వణికిస్తున్న పెంగల్ తుఫాన్
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:45 PM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు గత మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా విలవిల్లాడిపోతున్నారు.
పంట ఎక్కడ చేజారిపోతుందోనని రైతుల ఆందోళన
దిగుబడిని అమ్ముకోవడానికి అవకాశం లేని దుస్థితి
టార్పాలిన్లు లేక రైతుల గగ్గోలు
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతులు గత మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా విలవిల్లాడిపోతున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు చేతికందే దశలో పెంగల్ తుఫాన్ దాపురించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏర్పడిన ఈ తుఫాన్ ఎక్కడ తమను ముంచెత్తుతుందోనని కర్నూలు, నంద్యాల జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా ఎండ రావడం లేదు. ముసురు అలుముకున్నది. దీంతో పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లితే తేమ శాతం అధికంగా ఉందని ఎక్కడ కొనరో అని రైతులు ఆవేదన చెందుతున్నారు. 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే పత్తిని కొంటామని, అంతకంటే ఎక్కువ ఉంటే వెనక్కి పంపించేస్తామని సీసీఐ అధికారులు గత పది రోజులుగా రైతుల ముఖం మీద చెప్పేస్తున్నారు. ప్రస్తుతం పెంగల్ తుఫాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు లేకున్నా చెదురుమొదురు వానలు పడుతున్నాయి. ఎండ ఏ మాత్రం లేదు. దీంతో రైతులు పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లకుండా ఇళ్లలోనే నిల్వ చేసుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. అదే విధంగా వరి కోతలు మొదలయ్యాయి. కేసీ కెనాల్ పరిధిలోని నందికొట్కూరు, ఆత్మకూరు, కర్నూలు పరిసర గ్రామాలతో పాటు ఆళ్లగడ్డ వరకు వరికోతలు చురుగ్గా సాగుతున్నాయి. పెంగల్ తుపాన్ తాకిడికి పొలంలో పెరికిన వరిని గింజలు రాలకుండా చూసుకోవడంలో రైతులు తలకిందులవుతున్నారు. టార్పాలిన్లను రైతులకు అందించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో ప్రైవేటు దుకాణాల్లో కొని పంట దిగుబడులను కాపాడుకునేందుకు ఆగచాట్లు పడుతున్నారు. ఒక ఎకరాల్లో పోసిన వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంట ఉత్పత్తులు వర్షానికి తడవకుండా ఉండాలంటే దాదాపు రూ.1000 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు చెబుతున్నారు. ఈ పెంగల్ తుఫాన్ ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హొళగుంద: మండలంలో వరి కోత మిషన్ల కొరత ఉండడంతో రైతులకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా, కాలువ గట్లు, రైస్ మిల్లులకు తరలించి, వరి ధాన్యాన్ని పట్టాలు కప్పి కాపాడుకోవడానికి కష్టాలు పడుతున్నారు.