Share News

మాయమవుతున్న నది

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:34 AM

హంద్రీ నది ఉనికి కోల్పోతున్నది. తుంగభద్ర ఉప నదిగా జిల్లా నీటిపారుదల వ్యవస్థలో హంద్రీకి ప్రాధాన్యత ఉంది.

మాయమవుతున్న నది
కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తున్న హంద్రీ నది పరంబోకు భూములు ఇవే..

చిన్నటేకూరు దగ్గర కబ్జాకు గురవుతున్న నది భూమి

అనధికారింగా వెంచర్‌ వేసి ప్లాట్లు అమ్మేందుకు యత్నాలు

టీడీపీ నాయకుల అండతో పెట్రేగుతున్న అక్రమార్కులు

పెద్దపాడు వడ్లోని వంకను కాజేసిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి

పట్టించుకోని రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు

కర్నూలు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): హంద్రీ నది ఉనికి కోల్పోతున్నది. తుంగభద్ర ఉప నదిగా జిల్లా నీటిపారుదల వ్యవస్థలో హంద్రీకి ప్రాధాన్యత ఉంది. అలాంటి నది కబ్జా కోరల్లో చిక్కుకున్నది. కల్లూరు మండలం దేవనగర్‌ దగ్గర పేరుగాంచిన రియల్టర్‌ ఒకరు నది పరంబోకు స్థలం అక్రమించాడు.. నిబంధనలు తుంగలో కలిపేసి బఫర్‌ జోన్‌లోనే పక్కా భవనాలు నిర్మించాడు. జలవనరుల శాఖ ఇంజనీర్లు ఫిర్యాదులు చేసినా రివెన్యూ, నగరపాలక అధికారులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకుల అండదండలతో చిన్నటేకూరు గ్రామం దగ్గర హంద్రీ నది భూముల్లో కొందరు ఏకంగా వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. అక్కడ ఎకరం రూ.1.50 కోట్లు పైమాటే. నాడు అధికారం మాటున వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడితే.. నేడు టీడీపీ ముఖ్య నాయకుల పేర్లు చెప్పి నదీ స్థలాల్లో జెండా పాతుతున్నారు. అలారుదిన్నె నుంచి కల్లూరు వరకు హందీనది తీరం కబ్జాకు గురవుతున్న తీరుపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

పత్తికొండ మండలం పందికోన కొండల్లో ఒక పాయగా, చిన్నహుల్తి ఎగువన మరో పాయ (వంక)గా మొదలయ్యే హంద్రీనది దేవనకొండ మండలం అలారుదిన్నె సమీపంలో కలిసి దేవనకొండ, ఆస్పరి, గోనెగండ్ల, కోడుమూరు, కల్లూరు మండలాల్లో ప్రవహిస్తూ.. కర్నూలు నగర శివారు జొహరాపురం దగ్గర తుంగభద్రలో కలుస్తున్నది. నగరం మధ్యలో 5.40 కి.మీలు హంద్రీ ప్రవహిస్తుంది. నదిని సంరక్షించాల్సిన జలవనరుల శాఖ అధికారులు కళ్లకు గంతులు కట్టుకున్నారు. ఫలితంగా రూ.కోట్లు విలువైన హంద్రీనది పరంబోకు భూములు కబ్జాకు గురవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో హంద్రీ, వక్కేరు నదులు ఇష్టారాజ్యంగా అక్రమించారని నాడు టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమణలు తొలగించి నదిని కాపాడుతారని ప్రజలు ఆశిస్తే.. ఇందుకు విరుద్ధంగా టీడీపీ ముఖ్య నాయకుల పేర్లు చెప్పి నిబంధనలు విరుద్ధంగా నది తీర భూముల్లో వెంచర్లు వేయడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

