యువతకు అన్యాయం చేసిన కేంద్రం: ఏఐవైసీ
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:19 AM
కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని అఖిల భారత యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు అన్నారు.
కర్నూలు అర్బన్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని అఖిల భారత యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మురళీకృష్ణతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతన్నలను అప్పుల పాలు చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. ఉన్న పరిశ్రమలను ప్రైవేట్ పరం చేస్తూ అదానీ, అంబానీ కుటుంబాలకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ ఒప్పందంలో వేల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీ, జగన్‌పై ఇప్పటికి చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. మమతా నాగిరెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాల పేరుతో బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, పార్టీ నగర అధ్యక్షుడు జీలానీ బాషా, ఎం.ఖాశీం వలి, బి.బ్రతుకన్న, తదితరులు పాల్గొన్నారు.