Share News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..!

ABN , Publish Date - Nov 27 , 2024 | 11:13 PM

నిత్యం సమీక్షలు, ఫైళ్ల పరిశీలనతో బిజీగా ఉండే కీలక ఉద్యోగులు వారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తుంటారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..!
టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో పాల్గొన్న కలెక్టర్‌

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిత్యం సమీక్షలు, ఫైళ్ల పరిశీలనతో బిజీగా ఉండే కీలక ఉద్యోగులు వారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ జిల్లాను ప్రగతి బాటలో నడిపిస్తుంటారు. ఈ క్రమంలో ఒత్తిళ్లకు గురవుతుంటారు. అలాంటివారంతా ఆటల్లో నిమగ్నమయ్యారు. దైనందిన కార్యకలాపా లను పక్కన పెట్టి, స్థాయిభేదం మరచి సహచర ఉద్యోగులతో కలిసి పోటీపడ్డారు. కార్తీక వనభోజనాల పేరిట నిర్వహించిన ఈ ఉత్సాహ కార్యక్రమానికి నగరంలోని విజయవనం వేదికైంది. నగర శివారులోని విజయవనంలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొన్నప్పుడే పాలన వ్యవహరాలు సాఫీగా, పారదర్శకంగా సాగుతాయన్నారు. కార్తీక వనభోజనంలో సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు శాస్త్రీయత ఇమిడిఉందన్నారు. తీరికలేని విధుల్లో బిజీగా ఉండే అధికారులు వనభోజనాల నేపథ్యంలో ఒకే వేదికపై ఇలా కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా గడపటం శుభపరిణామన్నారు. అనంతరం అధికారులు చెస్‌, క్యారమ్స్‌, మ్యూజికల్‌ చైర్స్‌, వాలీబాల్‌, టాగ్‌ ఆఫ్‌ వార్‌, షాట్‌పుట్‌ తదితర క్రీడల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆగ్నిమాపక అధికారి అవినాష్‌, జాయింట్‌ కలెక్టర్‌ నవ్య, డీఎఫ్‌వో శ్యామల, పర్యాటకశాఖ డీఎం విజయ, డీఈవో శ్యామ్యూల్‌, ఎఫ్‌ఆర్‌వో విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 11:13 PM