ఆక్రమణలో అవుకు రిజర్వాయర్
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:04 AM
నంద్యాల, కడప జిల్లాల్లో 42,509 ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీటిని అందించే అవుకు రిజర్వాయర్ ఆక్రమణకు గురవుతోంది.
వేస్టేజీని రిజర్వాయర్‌లోకి తోస్తున్న వ్యాపారులు
తగ్గుతున్న నీటి నిల్వ శాతం
ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
అవుకు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల, కడప జిల్లాల్లో 42,509 ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీటిని అందించే అవుకు రిజర్వాయర్ ఆక్రమణకు గురవుతోంది. అయినా ఎస్సార్బీసీ అధికారులు రిజర్వాయర్ నిర్వహణను గాలికి వదిలేశారని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలేరు చెరువు, గొల్లలేరు, తిమ్మరాజు చెరువులను కలుపుతూ 2010 నాటికి 4.148 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ సమీపంలో నిర్మించిన ఏపీ టూరిజం భవనం నుంచి కొత్త చెర్లోపల్లె సమీపంలో నిర్మించిన గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) వరకు తాడిపత్రికి వెళ్లే ఎన్‌హెచ్ ప్రధాన రహదారి ఉంది. వాహనదారుల రక్షణ కోసం రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్ స్థాయి నుంచి 100 నుండి 150 మీటర్లు భూభాగాన్ని వదిలి ప్రధాన రహదారిని నిర్మించారు. అయితే రిజర్వాయర్ వెంట వదిలిన భూభాగం నాపరాతి రాళ్ల డిపోల వ్యాపారులకు వరంగా మారింది. దాదాపు 2 కి.మీ మేర వ్యాపారులు ఆక్రమించి నాపరాతి డిపోలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు జిల్లాలకు నాపరాతిని కూలీలతో వివిధ ఆకృతుల్లో కటింగ్ చేయించి వ్యాపారులు సరఫరా చేస్తుంటారు. రిజర్వాయర్ భూభాగాన్ని వ్యాపారులు ఆక్రమించుకోవటమే కాకుండా నాపరాతి కటింగ్ నుంచి వచ్చే వేస్టేజీని పక్కనే ఉన్న రిజర్వాయర్‌లోకి ఎక్స్‌కవేటర్లతో తోయించేస్తున్నారు. దీంతో రిజర్వాయర్‌లో భారీ స్థాయిలో పూడిక చేరి నీటి నిల్వ శాతం తగ్గిపోతోంది. రిజర్వాయర్ భూబాగంలో ఏర్పాటు చేసుకున్న నాపరాతి డిపోలను తొలగించే విధంగా ఎస్సార్బీసీ అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నాపరాతి డిపోలను తొలగించాలి
రిజర్వాయర్ భూభాగంలో వ్యాపారులు నాపరాతి రాళ్ల డిపోలను ఏర్పాటు చేసుకోవటమే కాక రాళ్లనుంచి వచ్చే వేస్టేజీని రిజర్వాయర్‌లోకి తోచేస్తున్నారు. రిజర్వాయర్‌లో భారీగా పూడిక చేరి నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. ఎస్సార్బీసీ అధికారులు రిజర్వాయర్ నిర్వహణను గాలికి వదిలేశారు.
- పక్కీరగౌడు, రామాపురం
రిజర్వాయర్ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
రిజర్వాయర్ భూభాగం ఆక్రమణదారులపై ఎస్సార్బీసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. 2 కి.మీ మేర నాపరాతి రాళ్ల డిపోలను ఏర్పాటు చేసుకున్నారు. రిజర్వాయర్ పర్యవేక్షణపై ఎస్పార్బీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
- దూదేకుల సిద్ధయ్య, రామాపురం.