభ్యర్థి షేక్‌ ఆసియాభాను నామినేషన్‌ పత్రాలు దాఖాలు చేశారు. మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నుంచి తొలి రోజు ఒక్క నామినేషన్‌ కూడా రాలేదు.

Updated Date - Apr 18 , 2024 | 11:40 PM