Share News

అన్న క్యాంటీన్లు సిద్ధం

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:50 PM

అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినవిధంగా వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటు న్నారు.

అన్న క్యాంటీన్లు సిద్ధం
ప్రారంభానికి సిద్ధమైన కలెక్టరేట్‌లోని అన్నక్యాంటీన్‌

నేడు రెండు ప్రారంభానికి ఏర్పాట్లు

నరగ పాలక పరిధిలో మొత్తం ఐదు క్యాంటీన్లు

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 20: అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పినవిధంగా వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటు న్నారు. ఈ క్రమంలోనే కర్నూలు నగరంలో శనివారం రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. నగర పాలక పరిధిలో రెండింటిని 23న మంత్రి టీజీ భరత్‌ ప్రారంభిస్తారు. ఇంకో క్యాంటీన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

నగర పాలక పరిధిలో ఐదు అన్న క్యాంటీన్లు..

నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం ఐదు అన్న క్యాంటీన్లను సిద్ధం చేస్తున్నారు. కొండారెడ్డి బురుజు, కలెక్టరేట్‌, ఎస్టేట్‌ సెట్కూర్‌ కార్యాలయం, ఉల్చాల రోడ్డులోని పరిమళ నగర్‌లో, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సెట్కూరు, పరిమళ నగర్‌లోని రెండు క్యాంటీన్లను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతోపాటు కలెక్టరేట్‌, పాత బస్టాండులోని క్యాంటీన్లను సోమవారం రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ ప్రారంభించనున్నారు. గతంలో ఈ క్యాంటీన్ల స్థానంలో సచివాలయాలు ఉండేవి. వాటిన్నంటినీ మరో చోటికి తరలించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్‌కు ప్రతి రోజూ వందల మంది వస్తుంటారు. అదేవిధంగా కొండారెడ్డి బురుజు ప్రాంతానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఇక ఎస్టేట్‌లో ఎక్కువ శాతం పరిశ్రమలు ఉండటంతో అక్కడ పని చేసే కార్మికులకు కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టాలనే ఆలోచనతోనే ప్రారంభిస్తున్నారు. అంతేగాకుండా ఉల్చాల రోడ్డు పరిమళ నగర్‌ ప్రాంతంలో ఎక్కువ శాతం అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. ఇక ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వివిధ రాష్ట్రాల నుంచి రోగులతోపాటు వారి బంధువులు వస్తుంటారు.

మరమ్మతులకు రూ.50 లక్షలు..

ఒక్కో అన్న క్యాంటీన్‌ మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయించింది. క్యాంటీన్‌లలో కిచెన్‌, ఎలక్ర్టికల్‌, పెయింటింగ్‌, ఫర్నిచర్‌, టైల్స్‌, తదితర వాటి కోసం మొత్తం 5 క్యాంటీన్లకు రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ విభాగం అధికారుల పర్యవేక్షణలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

అన్ని హంగులతో అన్న క్యాంటీన్లు

నగర పాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లను అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం సూచించిన విధంగానే మరమ్మతులు చేయిస్తున్నాం. ఇంజనీరింగ్‌ అధికారులు వేగవంతంగా పనులు చేయిస్తున్నారు. ముందుగా రెండు క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధం చేశాం. ప్రజలకు రుచికరమై భోజనం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.

-ఎస్‌.రవీంద్రబాబు, కమిషననర్‌, నగర పాలక సంస్థ

Updated Date - Sep 20 , 2024 | 11:50 PM