Share News

న్యుమోనియాతో జాగ్రత్త

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:02 AM

న్యుమోనియా ఒక తీవ్రమైన అంటువ్యాధి. ఇది దగ్గు, తుమ్ముల ద్వారా శ్వాసకోశ వ్యవస్థకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధి పిల్లలకు ఎక్కువగా వస్తుంది. వాతావరణంలో మార్పులు, వాయు కాలుష్యం వల్ల సాధారణంగా సీజన్‌ మారేటప్పుడు, ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉండే పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.

న్యుమోనియాతో జాగ్రత్త
చిన్న పిల్లల విభాగంలో చికిత్స పొందుతున్న బాధితులు

ప్రమాదకరంగా మారుతున్న కేసులు

బాధితుల్లో చిన్నారులే ఎక్కువ

నేడు వరల్డ్‌ న్యుమోనియా డే

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): న్యుమోనియా ఒక తీవ్రమైన అంటువ్యాధి. ఇది దగ్గు, తుమ్ముల ద్వారా శ్వాసకోశ వ్యవస్థకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధి పిల్లలకు ఎక్కువగా వస్తుంది. వాతావరణంలో మార్పులు, వాయు కాలుష్యం వల్ల సాధారణంగా సీజన్‌ మారేటప్పుడు, ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉండే పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. డబ్ల్యుహెచ్‌వి నివేదిక ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 8.30 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు న్యుమోనియాతో మరణిస్తున్నారు. పెద్దలు, పిల్లలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబరు 12న వరల్డ్‌ న్యుమోనియా దినాన్ని నిర్వహిస్తున్నారు.

న్యుమోనియా నివారణకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి శ్వాస గణనలు -న్యుమోనియాను దాన్ని ట్రాక్‌లో ఆపండి అనే నినాదాన్ని ఇచ్చింది. ప్రతి శ్వాస ప్రాముఖ్యతను తెలుసుకుని వ్యాధిని ముందుగా గుర్తించడం, చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం.

లక్షణాలు

న్యుమోనియాను ఎదుర్కోవాలంటే ముందు దాని లక్షణాలు అందరికీ తెలిసి ఉండాలి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

గుండె వేగంగా కొట్టుకోవడం

జ్వరం, వణుకు, చెమటలు

దగ్గు, ఆయాసం, కడపు ఉబ్బరం

ఛాతి నొప్పి, తలనొప్పి, వాంతులు.

న్యుమోనియా చికిత్స

ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. అందుకు తొలిదశలోనే గుర్తించాలి. ఐదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లల్లో న్యుమోనియాను త్వరగా తెలుసుకోవాలి. ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి. బ్యాక్టీరియా వల్ల సోకే న్యుమోనియాకు యాంటి బయోటిక్స్‌ ద్వారా చికిత్స అందించవచ్చు. అయితే వ్యాధి తీవ్రమైతే హాస్పిటల్‌లో తప్పక చేర్చాలి. ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, వంటి చర్యలతో న్యుమోనియా రోగులు త్వరగా కోలుకోవచ్చును.

కడుపులో కదలికలు

పిల్లల కడుపులో కదలికలను తల్లిదండ్రులు గమనిస్తుండాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే పిల్లల శ్వాస ఎలా ఉందో తల్లిదండ్రులకు తెలుస్తుంది. జలుబు వల్ల కూడా శ్వాసలో తేడా రావొచ్చు. వ్యాక్సినేషన్‌ సాయంతో చిన్న పిల్లల్లో న్యుమోనియాను అడ్డుకోవచ్చు. న్యుమోకాకల్‌ సూక్ష్మ జీవుల నుంచి వచ్చే న్యుమోనియాను అడ్డుకునేందుకు న్యుమోకాకల్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. మరో వైపు ఫ్లూ వ్యాక్సిన్‌ను వేయిస్తే వ్యాధి ముప్పును అడ్డుకోవచ్చును.

పెద్దాసుపత్రిలో పెరిగిన బాధితులు

సీజన్‌ మారడంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు న్యుమోనియా బాధితుల సంఖ్య పెరిగింది. ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగుల్లో 10 శాతం బాధితులు ఉన్నారు. ఇక చిన్న పిల్లల విభాగంలో ప్రతి రోజు ఓపీకి 300 మంది పిల్లలు వస్తుండగా.. అందులో 100 మంది న్యుమోనియాతో బాధపడేవారు. ఉన్నారు. అడ్మిషన్లల్లో కూడా చిన్న పిల్లలు 30 శాతం మంది చేరడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతుంది. చిన్న పిల్లలకు నెలలోపు పిల్లలకు ఎన్‌ఐసీయూ వారు చిన్నపిల్లలకు పీఐసీయూ యూనిట్‌లో నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆక్సిజన్‌ అంఇస్తూ నెబులైజేషన్‌ పెట్టి చికిత్స అందిస్తున్నారు.

30 శాతం మంది న్యుమోనియా బాధితులు

చిన్న పిల్లల విభాగానికి వచ్చే రోగుల్లో 30 శాతం న్యుమోనియాతో బాధప డుతుంటారు. అడ్మిషన్లలో 20 మందిలో 8 నుంచి 10 మంది చిన్న పిల్లలు చేరుతుం టారు. చలికాలంలో, సీజన్‌ మారే టప్పుడు చిన్నపిల్లల్లో ఈ కేసులు అధికమవుతుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఆయాసం వస్తే దాని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌లో చేర్పించాలి. కర్నూలు జీజీహెచ్‌లో న్యుమోనియా వ్యాధికి మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. ఆక్సిజన్‌, నెబులైజల్‌ యాంటీబయోటిక్‌ మందులు వెంటిలేటర్‌ సౌకర్యాలు ఉన్నాయి. - డా.బంగి విజయానందబాబు, ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌వోడీ, చిన్న పిల్లల విభాగం, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి

Updated Date - Nov 12 , 2024 | 12:02 AM