Share News

మరబోటు నిర్వాహకుల ఇష్టారాజ్యం

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:17 AM

బోటు నిర్వాహకులు కృష్ణానదిలో కేవలం 4 కి.మీలకు ఒక్కొక్కరి నుంచి రూ.300 వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.

మరబోటు నిర్వాహకుల ఇష్టారాజ్యం
బోటులో పరిమితికి మించి ఎక్కుతున్న భక్తులు

4 కిలోమీటర్లకు రూ.300

బెంబేలెత్తుతున్న భక్తులు

కొత్తపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): బోటు నిర్వాహకులు కృష్ణానదిలో కేవలం 4 కి.మీలకు ఒక్కొక్కరి నుంచి రూ.300 వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో భక్తులు తెలంగాణ సోమశిల నుంచి సంగమేశ్వరం వరకు.. సంగమేశ్వరం నుంచి ఆవలి ప్రాంతంలో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. సంగమేశ్వరం నుంచి కృష్ణానదిలో సోమశిల వరకు, సోమశిల నుంచి సంగమేశ్వరం వరకు మరబోటులో ప్రయాణం చేయాలంటే భక్తులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 నుంచి 12 మంది వరకే ఎక్కించుకోవాల్సి ఉంది. అయితే బోటు నిర్వాహకులు 30 నుంచి 40 వరకు భక్తులను ఎక్కిస్తున్నారు. అలాగే లైఫ్‌ జాకెట్లు కూడా ఇవ్వకుండా, భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అనుమతి లేకుండానే మరబోట్లు నడుపుతున్నట్లు సమాచారం. ఇదంతా అధికారులకు తెలిసినా నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మరబోట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:18 AM