Share News

శ్రీగిరికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:39 AM

శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం పురస్కరించుకుని ఆదివారం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

శ్రీగిరికి పోటెత్తిన భక్తులు

నేడు లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు

శ్రీశైలం, నవంబరు 10: శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం పురస్కరించుకుని ఆదివారం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో క్షేత్ర వీధులన్నీ భక్తులతో రద్దీగా దర్శనమిచ్చాయి. వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారం రోజులలో భక్తులందరికీ స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయ ఉత్తర మాడవీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద విశేష పూజలు నిర్వహించుకుని దీపారాధనలు చేశారు. దేవస్థానం అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం తాగునీరు, బిస్కెట్లు, అల్పాహారం అందజేశారు. దర్శనం అనంతరం భక్తులకు అన్నదాన భవనంలో అన్నప్రసాద వితరణ అందజేశారు. సాయంత్రం ఆలయ ప్రధాన ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా ఆకాశ దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆకాశదీప ప్రజ్వలనకు ముందుగా అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజను నిర్వహించి, దీప ప్రజ్వలన, దీపారాధనలు చేశారు. కార్తీకమాసోత్సవాల సందర్బంగా దేవస్థానం అఖండ శివ భజనల కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం కార్యాలయం సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించారు. స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

నేడు లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులు

కార్తీక రెండో సోమవారం పురస్కరించుకొని సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం నిర్వహించనుంది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా పూజాదికాలు జరిపి అనంతరం పుష్కరిణికి దశవిధ హారతులు సమర్పించనున్నారు. లక్ష దీపోత్సవం కార్యక్రమం సందర్భంగా పుష్కరిణి ప్రాంగణమంతా వివిధ ఆకృతులలో దీపాలను ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:39 AM