అపార్ ఆపసోపాలు
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:33 AM
నూతన విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికి జాతీయ స్థాయిలో ఒక జీవితకాల గుర్తింపు కార్డు జారీ చేయాలని కేంద్రం సూచించింది.
విద్యార్థుల వ్యక్తిగత వివరాల్లో తేడాలు
ఆధార్‌లో ఒకలా.. రికార్డులో మరోలా
ఒత్తిడి గురవుతున్న ఉపాధ్యాయులు
ఆదోని అగ్రికల్చర్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికి జాతీయ స్థాయిలో ఒక జీవితకాల గుర్తింపు కార్డు జారీ చేయాలని కేంద్రం సూచించింది. అందులో భాగంగా ఆటోమెటిక్ పర్మనెంట్ అకౌంట్ రిజిస్ట్రే(అపార్) 12 అంకెలు కూడిన కార్డును జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే పాఠశాలలో అపార్ జారీకి ఉపాధ్యాయులు ఆపసోపాలకు గురవుతున్నారు. విద్యార్థుల వ్యక్తిగత వివరాలలో తేడాలు ఉండడంతో తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థుల ఆధార్ కార్డులో ఒకలా.. స్కూలు రికార్డులో మరోలా ఉండడంతో అపార్ నమోదుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ వైపు విద్యాశాఖ ఒత్తిడి చేస్తుండడంతో విద్యార్థులు ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఆధార్ కేంద్రాల్లోనూ సరైన ఆధారాలు లేవని వెనక్కి పంపిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఆదోని నియోజకవర్గంలో 274 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 64,870 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ అపార్ జారీ చేయాలని ప్రభుత్వం సూచించింది. అందుకు ఉపాధ్యాయులు విద్యార్థుల స్కూలు రికార్డులను బట్టి ప్రభుత్వం పెట్టిన ప్రత్యేకమైన యాప్‌ల ోవారి వివరాలను నమోదు చేస్తున్నారు. చాలా మంది విద్యార్థుల వివరాల్లో తేడాలు ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ వైపు సాంకేతిక సమస్య.. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారులు త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు 47,934 మంది విద్యార్థులకు మాత్రమే అపార్ నమోదు చేశామని చెప్పుతున్నారు. 74 శాతం పూర్తయిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఆర్‌ఆర్‌లేబర్ కాలనీలోని పాఠశాలలో 954 మంది విద్యార్థులు చదువుతుండగా ఇప్పటి వరకు 550 మంది విద్యార్థులకు అపార్ నమోదు చేశారు. కొంతమంది విద్యార్థుల ఇంటి పేర్లు, పుట్టిన తేదీలు తల్లిదండ్రుల ఆధార్‌లో వేరేలా ఉండడం వల్ల 58 శాతం మాత్రమే పూర్తయింది.
నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో 1850 మంది చదువుతుండగా 1500
మంది విద్యార్థుకు అపార్ నమోదు చేశారు.
మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 1600మంది విద్యార్థులు చదువుతుండగా 1450 మందికిపైగా విద్యార్థులకు అపార్ జారీ చేశారు. మిగతా విద్యార్థులు వారి వివరాలు తప్పుగా ఉండడంతో సరి చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ప్రతి విద్యార్థికి అపార్ జారీ : శ్రీనివాసులు, ఎంఈవో ఆదోని
పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి అపార్ జారీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకునే అవకాశం కూడా కల్పించింది. విద్యార్థికి జీవిత కాలం ఒకే నెంబర్ ఉండేలా జారీ చేసిన కార్డు. ఉపాధ్యాయులు త్వరగా విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.