పత్తి రైతు కుదేలు
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:45 AM
పత్తిపంటను నమ్ముకున్న రైతన్నలకు ఈఏడాది అప్పులే మిగిలాయి.
పంటను దున్నేస్తున్న అన్నదాతలు
పశువులకు గ్రాసంగా వదిలేస్తున్న వైనం
మరో పంట సాగు కోసం సన్నద్ధం
మంత్రాలయం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): పత్తిపంటను నమ్ముకున్న రైతన్నలకు ఈఏడాది అప్పులే మిగిలాయి. పంట చేతికందే సమయంలో తుఫాను ప్రభావంతో తీవ్రనష్టం వాటిల్లింది. గత ఏడాదితీవ్ర కరువుతో అల్లాడిన రైతులు ఈఏడాది అతివృష్టి కారణం గా పత్తిరైతులు కుదేలయ్యారు. అధికవర్షం కారణంగా పంటంతా ఎర్రగా మారింది. గులాబిరంగు పురుగుసోకి పంటనంతటిని నమిలేసింది. ఎన్ని మందులు వాడినా అదుపుకాకపోవడంతో మూగ జీవాలకు పత్తిపంటను గ్రాసానికి వదిలేశారు. మంత్రాలయం మండలంలోని చెట్నహల్లి గ్రామానికి చెందిన కమ్మరి వీరేష్, కమ్మరి నాగయ్య, ఈడిగ ఈరన్న గౌడు, బెస్త నారాయణమ్మ సాగుచేసిన పత్తిపంటను పశువులకు మేతగా వది లేశారు. అదేవిధంగా మాధవరం, వగరూరు, సూగూరు, బూదూరు, వి.తిమ్మాపురం, మాలపల్లి గ్రామాల్లోని రైతులు వందల ఎకరాల్లోని పంటలను దున్నేశారు. దాదాపు లక్షలు ఖర్చు పెట్టి పత్తిసాగుచేస్తే పెట్టుబడి సైతం రాలేదని వాపోతున్నారు. దిక్కుతోచని స్థితి లో కొంతమంది రైతులు పంటను పీకేయ డం, దున్నేయడం, మూగజీవాలకు మేతగా వదిలేయడం వంటివి చేస్తున్నారు. పత్తికి అధిక రేట్లు ఉన్నాయన్న ఆశతో సాగుచేస్తే చివరికి అప్పులే మూటగట్టుకో వాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతన్నలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పత్తిపంటను తొలగించి మిరప, మొక్కజొన్న, వేరుశ నగ, కంది, జొన్న వంటి పంటలైన సాగు చేస్తే కొం తైనా ఊరట లభిస్తుందని రైతులు వాపోతున్నారు.