Share News

దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తా

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:54 PM

దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తానని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై మండిపడ్డారు.

దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తా
ఆత్మకూరులో మాట్లాడుతున్న బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు, ఏప్రిల్‌ 18: దోచుకున్న సొమ్మునంతా కక్కిస్తానని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిపై మండిపడ్డారు. గురువారం శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుడ్డా రాజశేఖరరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం గౌడ్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ముందు సీఎం జగన్‌ 40 హామీలిస్తే చెప్తే ఎమ్మెల్యే శిల్పా 400 అబద్ధాల హామీలతో ఇక్కడి ప్రజలు మోగించాడని చెప్పారు. వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌కు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తి పోతల పథకాన్ని ఏర్పాటు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆనాడు తాను సిద్దాపురం ఎత్తిపోతలను పూర్తిచేయిస్తే కనీసం పంట కాలు వలను కూడా నిర్మించలేని స్థితిలో శిల్పా ఉన్నారని అన్నారు. వర్ధన్‌ బ్యాంకు పేరిట రూ.30కోట్ల దళితుల సొమ్మును కాజేశారని ఆరోపించారు. శ్రీశైలంలో కార్తీకేయ ఏజెన్సీ పేరిట నెలకు రూ.కోటిన్నర దోచుకుంటున్నారని, శ్రీశైలంలో టీకొట్టు నుంచి మరే ఏ ఇతర వ్యాపారం చేసుకోవాలన్న శిల్పాకు శిస్తు చెల్లించాల్సిన స్థితికి మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన, బీజేపీ అండతో శ్రీశైలంలో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు.

ఇతర నాయకుల ప్రసంగాలు

మరోసారి ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపిస్తే శ్రీశైలాన్ని శిల్పా వెంచర్‌గా మార్చేస్తారని నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆరోపించారు. అనునిత్యం న్యాయం కోసం పోరాడే వ్యక్తి, ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి బుడ్డా రాజశేఖరరెడ్డి అని ఆయన గెలుపు కోసం మీరందరు పాటుపడాలని పిలుపునిచ్చారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎవరో ప్రజలెవరికీ తెలియదని, అలాంటి వ్యక్తులను గెలిపిస్తే నష్టపోయేది ప్రజలేనని అన్నారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బుడ్డా రాజశేఖరరెడ్డి గుండెలో రెండు స్టంట్లు వేశాడని, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ప్రాణాలకు తెగించి ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచారని, ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. విద్యావంతురాలైన డాక్టర్‌ బైరెడ్డి శబరిని కూడా గెలిపించాలని ఆకాంక్షించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖరగౌడ్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బుడ్డా విజయం ఖాయమన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా సతీమణి బుడ్డా శైలజమ్మ, శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి, టీడీపీ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు కలీముల్లా, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌, జనసేన నాయకులు అశోక్‌, శ్రీరాములు, బీజేపీ నాయకులు సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.

భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

ఆత్మకూరు పట్టణంలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ వేసేందుకు బుడ్డా రాజశేఖరరెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ ప్రక్రియ అనంతరం గౌడ్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బుడ్డా అనుచ రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని పలు కాలనీల నుంచి ఆయా పార్టీల శ్రేణులు భారీగా తరలివచ్చారు. సుమారు 10వేలకు పైగా జనం తరలిరావడంతో గౌడ్‌సెంటర్‌ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల శ్రేణులతో కిక్కిరిసింది. అలాగే గౌడ్‌సెంటర్‌ చుట్టూ ఉన్న మిద్దెలపైకి జనం భారీగా చేరుకున్నారు. దారిపొడవునా డ్రమ్స్‌ వాయిద్యాలతో సంబరాలు జరిపారు. మండుటెండల్ని సైతం లెక్క చేయ కుండా మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పాల్గొన్నారు.

ఆత్మకూరురూరల్‌: పెచ్చెరువు గూడేనికి చెందిన పులిచెర్ల వీరయ్య, ఆర్తి అంకన్న,దాసరి నాగన్న, రాముడు, నాగరాజు, అంకన్నతో పాటు సుమారు వంద కుటంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ గిరిజనులందరూ ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయం చేరుకుని బుడ్డారాజశేఖరరెడ్డిని కలుసుకుని టీడీపీలో చేరారు.

Updated Date - Apr 18 , 2024 | 11:54 PM