30 ఏళ్ల తరువాత సొంతూరికి..
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:47 AM
మతిస్థిమితం లేక 30 ఏళ్ల క్రితం కన్నవారికి దూరమయ్యాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ నేపాల్‌కు చేరుకున్నాడు. అక్కడ మానవీయ సేవా కేంద్ర నిర్వాహకులు చేరదీశారు
మతిస్థిమితం లేక తప్పిపోయి నేపాల్ చేరిన ఇమ్మానుయేల్
ఎమ్మిగనూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం లేక 30 ఏళ్ల క్రితం కన్నవారికి దూరమయ్యాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ నేపాల్‌కు చేరుకున్నాడు. అక్కడ మానవీయ సేవా కేంద్ర నిర్వాహకులు చేరదీశారు. ఆశ్రమంలోనే ఉంచుకొని వైద్యం చేయించారు. అతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వాడిగా గుర్తించి పట్టణంలో ఉన్న వేదాస్ స్వచ్ఛంద నిర్వాహకులు సునీల్ కుమార్‌తో మాట్లాడి శనివారం ఎమ్మిగనూరుకు తీసుకొచ్చారు. అయితే కుటుంబ సభ్యులు పట్టణంలో ఎవరూ లేకపోవ టంతో వేదాస్ నిర్వాహకులు సునీల్ కుమార్‌కు అప్పగించారు. పట్టణంలోని ఎంబీ యోరుషలేం చర్చికి 1982-90లో పాస్టర్‌గా పని చేసిన రెవరెండ్ ఆదాంకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్న వాడు ఇమ్మానియేల్. ఈయనకు మతిస్థిమితం లేకపోవటంతో 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. కాలగమనంలో పాస్టర్ ఆదాం, ముగ్గురు కుమారులు, కుమార్తె మృతి చెందారు. అయితే ఇమ్మానుయేల్ నేపాల్ రాజధాని కాట్మాండు చేరుకున్నాడు. అక్కడ మానవీయ సేవాశ్రమ నిర్వాహకులు చేరదీశారు. ఐదేళ్లుగా వారి దగ్గరే ఉంచుకొని వైద్యం చేయించి వివరాలను తెలుసు కున్నారు. సొంత ఊరు ఎమ్మిగనూరు కావటంతో పట్టణంలోని వేదాస్ స్వచ్ఛంద సేవాశ్రమం నిర్వాహకులు సునీల్ కుమార్‌తో మాట్లాడి వివరాలు చెప్పారు. ఎమ్మిగనూరు వాసిగా గుర్తించిన ఆశ్రమ ప్రతినిధులు సుమన్‌తోపాటు మరొకరు ఇమ్మాను యేల్‌ను శనివారం ఎమ్మిగనూరుకు తీసుకొచ్చారు. అయితే వారి బంధువులు ఎవరూ లేకపోవటంతో వేదాస్ స్వచ్ఛంద సేవాశ్రమంలో ఉంచుకున్నారు. సునీల్ స్థానికుల ద్వారా ఇమ్మానుయేల్ బంధువుల వివరాలు తెలుసుకున్నాడు. అక్క విక్టోరియా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి గుర్తుపట్టారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పుడో 30 ఏళ్ల కిత్రం తప్పిపోయిన వ్యక్తి తిరిగి రావటంతో వారి కుటుంబ సభ్యులు ఆనందబాష్పాలు రాల్చారు. నేపాల్ నుంచి ఇమ్మానుయేల్‌ను ఎమ్మిగనూరుకు తీసుకొచ్చిన ప్రతినిధులకు ఎంబీ చర్చి, వేదాస్ స్వచ్ఛంద సేవాశ్రమం నిర్వాహకులు రూ. 25 వేలు అందజేశారు. చర్చి కార్యదర్శి భాస్కర్, బాబు, తిమ్మరాజు, పౌల్‌రాజు, ఆనంద్‌రాజు, పాస్టర్ డేవిడ్, సెక్రటరీ ప్రభాకర్, శాంతిరాజులు పాల్గొన్నారు.