Share News

అహోబిలేశా.. పాహిమాం

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:00 AM

ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం నరసింహ నామ స్మరణతో మారుమోగింది. అహోబిలేశా.. పాహిమాం పాహిమాం అంటూ భక్తులు నినదించారు.

అహోబిలేశా.. పాహిమాం
స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి) : ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం నరసింహ నామ స్మరణతో మారుమోగింది. అహోబిలేశా.. పాహిమాం పాహిమాం అంటూ భక్తులు నినదించారు. ఏడాదిపాటు పూజా కైంకర్యాల్లో జరిగిన తప్పులు, దోషాల నివారణతోపాటు లోక కల్యాణార్థం దిగువ అహోబిలంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు శాస్త్రోక్తంగా నిర్వహించిన చతుస్థానార్చన, హోమం, మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. అవభృత స్నానం నిర్వహించిన అనంతరం అహోబిలేశ్వరుడు యాగశాల నుంచి గర్భాలయానికి వేంచేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో కుంభప్రోక్షణం నిర్వహించారు. ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు విశేష పూజలు, తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు వందలాదిగా తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో, గ్రామోత్సవంలో పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:00 AM