కల్లూరు మండలం చిన్నటేకూరు పక్కన హంద్రీ నది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం హైదరాబాదు - బెంగళూరు వయా కర్నూలు జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. హంద్రీ నది కలుపుతూ వంక ప్రవహిస్తుంది. సర్వే నంబరు 1లో 130 ఎకరాలు నది పరంబోకు భూములు ఉన్నాయని రెవిన్యూ అధికారులు తెలిపారు. ఊరు పక్కనే పరంబోకు ప్రభుత్వ భూములను ఆ ఊరికి చెందిన కొందరు రైతులు పట్టాలు లేకున్నా సాగు చేసుకొని జీవిస్తున్నారు. ఆన్‌లైన్‌ అడంగల్‌ రికార్డులు పరిశీలిస్తే.. పరంబోకు ప్రభుత్వ భూమిగానే కనిపిస్తుంది. జాతీయ రహదారికి సమీపంలో ఉండడం, అక్కడికి దగ్గర్లోనే సూరత్‌ - చెన్నై వయా కర్నూలు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుండడంతో ఆ భూములకు భారీగా డిమాండ్‌ వచ్చింది. ఎకరం కనిష్ఠంగా రూ.1.50 కోట్లు పలుకుతోందని స్థానికులు అంటున్నారు. ఆ భూములపై కన్నేసిన అక్రమార్కులు రాజకీయ నాయకుల అండతో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది హంద్రీ నది పరంబోకు భూములు.. ఇక్కడ వెంచర్లు ఎలా వేస్తారు..? అని ఆ గ్రామస్తులు ప్రశ్నిస్తే తాము ఓ వ్యక్తి ద్వారా కొన్నామని, తాము నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మనుషులమని చెబుతున్నట్లు గ్రామస్తులు అంటున్నారు. రెవిన్యూ అధికారులు, జలవనరుల అధికారులు అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని హంద్రీ నది పరంబోకు భూములు కబ్జాల కోరల నుంచి సంరక్షించాలని కోరుతున్నారు. హంద్రీనది పరివాహకంలో ఉండే చిన్నటేకూరు, పెద్దటేకూరు, బస్తిపాడు, లక్ష్మీపురం, పందిపాడు, పసులూరు, నాయకల్లు, రేమడూరు, బొల్ల్లవరం, కల్లూరు ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే చేసి హంద్రీనది పరంబోకు ప్రభుత్వ స్థలాలు గుర్తించి కబ్జాకు గురికాకుండా నది రెండు వైపులు 100-200 మీటర్లకు ఒకటి చొప్పున సరిహద్దు సిమెంట్‌ దిమ్మెలు కట్టాలని పలువురు కోరుతున్నారు.

వంకను కలిపేసుకున్నారు

కల్లూరు మండలం పెద్దపాడు గ్రామం కర్నూలు నగరంలో అంతర్భాగమైంది. అక్కడి స్థిరాస్తి వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. ఎకరం రూ.4-5 కోట్లకు పైగా పలుకుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రైవేటు పట్టా భూముల్లో వెంచర్లు వేస్తూ.. పక్కనే ఉన్న వంకలు, వాగులు, ప్రభుత్వ పరంబోకు భూముల్ని కలిపేసుకుంటున్నారు. పెద్దపాడు ఎస్సీ కాలనీ సమీపంలో ఒకప్పుడు వడ్లోని వంక ప్రవహించేది. రికార్డుల ప్రకారం సర్వే నంబరు 128, 138 పరిధిలో 1.80 ఎకరాల వంక పరంబోకు భూమి ఉంది. ఇప్పుడు అది మాయమైంది. దాని పక్కనే గత వైసీపీ ప్రభుత్వంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఒకరు ఓ రైతు నుంచి ప్రైవేటు భూమిని కొని.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి 1.80 ఎకరాలు కూడా కలుపుకొని ఏకంగా కాంక్రీట్‌ గోడ కట్టేశారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడుగా చెప్పుకుంటున్న వ్యక్తి అండతో ఈ భాగోతం సాగినట్లు తెలుస్తోంది. కబ్జాకు గురైన భూమి విలువ దాదాపు రూ.10 కోట్లు పైమాటే అని గ్రామస్తులు అంటున్నారు. వంక కబ్జాకు గురికావడంతో వర్షాకాలంలో భారీ వర్షాలు వస్తే ఎస్పీ కాలనీ ముంపునకు గురవుతున్నది.

ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటాం

కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం సర్వే నంబరు 1లో హంద్రీ నది పరంబోకు ప్రభుత్వం భూమి 130 ఎకరాలు ఉంది. ఎక్స్‌కవేటర్లతో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసేందుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వం భూములను చదును చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో తక్షణమే ఆపేశాం. హంద్రీ నది పరంబోకు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. నది ఒడ్డున ప్రభుత్వ, బఫర్‌ జోన్‌ భూముల్లో వేసిన ప్లాట్లను కొంటే నష్టపోతారు. పెద్దపాడు వడ్లోని వంక అక్రమణపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.

- కె. ఆంజనేయులు, తహసీల్దార్‌, కల్లూరు

Updated Date - Nov 11 , 2024 | 12:34 AM