మెడికల్ కళాశాల విద్యార్థి దుర్మరణం
ABN , Publish Date - Jun 09 , 2024 | 11:57 PM
నగరంలోని మెడికల్ కళాశాల సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డి (21) అనే మెడికల్ కళాశాల విద్యార్థి దుర్మరణం చెందాడు.
కర్నూలు, జూన్ 9: నగరంలోని మెడికల్ కళాశాల సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డి (21) అనే మెడికల్ కళాశాల విద్యార్థి దుర్మరణం చెందాడు. శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన తేజేశ్వరరెడ్డి ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక రాజ్‌విహార్‌లో ఉన్న మెడికల్ కళాశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం మెడికల్ కాలేజీలోని రీడింగ్ రూమ్‌కు చదువుకునేందుకు వచ్చాడు. కొద్దిసేపు తర్వాత తిరిగి హాస్టల్‌కు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడ్డ తేజేశ్వరరెడ్డిపై బస్సు టైరు ఎక్కడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని తేజేశ్వర్ రెడ్డి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తేజేశ్వర్ రెడ్డి తల్లిదండ్రులు వెంకటనాథప్ప, గీతాలక్ష్మిలు ప్రభుత్వ టీచర్లుగా పని చేస్తున్నారు. తేజేశ్వరరెడ్డి సోదరుడు కూడా ఇటీవలే నీట్ పరీక్ష రాసినట్లు తెలిసింది. తేజేశ్వర్ రెడ్డి మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా కౌన్సెలింగ్‌లో ర్యాంకు దక్కించుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోధన వర్ణనాతీతం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైద్య విద్యార్థికి నివాళి
కర్నూలు(హాస్పిటల్): రోడ్డు ప్రమాదంలో గాయపడి దుర్మరణం చెందిన వైద్యవిద్యార్థి తేజేశ్వర్ రెడ్డి మృతి పట్ల కర్నూలు మెడికల్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా.హరిచరణ్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆదివారం మార్చురీ వద్ద ఉన్న వైద్య విద్యార్థి భౌతికకాయాన్ని హాస్టల్ ఇన్‌చార్జి వార్డెన్ డాక్టర్ జయరాం, డిప్యూటీ వార్డెన్ డా.సోమశేఖర్‌తో కలిసి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సందర్శించి నివాళులర్పించారు. మంచి భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థి మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.